Youngest District Commissioner: 10వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి అసోంలోని సిబ్‌సాగర్ జిల్లాకు ఒక రోజు కమిషనర్‌గా గుర్తింపు పొందాడు. ఇటీవల అసోం ప్రభుత్వం AAROHAN అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో 9 నుంచి 12 తరగతి వరకూ నాలుగేళ్ల పాటు 8,750 మంది విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి కృషి చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులను ఎంపిక చేసి ప్రముఖులతో నిపుణ్య శిక్షణ అందిస్తారు. జీవితంలో తాము అనుకున్న వాటిని ఎలా సాధించాలో మార్గనిర్దేశం చేస్తారు. సెకండరీ ఎడ్యుకేషన్ విభాగంలో నాణ్యతను మెరుగుపరచడానికి అసోం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ మేరకు గ్రామీణ, ఏజెన్సీ, పేద కుటుబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారి నైపుణ్య శిక్షణకు దోహదం చేస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే వెబ్ పోర్టల్‌ను సైతం ప్రారంభించింది.  


AAROHAN పథకానికి అసోం తేయాకు తోటలకు చెందిన 10 తరగతి చదువుతున్న భాగ్యదీప్ రాజ్‌గర్ అనే విద్యార్థి ఎంపికయ్యాడు. దీంతో అతన్ని పోలీసులు బందోబస్తు నడుమ సిబ్ సాగర్ జిల్లా కమిషర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ భాగ్యదీప్ ఒకరోజు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం విద్యార్థి మాట్లాడుతూ..‘నా భావాన్ని వ్యక్తీకరించడానికి నాకు పదాలు లేవు. నేను జిల్లాకు అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అవుతానని నా కలలో ఎప్పుడూ అనుకోలేదు. ఒక్క రోజు బాధ్యతల్లో భాగంగా అటవీ, విద్యాశాఖతోపాటు జిల్లాలోని అన్ని శాఖాధిపతులతో సమావేశం నిర్వహించాను.’ అని ఆనందం వ్యక్తం చేశాడు. ఒక ఐఏఎస్ అధికారి తన విధులను ఎలా నిర్వర్తిస్తున్నారో చూసే అవకాశం తనకు లభించిందని, వారి పని శైలి ఎలా ఉంటుందో తెలిసిందన్నాడు. తన పాఠశాల, బక్తా బార్బామ్ హయ్యర్ సెకండరీ స్కూల్, తన గ్రామంలో సమస్యలను తెలియజేయడానికి ఒక అవకాశం వచ్చిందని, దాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నట్లు చెప్పారు. తన వినతులను పరిష్కారానికి అధికారులు తనకు హామీ ఇచ్చారని భాగ్యదీప్ అన్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.


సిబ్‌సాగర్ జిల్లా కమిషనర్ ఆదిత్య బిక్రమ్ యాదవ్ మాట్లాడుతూ..  బాలుడు భాగ్యదీప్ చాలా మందికి ప్రేరణగా నిలిచారని అన్నారు. ఆ అబ్బాయి చాలా కష్టాలు ఎదుర్కొని చదువు కొనసాగిస్తున్నాడని, చాలా తెలివైన విద్యార్థి అన్నారు. భవిష్యత్తులో బ్యూరోక్రాట్ కావాలనేది బాలుడి లక్ష్యం అన్నారు. చాలా మంది విద్యార్థులు అలాంటి కలలను కంటున్నారని, వాటిని నిజం చేయడానికి అవకాశాలు అవసరం అని డీసీ అభిప్రాయపడ్డారు.  ఒక రోజులో యువ డీసీ భాగ్యదీప్ ఐదు గంటల పాటు జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా అవకాశం వస్తే స్థానిక యువతకు ఫుట్‌బాల్‌లో శిక్షణ ఇస్తానని చెప్పారు.


ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఒక వ్యవసాయ కూలీ కుమార్తె ఎం.శ్రావణి (16) అనంతపురం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గార్లదిన్నెలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో సీనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న శ్రావణి  అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఒక రోజు కలెక్టర్‌గా పనిచేశారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial