బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఒడిశాలో దక్షిణ ప్రాంతంలో కోస్తా తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూలై 26 నాటికి వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని మంగళవారం సాయంత్రం బులెటిన్‌లో ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో మల్కన్‌గిరి, కోరాపుట్, నబరంగాపూర్, రాయగడ, గజపతి, గంజాంలలో బుధవారం ఉదయం వరకు భారీ వర్షాలు (7 నుండి 11 సెం.మీ.) కురిసే అవకాశం ఉందని సూచించింది. 


దక్షిణ అంతర్గత ఒడిశాలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో అప్రమత్తంగా  ఉండాలని ఆరెంజ్  అలెర్ట్ జారీ చేసింది. జూలై 25న గజపతి, గంజాం, పూరి, మల్కన్‌గిరి, కోరాపుట్‌, రాయగడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (7 నుంచి 20 సెం.మీ.) కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది.


ఏపీపై అల్పపీడన ప్రభావం
ఐఎండీ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగనుంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏర్పడనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. 


దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. మంగళవారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, బుధవారం భారీవర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు. మంగళవారం కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.


భారత దేశం వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు వారాలుగా ఉత్తరాఖండ్, ఢిల్లీ, గుజరాత్‌లలో వాన పడుతున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నీటిలో చిక్కుకుంది. అంతకు ముందు ఢిల్లీలో భారీ వర్షాలకు యమనా నదిలో వరద నీరు దేశ రాజధానిని ముంచెత్తింది. ఉత్తరాఖండ్‌ పరిస్థితి చెప్పతరం కాదు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత వారం రోజలు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముసురేసుకున్నాయి. ప్రతి రోజు కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు, కూలీలు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial