Arvind Kejriwal Requested Supreme Court To Extends Interim Bail: ఢిల్లీ లిక్కర్ పాలసీకి (Delhi Liquor Policy) సంబంధించి మనీ లాండరింగ్ (Money Laundering) ఆరోపణలతో అరెస్టై ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejrwal) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రచారం క్రమంలో తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను మరో 7 రోజులు పొడిగించాలని కోరారు. కాగా, లిక్కర్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ ఆలస్యం అవుతుండడంతో ఎన్నికల్లో ప్రచారం నిర్వహించుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో సుప్రీంకోర్టు మే 10న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది.


ఆరోగ్య సమస్యలతో..


కేజ్రీవాల్ తన ఆరోగ్య సమస్యలను సైతం పేర్కొంటూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయనకు ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని.. మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యుల బృందం తెలిపింది. అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ 7 కిలోల బరువు తగ్గారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. కీటోన్ స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. కేజ్రీవాల్ PET - CT స్కాన్ తో సహా కీలకమైన వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని.. ఇందుకోసం మరో 7 రోజులు బెయిల్ పొడిగించాలని ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు. 


కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాలని దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసినా వాటికి.. స్పందించకపోవడంతో ఈడీ తమ కస్టడీలోకి తీసుకుంది. అనంతరం కోర్టులో హాజరు పరచగా విచారించి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించగా.. లోక్ సభ ఎన్నికల ప్రచారం క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా పోలింగ్ ముగిసిన అనంతరం జూన్ 2న ఆయన అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉంది. అయితే, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్ 7 రోజులు పొడిగించాలని కేజ్రీవాల్ సుప్రీంను ఆశ్రయించారు.


ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పైనా..


అటు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ వాదనలు విననుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు నిరాకరించింది. దీంతో ఆమె ఢిల్లీ ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించారు. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా.. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా మార్చి 26 నుంచి తీహార్ జైలులో ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి జైల్లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆమె 2 బెయిల్ పిటిషన్లు వేశారు.