ఎట్టకేలకు వారిస్ పంజాబ్ చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను 36 రోజుల తర్వాత పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలిస్తాన్ మద్దతుదారుడు అమృతపాల్ సింగ్‌ను పోలీసులు మోగాలోని గురుద్వారా నుండి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీంతో 36 రోజుల పోలీసుల అన్వేషణకు తెరపడింది. అజ్నాలా ఘటన తర్వాత అతడు పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న అతని భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను మూడు రోజుల క్రితం గురువారం (ఏప్రిల్ 21) అమృత్‌సర్ విమానాశ్రయంలో అడ్డుకున్నారు.


అమృత్ పాల్‌కు సంబంధించిన అనుచరులు, సహచరులు అందరినీ ఇప్పటికే అరెస్టు చేశారు. అతని సహచరులను లోతుగా విచారణ చేశారు. అతని భార్యపై పోలీసులు ఒత్తిడి తీసుకురావడంతో అతడి ఆచూకీ తెలిసి, అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అమృత్ పాల్‌ని దిబ్రూగఢ్ జైలుకు పంపే అవకాశం ఉంది. అమృత్ పాల్‌ పరారీలో ఉన్న సమయంలో, ఆయన చాలాసార్లు సోషల్ మీడియా ద్వారా వీడియోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.






మార్చి 18 నుంచి పరారీలో 


మార్చి 18న అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతడికి అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఇటీవల పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు. దాన్ని వ్యతిరేకిస్తూ అమృత్‌ పాల్‌ సింగ్ పిలుపు ఇచ్చి.. ఫిబ్రవరి 24న పెద్ద సంఖ్యలో యువత అమృత్‌ సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశారు. అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌ పాల్‌పై కేసు నమోదైంది. ఆ తర్వాత అమృత్‌ పాల్‌ పారిపోయారు.


అలా అతణ్ని, అతని సహచరులను పట్టుకునేందుకు పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. ఈ సమయంలో పోలీసులు అతని సహచరులను చాలా మందిని అరెస్టు చేశారు, అయితే అమృత్ పాల్ మాత్రం దొరకలేదు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం నిరంతరం వెతుకుతున్నారు. పోలీసులకు దొరక్కుండా ఎప్పటికప్పుడు వేషాలు మారుస్తూ బురిడీ కొట్టించాడు.