Agnipath Scheme: అగ్నిపథ్ పథకం, నియామకాలు, శిక్షణ వంటి పలు అంశాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కీలక విషయాలు వెల్లడించారు. అగ్నివీరుల భవిష్యత్‌కు ఢోకా లేదని, వారి భవిష్యత్‌పై ఆందోళన అవసరం లేదని ఏఎన్‌ఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డోభాల్ అన్నారు.
అగ్నివీరులకు కఠోర శిక్షణ లభిస్తుంది, నిర్ధిష్ట కాలంలో మెరుగైన అనుభవం సాధిస్తారు. అగ్నివీరుల భవిష్యత్ పూర్తిగా భద్రం. యువకులు, సుశిక్షిత సేనలు సైన్యానికి అవసరం. ఇలాంటి గొప్ప పథకాన్ని వ్యతిరేకించడం తగదు. దీన్ని వ్యతిరేకిస్తూ విధ్వంసం, హింసాకాండను సృష్టిస్తే ఎట్టిపరిస్ధితుల్లో ఉపేక్షించేది లేదు. అగ్నిపథ్ నిరసనల వెనుక కొందరి స్వార్ధ ప్రయోజనాలు దాగున్నాయి. సమాజంలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే కొందరు అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తున్నారు. - అజిత్ డోభాల్, జాతీయ భద్రతా సలహాదారు
మోదీ దేనికైనా సిద్ధం
అగ్నిపథ్ వంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావడానికి ప్రధాని మోదీ ఎప్పుడూ వెనుకాడరని అజిత్ డోభాల్ అన్నారు. జాతీయ ప్రయోజనం కోసం ఏమైనా చేస్తారన్నారు.
రాజకీయంగా చిత్తశుద్ధి ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి. మార్పు తేవడానికి చాలా ధైర్యం కావాలి. ప్రధాని మోదీ లాంటి నాయకుడి వల్లే ఇది సాధ్యమవుతుంది. దేశానికి ప్రయోజనం కలుగుతుందంటే మోదీ ఎంత దూరమైనా వెళతారు. ఎంత వరకైనా ఖర్చు పెడతారు. - అజిత్ డోభాల్, జాతీయ భద్రతా సలహాదారు