GSLV Mark 3 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సాధించింది. అత్యంత బరువైన జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ ప్రయోగంలో 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి చేర్చింది. నెల్లూరు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అక్టోబర్ 23వ తేదీ అర్ధరాత్రి 12:07 గంటలకు జీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఇస్రో రాకెట్ జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రైవేట్ కమ్యూనికేషన్ సంస్థ వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ప్రయోగానికి 24 గంటల ముందు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. వచ్చే ఏడాది మొదట్లో మరో 36 వన్‌వెబ్ ఉపగ్రహాలను జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నామని ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. 


వాణిజ్య ప్రయోగం 


జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శనివారం సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈవో ఆళ్ల శ్రీనివాసులరెడ్డి ఆయనకు అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం మీడియాతో మాట్లాడారు ఇస్రో చైర్మన్. ఈ రాకెట్ ద్వారా 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తున్నామని తెలిపారు. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగమన్నారు. విదేశాలకు చెందిన ఉపగ్రహాలను భారత్ కక్ష్యల్లో ప్రవేశ పెట్టేలా ఒప్పందం కుదుర్చుకుందన్నారు.