Kuno National Park: 


ధాత్రి మృతి 


మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా చనిపోయింది. ధాత్రి (Dhatri Cheetah) అనే ఆడ చీతా మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మరణానికి కారణమేంటన్నది పోస్ట్‌మార్టం తరవాతే తేలనుంది. ఈ పార్క్‌లో చనిపోయిన 9వ చీతా ఇది. సౌతాఫ్రికా, నమీబియా నుంచి భారత్ దాదాపు 20 చీతాలను దిగుమతి చేసుకుంది. అప్పటి నుంచి వాటిని కునో నేషనల్ పార్క్‌లో సంరక్షిస్తోంది. అయితే...రకరకాల కారణాల వల్ల ఇప్పటి వరకూ 8 చీతాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇప్పుడు తొమ్మిదో చీతా ప్రాణాలు కోల్పోయింది. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా వీటిని తీసుకొచ్చినప్పటికీ...ఇక్కడి వాతావరణానికి అవి అలవాటు పడలేకపోతున్నాయి. చనిపోయిన 9 చీతాల్లో మూడు చిరుత పిల్లలు కూడా ఉన్నాయి. వాటిలో అవే ఘర్షణ పడిన చీతాలు చాలా తీవ్రంగా గాయపడ్డాయి. కొన్ని ఆ గాయాల నుంచి బయటపడినప్పటికీ కొన్ని మాత్రం చాలా కాలంగా అనారోగ్యానికి గురయ్యాయి. ఫలితంగా...ప్రాణాలు కోల్పోయాయి. వీటితో పాటు ఈ వేసవిలో విపరీతమైన ఉష్ణోగ్రతలు వాటి ఆరోగ్యాన్ని దెబ్బ తీశాయి. వీటితో పాటు మరో కారణంపైనా చర్చ జరిగింది. చీతాలకు రేడియో కాలర్స్‌ పెట్టడం వల్లే అవి చనిపోతున్నాయన్న వాదన వినిపిస్తోంది. 


రేడియో కాలర్స్ వల్లేనా..?


ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నదేంటంటే...ఈ రేడియో కాలర్స్‌ ద్వారా చీతాలు ఎక్కడకు వెళ్తున్నాయన్న ట్రేసింగ్ చేయడం సులభతరమవుతుంది. కానీ...వీటి వల్ల చీతాలకు స్కిన్ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తున్నాయి. ఇవే బ్లడ్ ఇన్‌ఫెక్షన్లకూ దారి తీస్తున్నాయి. అందుకే...ఇవి చనిపోతున్నాయని వివరిస్తున్నారు కొందరు నిపుణులు. అయితే...ఈ మరణాలపై ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నారు అధికారులు. ఇవేవీ అసహజ మరణాలు కాదని అంటున్నారు. చీతాలను సంరక్షించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మిగతా చీతాలకూ వైద్య పరీక్షలు చేస్తున్నట్టు వివరిస్తున్నారు. అయినా...మరణాల రేటు పెరుగుతూనే ఉండటం కలవర పెడుతోంది.  ఈ క్రమంలో అధికారులు కునో నేషనల్ పార్కులో ఆరు చీతాలకు అమర్చిన రేడియో కాలర్లను తొలగించారు. వైద్య పరీక్షలు చేయడానికి రేడియో కాలర్లను తొలగించినట్లు చెప్పారు. వీలైతే రేడియో కాలర్లకు బదులుగా డ్రోన్ లను ఉపయోగిస్తే ఎలా ఉంటుందని అధికారులు ఆలోచిస్తున్నారు. 


సుప్రీంకోర్టు అసహనం...


నమీబియా నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడలేకపోయాయి. ఈ మరణాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మిగతా చీతాలను వెంటనే రాజస్థాన్‌కి తరలించాలని సూచించింది. సౌతాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల సంరక్షణపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పింది. గత వారమే రెండు చీతాలు చనిపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రాజస్థాన్‌లోని జవాయ్ నేషనల్ సాంక్చురీలో మిగిలిన చీతాలు ఉంచేందుకు అవకాశాలున్నాయేమో చూడాలని ధర్మాసనం సూచించింది. ఉదయ్‌పూర్‌ నుంచి దాదాపు 200 కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉన్న Jawai National Park చీతాలకు ఆవాసయోగ్యంగా ఉంటుందో లేదో పరిశీలించాలని చెప్పారు.


Also Read: Weather Update: మరో 4 రోజులు భారీ వర్షాలు, హెచ్చరించిన భారత వాతావరణ శాఖ - ఎక్కడంటే?