ఆయన ఐఏఎస్ అధికారి. ఆయనకు బోలెడంత అధికార దర్పం ఉంది. అది తన కుక్కకు కూడా ఉండాలనుకుంటున్నారు. ఏకంగా స్టేడియం ఖాళీ చేయించి అందులో వాకింగ్ చేయించారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఢిల్లీలోని త్యాగరాజ్‌ స్టేడియంలో క్రీడాకారులు శిక్షణ పొందుతుంటారు.  ఢిల్లీ రెవిన్యూ కార్యదర్శి సంజీవ ఖిర్వార్‌ తన పెంపుడు కుక్కతో వాకింగ్‌ చేసేందుకు ఆ స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారు. రాత్రి ఏడు గంటలకు ఆయనకు వచ్చే సమయానికి స్టేడియాన్ని ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు కూడా సారు చెప్పినట్లే క్రీడాకారులందర్నీ ఏడు గంటల కల్లా పంపించేస్తున్నారు. 



ఐఏఎస్ అధికారి తన పెంపుడు శునకంతో వాకింగ్ కోసం.. తమను  సాయంత్రం ఏడుగంటలకే తమను స్టేడియం నుండి బయటకు పంపుతున్నారని క్రీడాకారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రతి రోజూ రాత్రి 8.30 వరకు సాధన చేసేవాళ్లమని.. అయితే ఐఎఎస్‌ అధికారి తీరుతో తమకు ఆటంకం కలుగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారులు బయటకు వెళ్లిన అరగంట తర్వాత ఆ అధికారి తన పెంపుడు కుక్కతో వాకింగ్‌ చేస్తున్నారు.  



ఆ అధికారి తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.  దేశ రాజధానిలోని ఉన్నతాధికారులే ఇలా ప్రవర్తిస్తే ఇక జిల్లా స్థాయిలో వారితీరు ఎలా ఉంటుందోనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మనీశ్‌ తివారీ వ్యాఖ్యానించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఆ అధికారి క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి కౌషల్‌ కిషోర్‌ డిమాండ్‌ చేశారు. తన పెంపుడు కుక్కతో వాకింగ్‌ కోసం స్టేడియాన్ని ఖాళీ చేయించడం సిగ్గు చేటని అన్నారు. ఈ  ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. రాత్రి పది గంటల వరకు స్టేడియం అందరికీ అందుబాటులో ఉంచాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అధికారులను ఆదేశించారు.