Indian Navy Rescued Ship Hijack: సోమాలియా (Somalia) తీరంలో హైజాక్(Hijack) గురైన ఎంవీ లీలా నార్‌ఫోక్ నౌకలోని 15 మంది భారతీయులతో పాటు మిగతా సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. సోమాలియా తీరంలో గురువారం సాయంత్రం భారత్‌కు చెందిన నౌక హైజాక్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నౌకలోని భారత సిబ్బందిని రక్షించడానికి నేవీ రంగంలోకి దిగింది. నలువైపుల నుంచి గాలింపు చేపట్టింది. యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, P-8I, సుదూర లక్ష్యాలను ఛేదించే ప్రిడేటర్ MQ9B డ్రోన్‌లను మోహరించింది. ఓడను వదిలివేయమని సముద్రపు దొంగలకు హెచ్చరిక జారీ చేసింది.
ఎలైట్ కమాండోలు, మార్కోస్, కార్గో షిప్‌లోకి వెళ్లి 15 మంది భారతీయ సిబ్బందిని రక్షించారు. ఓడలో ఉన్న 15 మంది భారతీయులతో సహా మొత్తం 21 మంది సిబ్బందిని సిటాడెల్ నుంచి సురక్షితంగా తరలించినట్లు భారత నావికాదళ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపారు. ఆ సమయంలో ఓడలో హైజాకర్లు లేరని, ఆ విషయాన్ని కమాండోలు ధృవీకరించారని ఇండియన్ నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇండియన్ నేవీ సముద్ర గస్తీ విమానం మొహరింపుతో సుముద్రపు దొంగలు తోక ముడిచారని ఓ అధికారి తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఇతర ఏజెన్సీల సహకారం కూడా తీసుకున్నారు.
హైజాక్ గురైన నౌక దుబాయ్‌కు చెందిన లీలా గ్లోబల్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ కుంజర్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ నేవీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కష్ట సమయంలో బాధ్యతాయుతంగా స్పందించిన సిబ్బందికి సైతం ఆయన ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ జరిగింది
సోమాలియా తీరంలో 15 మంది భారత సిబ్బంది ఉన్న ఓడ హైజాక్‌కు గురైంది. లైబీరియన్ జెండా, 15 మంది భారత సిబ్బందితో ఉన్న ఓడ హైజాక్‌కు గురైనట్లు సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు. గురువారం సాయంత్రం ఓడ హైజాక్‌కి సంబంధించిన సమాచారం అందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది. హైజాక్ అయిన నౌక ఎంవీ లిలా నోర్‌ఫోక్‌గా అధికారులు వెల్లడించారు. నౌకపై నిఘా ఉంచేందుకు ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్‌లను మోహరించినట్లు అధికారులు తెలిపారు.
భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక INS చెన్నై పరిస్థితిని పరిష్కరించడానికి హైజాక్ చేసిన ప్రాంతానికి వెళుతోంది. షిప్‌లో పరిస్థితుల్ని అంచనా వేయడానికి సిబ్బందితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో షిప్ హైజాకింగ్ ప్రయత్నాల గురించి తెలిసిన వెంటనే ఇండియన్ నేవీ వేగంగా స్పందించింది. నౌకలో ఆరుగురు దుండగులు ఉన్నట్లు జనవరి 4న సాయంత్రం సందేశం అందింది.
తాజా పరిస్థితులకు అనుగుణంగా ఇండియన్ నేవీ హైజాక్‌కు గురైన ఓడకు సాయంగా సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం INS Chennaiని రంగంలోకి దించింది. అలాగే నేవీకి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్ హైజాక్‌కు గురైన నౌకను గుర్తించి దానితో సంబంధాలను ఏర్పరచుకుంది. తద్వారా ఓడ కదలికలను నావికాదళ విమానాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. అలాగే ఐఎన్ఎస్ చెన్నై సైతం హైజాక్‌కు గురైన నౌకను సమీపిస్తోంది. దానితో పాటుగా ఇతర ఏజెన్సీల ద్వారా ఇండియన్ నేవీ పరిస్థితులను నిశితంగా గమనించింది. ఆయా ప్రాంతాల్లోని ఇతర ఏజెన్సీల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది.