Ahmedabad Plane Crash Report:అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-8 టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంపై భారత విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీని ప్రకారం, విమానం టేకాఫ్ అయిన తర్వాత రెండు ఇంజిన్‌లు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీనివల్ల విమానానికి పవర్‌ సప్లై నిలిచిపోయింది. అనంతరం విమానం కుప్పకూలింది.

AAIB నివేదిక ప్రకారం.... "విమానం టేకాఫ్ సరిగానే అయ్యింది. ఆ తర్వాత కాసేపు నార్మల్‌గానే ఉంది. అవసరమైన ఎత్తుకు కూడా చేరుకుంది. అయితే అప్పుడే రెండు ఇంజిన్‌లు పని చేయడం మానేశాయి. ఆయిల్‌ కట్ఆఫ్ స్విచ్‌లు 'రన్' మోడ్ నుంచి 'కట్ఆఫ్'లోకి వెళ్లాయి. అంటే ఇంజిన్‌లకు ఇంధనం సరఫరా ఆగిపోయింది. ఇంజిన్‌కు ఇంధనం అందకపోవడంతో అవి పని చేయడం మానేశాయి. దీంతో విమానం కుప్పకూలింది."

దీన్ని మరింత విపులంగా నివేదికలో పేర్కొన్నారు. విమానం ఎయిర్/గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్‌లోకి మారాయి, ఇది 08:08:39 UTC (13:38:09 IST)కి లిఫ్ట్ ఆఫ్‌కు అనుగుణంగా ఉంది. రెండు ఇంజిన్‌ల కోసం ఇంధన స్విచ్‌లు ఒక సెకను గ్యాప్‌తో వరుసగా ఆగిపోయాయని పేర్కొంది. "విమానం దాదాపు 08:08:42 UTCకి గరిష్టంగా 180 నాట్స్ IAS ఎయిర్‌స్పీడ్‌ చేరుకున్న తర్వాత ఇంజిన్ 1, ఇంజిన్ 2 ఇంధన కట్ఆఫ్ స్విచ్‌లు 01 సెకన్ల టైమ్ గ్యాప్‌తో ఒకదాని తర్వాత ఒకటి RUN నుంచి CUTOFF మోడ్‌కు మారాయి" అని విమానం  ఎన్‌హాన్స్‌డ్ ఎయిర్‌బోర్న్ ఫ్లైట్ రికార్డర్స్ (EAFR)ను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.

పైలట్‌ల మధ్య జరిగిన డిస్కషన్ 

నివేదికలో విమానంలోని ఇద్దరు పైలట్‌లు సుమీత్ సభర్వాల్, కో-పైలట్ క్లైవ్ కుందర్ మధ్య జరిగిన డిస్కషన్ కూడా నివేదికలో పేర్కొంది. ఇంజిన్ ఎందుకు ఆగిపోయింది అనేది అతిపెద్ద ప్రశ్న. కాక్‌పిట్ రికార్డింగ్‌ల ఆధారంగా పైలట్‌ల డిస్కషన్ బయటకు తెలిసింది.  

  • మొదటి పైలట్: ''నువ్వు స్విచ్ ఎందుకు ఆపావు?''
  • రెండవ పైలట్: ''నేను ఆపలేదు''

అందువల్ల, ఏ పైలట్ కూడా కావాలని ఇంజిన్‌ను ఆపలేదు. ఇది సాంకేతిక లోపం వల్ల జరిగి ఉండవచ్చని నివేదిక వెల్లడిస్తుంది. "మానవ తప్పిదం కూడా జరిగే అవకాశం ఉంది. విమాన ప్రమాదంపై విస్తృత దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు ఇంజిన్‌లు ఎలా ఆగిపోయాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం." అని అధికారులు చెబుతున్నారు. 

ఇంజిన్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నించారు 

ఇంజిన్ ఆగిపోయిన తర్వాత రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) బయటకు వచ్చింది, అంటే విమానానికి అత్యవసర విద్యుత్ అవసరమని అర్థం. ఇంజిన్‌ను ఆన్ చేయడానికి ప్రయత్నించారు, కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. విమానం మరింత పైకి వెళ్లలేకపోయింది.  

"విమాన ప్రయాణించే మార్గంలో కానీ ఆ సమీపంలో పక్షి ఎగిరిన సంకేతాలు ఏమీ లేవు" అని చెబుతూ, పక్షి ఢీకొనే అవకాశం ప్రమాదానికి కారణమేమో అన్న వాదనను పూర్తిగా  తోసిపుచ్చింది.

ఆ రోజు ఏం జరిగింది?

జూన్ 12న, 242 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం AI171 అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:38 గంటలకు లండన్ గాట్విక్‌కు బయలుదేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన వెంటనే ఒక మెడికల్ హాస్టల్ కాంప్లెక్స్‌లోకి దూసుకెళ్లింది, విమానంలో ఉన్న 241 మందితో సహా 260 మంది మరణించారు.