ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. నియంత్రణ రేఖ, సరిహద్దుల వెంట పాక్ ఆర్మీ అమాయక పౌరులపై కాల్పులు జరిపింది. దాంతో పాక్‌తో సరిహద్దు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పోలీసులు, భద్రతా సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. బహిరంగ సహావేశాలపై నిషేధం విధించడంతో పాటు.. పాక్‌తో సరిహద్దు ప్రాంతాల మార్గాలను మూసివేశారు.

ఆపరేషన్ సింధూర్ తర్వాత రోజు (గురువారం) పాకిస్థాన్‌తో పంచుకుంటున్న 1,037 కి.మీ పొడవైన సరిహద్దును రాజస్థాన్ లో మూసివేశారు. దాంతో పాటు భద్రతను కట్టుదిట్టం చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న పరిస్థితుల్లో సరిహద్దు భద్రతా దళం (BSF), భారత వైమానిక దళం (IAF) మరింత అప్రమత్తం అయ్చాయి. సరిహద్దు ప్రాంతాల వెంట, నిరంతరం నిఘా, పర్యవేక్షిస్తున్నారు. 

రాజస్తాన్‌లోని జోధ్‌పూర్, జైసల్మేర్, నాల్, ఫలోడి, ఉత్తర్లైలతో సహా అన్ని పశ్చిమ ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలు అప్రమత్తంగా ఉన్నాయి. అధునాతన ఆయుధాలతో ఉన్న సుఖోయ్ సు-30 ఎం.కె.ఐ.లతో సహా యుద్ధ విమానాలు శ్రీ గంగనగర్ నుంచి కచ్ రణ్ వరకు ఆకాశంలో పహారా కాస్తున్నాయి. 

గగనతలంలో బీఎస్‌ఎఫ్ నియంత్రణ రేఖకు దగ్గరగా గస్తీని తీవ్రతరం చేసింది. అనుమానాస్పద కదలికలు గుర్తిస్తే వేంటనే చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. సున్నితమైన ప్రాంతాలకు అదనపు దళాలను తరలిస్తున్నారు. 

యాంటీ డ్రోన్ సిస్టమ్ యాక్టివేట్

యాంటీ-డ్రోన్ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. సరిహద్దు దాటి ఏదైనా ఎయిర్ స్ట్రైక్స్ దాడిని అడ్డుకునేందుకు 24 గంటలపాటు పర్యవేక్షిస్తున్నారు. సైన్యం భారీగా మోహరించినప్పటికీ, రాజస్థాన్ సరిహద్దులోని గ్రామాలను ఇంకా ఖాళీ చేయలేదు. బీఎస్‌ఎఫ్ రాజస్థాన్ ఫ్రంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఎం.ఎల్. గర్గ్ ఆ ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయడం కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదనపు సిబ్బందిని రప్పించి, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం చేస్తున్నారు. 

శత్రు విమానాలు ఏవైనా భారత గగనతంలోకి ప్రవేశించగానే కూల్చివేసేందుకు మన బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. భారత సైన్యం కూడా పాక్ నుంచి ఏమైనా దాడులు జరిగితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై, పీఓకేలోని స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తరువాత బికనీర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 

బికనీర్‌లోని అన్ని పెట్రోల్ పంపులు 2,000 లీటర్ల పెట్రోల్, 5,000 లీటర్ల డీజిల్‌ను రిజర్వ్ చేసి ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర ఇంధన నిల్వను అందుబాటులో ఉంచడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఏమైనా జరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి సైతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

ఖాజువాల్ నుంచి శ్రీ గంగనగర్ వరకు ఉన్న ప్రాంతాలతో పాటు పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న రాజస్థాన్ ప్రాంతాల్లో పాకిస్థాన్ సైన్యం కదలికలపై భారత బలగాలు నిఘా పెట్టాయి. సరిహద్దులోని పలు ప్రంతాలలో ఖారా తోబా, సాదికాబాద్, ఖాన్‌పూర్, సిర్దఖ్లి, బిజ్నోత్, జహురివాల్, రాహిమ్యార్ ఖాన్, లియాక్వత్‌పూర్, ముజ్‌గర్ ఫోర్ట్, ఫకిర్వాలి, యజ్‌మాన్ మండి, ఫోర్ట్ అబ్బాస్, బహావల్‌నగర్, బహావల్‌పూర్, కె.కె. టిబ్బా, లాల్ సహరణా నేషనల్ పార్క్ వంటి ప్రాంతాలలో భారత సైన్యం గస్తీ పెంచింది.