Strategic fuel shortage:  తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా  నో స్టాక్  బోర్డులు దర్శనమిస్తుండటంతో, ఇది సహజంగా ఏర్పడిన కొరత కాదని, రాబోయే భారీ ధరల పెంపునకు సంకేతమనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.  

 ఎన్నికల వేళ.. వ్యూహాత్మక నిశ్శబ్దం 

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ధరలను పెంచకుండా నియంత్రించడం ప్రభుత్వాలకు ఆనవాయితీగా వస్తోంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 నుండి 110 డాలర్ల మధ్య మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశీయంగా ధరలు పెంచకపోవడంతో చమురు కంపెనీలు ఊహించని స్థాయిలో నష్టాలను చవిచూస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం, కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై సుమారు  రూ. 20 , డీజిల్‌పై ఏకంగా  రూ. 100  వరకు నష్టపోతున్నట్లు సమాచారం. ఈ లోటును పూడ్చుకోవడానికి రోజుకు దాదాపు  రూ. 1,600 కోట్ల భారాన్ని కంపెనీలు భరిస్తున్నాయి.

 సరఫరాలో కోత.. డీలర్లపై ఒత్తిడి 

ఈ భారీ నష్టాల దృష్ట్యా, చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ పరిమితులను  ఒక్కసారిగా రద్దు చేశాయి. గతంలో 3 నుండి 5 రోజుల వరకు ఉండే క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేసి,  ముందు నగదు చెల్లిస్తేనే లోడ్  అనే నిబంధనను అమల్లోకి తెచ్చాయి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డీలర్లు నిల్వలను ముందే కొనుగోలు చేయలేకపోతున్నారు. మరోవైపు, ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఏప్రిల్ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 20 నుండి రూ. 25 వరకు పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. ఈ లాభాపేక్షతోనే కంపెనీలు కావాలనే సరఫరాను నియంత్రిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

 యుద్ధంతో ముడిచమురు మంట 

పశ్చిమ ఆసియాలో  యుద్ధ వాతావరణం నెలకొనడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వంటి కీలక మార్గాలు మూతపడటంతో రవాణా ఖర్చులు పెరిగాయి. దీనికి తోడు మన దేశం తన అవసరాల్లో 90% చమురును  దిగుమతి చేసుకుంటుంది.  క్రూడ్ ధర పెరిగితే, భారత్ దిగుమతి బిల్లు పెరుగుతుంది.  ఈ అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్‌లో కృత్రిమ కొరతకు, భవిష్యత్తులో ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతున్నాయి.

పానిక్ బయింగ్.. ఖాళీ అవుతున్న బంకులు 

ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయంతో వాహనదారులు ఒకేసారి బంకులపై పడుతున్నారు. సాధారణ విక్రయాల కంటే డిమాండ్ ఒక్కసారిగా  మూడు రెట్లు పెరగడంతో, స్టాక్ ఉన్న బంకులు కూడా గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతున్నాయి. వ్యవసాయ పనుల కోసం డీజిల్ అవసరమయ్యే రైతులకు, నిత్యావసర రవాణాకు ఇది పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వం ఈ కొరతను కేవలం వదంతులు  అని కొట్టిపారేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో బంకుల మూసివేత ,  డీలర్ల గోడు మాత్రం వేరే కథను చెబుతోంది.  చమురు సంస్థల ఆర్థిక క్రమశిక్షణ పేరుతో జరుగుతున్న ఈ సరఫరా కోత, మే మొదటి వారంలో పెట్రో బాంబు పేలేందుకు రంగం సిద్ధం చేస్తోంది