Mandapet Family suicide in varanasi: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం... ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఓ కాటేజీలో ఆత్మహత్య చేసుకుంది. భార్య-భర్తతోపాటు ఇద్దరు కుమారులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారణాసిలోని దశాశ్వమేధ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవనాథపురలో నిన్న (గురువారం) సాయంత్రం ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యం కావడం సంచలనంగా మారింది. కైలాష్‌ భవన్‌ మూడో అంతస్తులోని సత్రం రెండో అంతస్తులోని S-6 రూమ్​ తీసుకున్నారని యూపీ పోలీసులు తెలిపారు. వీరిది అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటగా గుర్తించారు. 


మండపేటకు చెందిన గుండవరపు కొండబాబు(50), లావణ్య(45) దంపతులతో పాటు వారి కుమారులు రాజేష్‌(25), జైరాజ్(23) కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమింగా తేల్చారు. కొండబాబు మండపేట పెద్దకాల్వ సమీపంలో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈయన కుమారుడు రాజేష్.. సత్యశ్రీ సెంటర్‌లోని ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. డిసెంబర్ 3న వీరి కుటుంబం అంతా వారణాసి వెళ్లింది. గతంలో వీరు పెద్ద కాల్వ  ప్రాంతంలో ఉండేవారు. ఇప్పుడు మండపేటలోని గాంధీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారని సమాచారం. 


అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అప్పులు ఎక్కువవడం.. వాటికి వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని స్థానికులు చెప్తున్నారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో... ఆత్మహత్య చేసుకుని ఉండారని పోలీసులు ప్రాధమిక విచారణలో వెల్లడించారు. ఈ కేసులో మృతుడు కొండబాబు సుసైడ్ లెటర్ కీలకంగా మారింది. అందులో పూర్తి వివరాలు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. వారిని ఇబ్బంది పెట్టిన వారి పేర్లు కూడా సూసైడ్‌ నోట్‌లో ఉన్నట్టు చెప్తున్నారు యూపీ పోలీసులు. ఆ కుటుంబం గత రెండు నెలలుగా ఇల్లు వదిలి బయట నివాసముంటోంది చెప్పారు. సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరిస్తోంది. అయితే... మృతదేహాలను ఇక్కడికి తెస్తారా.. లేకపోతే అక్కడే దహన సంస్కారాలు పూర్తిచేస్తారా అన్నది తేలాల్సి ఉంది. 


నిన్న (గురువారం) సాయంత్రం వరకు వీరి గది తలుపులు లోపల నుంచి తాళం వేసి ఉందని గుర్తించారు. 5 గంటల ప్రాంతంలో రూమ్​ను క్లీన్ చేసేందుకు స్వీపర్ వచ్చి తలుపు తట్టినా తెరవకపోవడంతో కిటికీలోంచి లోపలికి చూశాడు. గదిలో నలుగురూ వేలాడుతూ కనిపించడంతో స్వీపర్ కంగారుగా కిందికి వచ్చి సమాచారాన్ని అధికారులకు అందిచాడు. ఘటనపై యూపీ పోలీసులు విచారణ చేపట్టారు. అప్పుల బాధలే ఆత్మహత్యకు కారణమని తేల్చారు. ఆ కుటుంబం బస చేసిన గదిలో పలు వస్తువులు కూడా కనిపించాయి. గదిలో నుంచి పెట్రోల్‌ నింపిన మూడు బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. గదిలో విషపూరిత పదార్థం, కొన్ని మందులు కూడా కనిపించాయని చెప్తున్నారు పోలీసులు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకునే.... కుటుంబమంతా కాశీకి వచ్చారని పోలీసులు తెలిపారు. అప్పుల వివరాలను సూసైడ్ నోట్​లో రాశారని చెప్పారు. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న వ్యక్తులను విచారించేందుకు ఏపీ పోలీసులను సంప్రందించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు గత రెండు నెలలుగా వివిధ ఆలయాలను  సందర్శించినట్లు తెలుస్తోంది.