Uddhav vs Shinde: ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే(UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మొన్నటికి మొన్న శివసేన విల్లు, బాణం గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం షిండే వర్గానికి కేటాయించింది. ఇప్పుడు పార్లమెంటులోని శివసేన పార్లమెంటరీ కార్యాలయాన్ని కూడా షిండే వర్గానికి కేటాయించారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని పార్లమెంటులోని శివసేన కార్యాలయాన్ని షిండే వర్గానికి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. పార్లమెంటులోని శివసేన కార్యాలయంపై ఉద్ధవ్ వర్గానికి ఇప్పుడు ఎలాంటి హక్కులు ఉండవు.


విధాన్ భవన్ లోని శివసేన కార్యాలయం స్వాధీనం


మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మంగళవారం(ఫిబ్రవరి 21) శివసేన జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర శివసేన నేతలు హాజరవుతారని తెలిపారు. ఎన్నికల సంఘం శివసేన గుర్తును షిండే వర్గానికి కేటాయించిన నేపథ్యంలో విధాన్ భవన్ లోని శివసేన కార్యాలయాన్ని షిండే వర్గం సోమవారం(ఫిబ్రవరి 20) రోజు స్వాధీనం చేసుకుంది.


శివసేన ఆస్తులపై నాకు ఎలాంటి దురాశ లేదు


బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు తాము వారసులమని, శివసేన పార్టీ ఆస్తులపై ఎలాంటి ఆశ లేదని, ఆస్తులపై ఎలాంటి దావా వేయబోమని ఏక్ నాథ్ షిండే సోమవారం తెలిపారు. తాను ఇతరులకు ఇచ్చే వ్యక్తిని అని, ధనాపేక్షతో వచ్చిన వారు 2019లో రాంగ్ స్టెప్ వేశారని విమర్శించారు.


ఎన్నికల సంఘం నుంచి షాక్, సుప్రీంకోర్టు నుంచి ఆశ


ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా పరిగణించి దానికి ఎన్నికల గుర్తు విల్లు, బాణం కేటాయించాలన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే వర్గం సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పదో షెడ్యూల్ ప్రకారం అనర్హత, ఎన్నికల ప్రక్రియలు వేర్వేరు అంశాలని, శాసనసభ్యులపై అనర్హత వేటు వేయడం రాజకీయ పార్టీ సభ్యత్వం రద్దుపై ఆధారపడి ఉండదని ఎన్నిక సంఘం తప్పుపట్టిందని పిటిషన్ లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఉద్ధవ్ ఠాక్రే తన పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. బుధవారం(ఫిబ్రవరి 22) విచారణ జరగనుంది. జూన్ 2022లో తనపై తిరుగుబాటు చేసిన వర్గంలోని 16 మంది శివసేన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ఠాక్రే గతేడాది చేసిన మరో అభ్యర్థనపై సుప్రీం కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని అన్యాయమంటూ ఆయన సుప్రీం తలుపు తట్టారు.