Ahmedabad Atal Bridge : అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ పై నిర్మించిన అటల్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. రివర్ ఫ్రంట్ తూర్పు, పడమర గట్లను కలిపే విధంగా అటల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. దాదాపు 300 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రత్యేకమైన డిజైన్‌లో రూపొందించారు. కళ్లు చెదిరే LED లైటింగ్‌తో దీనిని అలంకరించబడింది. తన పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఈ బ్రిడ్జి ఫొటోలను ట్విట్టర్ షేర్ చేశారు. ఎంతో అద్భుతంగా ఉంది కదా బ్రిడ్జి అంటూ ప్రధాని కామెంట్ చేశారు.
అటల్ బ్రిడ్జి అద్భుతం
"అటల్ బ్రిడ్జ్ అద్భుతంగా కనిపించడం లేదా!" అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పాదచారుల కోసమే కాకుండా నదీతీరంలో పర్యాటక ఆకర్షణగా నిలిచేలా ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెన మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌కు అనుకూలంగా రూపొందించారు. ఫ్లవర్ పార్క్, వెస్ట్ బ్యాంక్‌లో ఈవెంట్ గ్రౌండ్, ఈస్ట్ బ్యాంక్‌లో ఆర్ట్ ,కల్చరల్, ఎగ్జిబిషన్ సెంటర్ ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
ఖాదీ ఉత్సవ్
భారత స్వాతంత్ర్య పోరాటంలో ఖాదీ చాలా ముఖ్యపాత్ర పోషించింది. ఇవాళ సబర్మతి రివర్ ఫ్రంట్‌లో నిర్వహిస్తున్న ఖాదీ ఉత్సవ్‌లో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో గుజరాత్‌లోని 7,500 మంది ఖాదీ కళాకారులు ఒకే సమయంలో చరఖా స్పిన్నింగ్‌ను ప్రధాని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. 2001లో సంభవించిన భూకంపంలో మరణించిన వ్యక్తుల పేర్లతో భుజ్ లో నిర్మించిన స్మృతి వాన్ మెమోరియల్ ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ స్మారకం భూకంపం తర్వాత ప్రజల ఆత్మస్థైర్యాన్ని నిదర్శనం అని పీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంజినీరింగ్ నైపుణ్యం
ఇంజినీరింగ్ నైపుణ్యానికి మరో మైలురాయి అటల్ బ్రిడ్జి. పాదచారుల కోసం అహ్మదాబాద్‌లోని సబర్మతి నదిపై అటల్ బ్రిడ్జి నిర్మించారు. ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ప్రధాని స్వయంగా ట్విట్టర్‌లో పంచుతున్నారు. మాజీ ప్రధాని, అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం అటల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ వంతెన పొడవు 300 మీ, వెడల్పు 10-14 మీ ఉంటుంది. రూ.74 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ వంతెనను రంగు రంగులతో ఎంతో సుందరంగా అలంకరించారు. ఎల్‌ఈడీ లైట్లు వెలుగులు రాత్రి సమయాల్లో పర్యటకులను ఎంతో ఆకర్షిస్తుంది.
మాజీ ప్రధాని వాజ్ పేయి పేరు
అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ గత ఏడాది డిసెంబర్ 25న వాజ్‌పేయి పుట్టినరోజున ఈ బ్రిడ్జికి పేరుపెట్టింది. ఈ ఏడాది జూన్ 22న వంతెన నిర్మాణం పూర్తయింది. పట్టం పరాత్ పండుగ స్ఫూర్తితో ఈ వంతెనకు గాలిపటాల రూపంలో అలంకరణ చేశారు. వంతెన నిర్మాణంలో 2,100 మెట్రిక్ టన్నుల మెటల్ ఉపయోగించారు. అటల్ బ్రిడ్జిలో సీటింగ్ బెంచీలు, డైనమిక్ రంగుల కోసం ఎల్ఈడీ లైటింగ్, తోటలు, ఆర్ట్ కల్చరల్ గ్యాలరీ, ఫుడ్ కోర్ట్స్, బైక్, కారు పార్కింగ్ కు అనుకూలంగా అనేక సౌకర్యాలు ఉన్నాయి.