Sanjay Singh: 


సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు..


ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీకి ఉన్న చివరి అస్త్రం ఇదే అని విమర్శించారు. ఈడీ సోదాల్లో ఒక్క రూపాయి కూడా దొరకలేదని, ఇకపై కూడా ఏమీ దొరకదని తేల్చి చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో భాగంగా ఈడీ సంజయ్ సింగ్ ఇంట్లో సోదాలు చేసింది. ఇప్పటికే ఈ కేసు ఢిల్లీలో సంచలనం సృష్టించింది. పలువురు ఆప్‌ నేతల ఇళ్లలో సోదాలు జరిగాయి. మనీశ్ సిసోడియా ఇదే కేసులో జైలుకెళ్లారు. అంతకు ముందు ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌నీ జైలుకి పంపారు. అప్పటి నుంచి మధ్య మధ్యలో ఈ కేసు అలజడి రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ సింగ్‌పైనా దృష్టి పెట్టింది ఈడీ. దీనిపైనే ప్రధాని మోదీని టార్గెట్‌గా చేసుకుని అరవింద్ కేజ్రీవాల్‌ విమర్శలు చేశారు. 


"ఓడిపోయిన వ్యక్తికి (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ నిరాశతోనే ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎన్నికల్లో గెలిచేందుకు ఇంత కన్నా దారి వాళ్లకు దొరకలేదు. సంజయ్ సింగ్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిది. కానీ ఒక్క రూపాయి కూడా కనిపెట్టలేకపోయింది. ఇకపై జరిగే సోదాల్లోనూ ఏమీ దొరకదు. 2024లో జరగనున్న ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీకి అర్థమైంది. అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ..ED,CBI యాక్టివ్ అయిపోతాయ్"


- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి






అందరి ఇళ్లలోనూ సోదాలు..


ఈ కేసుతో సంబంధం ఉన్న అందరి ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. సంజయ్ సింగ్ ఆఫీస్‌ స్టాఫ్‌ని ప్రశ్నించారు అధికారులు. ఈ ఎక్సైజ్ పాలసీ కేసులో దాఖలైన ఛార్జ్‌షీట్‌లో సంజయ్ సింగ్ పేరు కూడా ఉంది. చాలా రోజులుగా ఈయనపై ఈడీ ఫోకస్ పెట్టినప్పటికీ... తొలిసారి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించింది. సోదాలపై సంజయ్ సింగ్ తండ్రి స్పందిస్తూ.. డిపార్ట్‌మెంట్ తన పని చేస్తోందని, తాము వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఈ కేసులో సంజయ్ సింగ్ కు క్లీన్ చిట్ వచ్చే వరకు వేచి ఉంటామన్నారు. ఈ కేసులో ఢిల్లీ వ్యాపారవేత్త దినేష్ అరోరా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దినేష్ ను సంజయ్ సింగ్ దగ్గరుండి మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు సమావేశపరిచాడని ఈడీ తన అభియోగాల్లో పేర్కొంది.