AXIOM-4 Mission : భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా ముగ్గురిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు సరిగా లేవని రేపు(జూన్‌10) జరగాల్సిన ప్రయోగం వాయిదా పడింది. ఒకరోజు ఆలస్యంగా జూన్ 11న నిర్వహించబోతున్నట్టు ఇస్రో ప్రకటించింది. 

"వాతావరణ పరిస్థితుల కారణంగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారతీయ గగన్యాత్రిని పంపే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం జూన్ 10 నుంచి జూన్ 11కి వాయిదా పడింది. జూన్ 11, 2025న సాయంత్రం 5:30లకు ప్రయోగం నిర్వహిస్తాం " అని ఇస్రో సోమవారం సాయంత్రం Xలో ఒక పోస్ట్‌ పెట్టింది.  

స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ మంగళవారం సాయంత్రం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ (KSC) నుంచి వెళ్లాల్సి ఉండగా ప్రయోగం వాయిదా పడింది.  

భారతీయ గగన్యాత్రిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం వాతావరణ పరిస్థితుల కారణంగా జూన్ 10, 2025 నుంచి జూన్ 11, 2025కి వాయిదా పడింది.

ఆక్సియం-4 (Ax-4) మిషన్‌లో కమాండర్ పెగ్గీ విట్సన్, పైలట్ శుక్లా, హంగేరీకి చెందిన నిపుణులు టిగోర్, పోలాండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కి-విస్నివ్స్కీ ఉన్నారు. మిషన్ కాలవ్యవధి 14 రోజులు.  

శుభాన్షు శుక్లా ఎవరు?  

1984లో సోవియట్ రష్యా సోయుజ్ అంతరిక్ష నౌకలో రాకేష్ శర్మ అంతరిక్ష ప్రయాణాన్ని చేపట్టడం ద్వారా చరిత్ర సృష్టించిన 41 సంవత్సరాల తర్వాత శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు.  ‘శుక్స్’ అనే పిలుచుకనే శుక్లా లక్నోలో జన్మించారు.  ఆక్సియం స్పేస్ ద్వారా ఇస్రో-నాసా మద్దతు ఉన్న వాణిజ్య అంతరిక్ష ప్రయాణంలో భాగం అయ్యారు. లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్ (CMS) శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని చూసేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. 'శుక్స్' అంతరిక్ష ప్రయాణాన్ని అభినందిస్తూ నగరం అంతటా అనేక హోర్డింగ్‌లు వెలిశాయి. స్పేస్‌ఎక్స్ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి CMS భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. ఈ ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  

ISSలో 14 రోజుల ప్రయోగంలో భాగంగా Ax-4 సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పాఠశాల విద్యార్థులు, అంతరిక్ష రంగ ప్రముఖులతో మాట్లాడనున్నారు. నాసా మద్దతుతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), బయోటెక్నాలజీ విభాగం (DBT) సహకారంతో అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన ఆహారం, పోషకాహార సంబంధిత ప్రయోగాలను శుక్లా నిర్వహించనున్నారు.

ఈ ప్రయాణ ఆలోచన 2023లో మొదలైంది. దీని కోసం NASA, ISRO మధ్య ఒక సహకార ఒప్పందం జరిగింది. ఫిబ్రవరి 27, 2024న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గాగన్యాన్ మిషన్ కోసం నాలుగు ఆస్ట్రోనాట్‌లను ప్రకటించారు, వీరిలో శుభాన్షు శుక్లా ఒకరు. ఆ తర్వాత, Axiom Space అనే అమెరికా కంపెనీ, SpaceXతో కలిసి ఈ Axiom-4 మిషన్‌ను ప్రారంభించే ఆలోచన చేసింది.  మొదట ఈ మిషన్ మే 29, 2025కి షెడ్యూల్ చేశారు. కానీ వాతావరణ సమస్యల కారణంగా జూన్ 8కి, పదికి ఇప్పుడు 11కి వాయిదా పడింది. ఆక్సియమ్ మిషన్ 4పై శుక్లా అనుభవాన్ని 2027లో ప్రణాళిక చేసన గగన్‌యాన్ మిషన్‌లో ఉపయోగపడనుంది. ISRO ఆక్సియమ్-4 మిషన్ కోసం రూ.550 కోట్లు ఖర్చు చేస్తోంది.