Arvind Kejriwal: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారాల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ గురించి చర్చించారు. ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకించాలని కోరారు. ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్ష పార్టీల మద్దతును కేజ్రీవాల్ కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తో కలిసి చెన్నై వచ్చిన కేజ్రీవాల్.. ఎంకే స్టాలిన్ తో భేటీ అయ్యారు. కేంద్ర ఆర్డినెన్స్ ను పార్లమెంట్ లో వ్యతిరేకించాలని డీఎంకే చీఫ్ ను కోరగా, సహకరిస్తామని స్టాలిన్ భరోసా ఇచ్చారు. 


కేజ్రీవాల్ పోరాటానికి స్టాలిన్ మద్దతు


అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై చర్చించినట్లు తెలిపారు. కేంద్ర సర్కారు నిర్ణయం అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు, ఆమ్ ఆద్మీ పార్టీకి డీఎంకే అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు.. లెఫ్టినెంట్ గవర్నర్ ను ఉపయోగించి ఢిల్లీ, ఆప్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందని ఎంకే స్టాలిన్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ విషయంలో కేజ్రీవాల్ కు పూర్తి మద్దతు ఇవ్వాలని నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.


విపక్షాల మద్దతు కూడగడుతున్న కేజ్రీవాల్


కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను శుక్రవారం కలిసి మద్దతు కోరనున్నారు. 


దేశ రాజధాని ఢిల్లీపై కేంద్రం పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్న కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఇటీవల ఊరట లభించింది. పబ్లిక్ ఆర్డర్, పోలీసు, భూ వ్యవహారాలు తప్పించి మిగతా అన్ని శాఖలపై అధికారం ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడా రాజ్యాంగ ధర్మాసనం మే 11న ఈ మేరకు తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్రం పెత్తనం చెలాయించే అధికారుల బదిలీలకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే అధికారుల బదిలీలు ఆపేలా కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కాగా, పార్లమెంట్ లోని ఎగువ సభలో ప్రతిపక్షాలకు బలం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్డినెన్స్ ను అక్కడ ఎదుర్కొనేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విపక్ష పార్టీల మద్దతు కూడగడుతున్నారు. అందులో భాగంగానే ప్రతిపక్షాల పార్టీల అధినేతలను, బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తున్నారు.