Aditya L1 Captures Sun Images: ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. చంద్రయాన్-3 (Chandrayaan -3) సక్సెస్ తర్వాత సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో పంపిన ఆదిత్య- ఎల్‌1 (Aditya L1) తన ప్రయాణంలో మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. సెప్టెంబర్‌ 2న ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1ను నవంబర్‌లో అది సూర్యుడి సమీపానికి చేరుకుంది. దీంతో ఆదిత్య -ఎల్1లో ఉన్న సోలార్ అల్ట్రావైలైట్‌ ఇమేజింగ్ టెలిస్కోప్ (SUIT)ను నవంబర్‌ 20న యాక్టివేట్‌ చేశారు. 






ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 6న సూర్యుడి ఆదిత్య- ఎల్1 అరుదైన చిత్రాలను క్లిక్‌ మనిపించింది. సోలార్ అల్ట్రావయోలెట్ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ పేలోడ్‌ సాయంతో సూర్యుని నుంచి 200 నుంచి 400 నానో మీటర్ల తరంగదైర్ఘ్య పరిధిలోని ఫొటోలను తీసింది. ఇందుకోసం ఏకంగా 11 వేర్వేరు ఫిల్టర్లను ఉపయోగించి అతినీలలోహిత తరంగ దైర్ఘ్యం దగ్గర నుంచి సూర్యుని ఫొటోలను తీసింది.  ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇస్రో సోషల్ మీడియాలో షేర్ చేసింది. సౌర కుటుంబ పరిశోధనలో ఇదో కీలక మైలురాయంటూ పేర్కొంది. 






ఆదిత్య - ఎల్1 సూర్యుని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌ల ఫొటోలు తీస్తుందని, వాటికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుంటుంది. అయస్కాంత క్షేత్రానికి సంబంధించి తెలుసుకోవడంలో ఈ చిత్రాలు కీలక సమాచారాన్ని అందిస్తాయని ఇస్రో పేర్కొంది. సూర్య కిరణాలు, సోలార్‌ స్పాట్‌లు, సోలార్‌ రేడియేషన్‌ను అధ్యయనం చేయడానికి ఈ పొరలు కీలకమని వివరించింది. అంతరిక్ష వాతావరణం, భూమి వాతావరణంపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపింది. 


సూర్యునిపై పరిశోధనలు చేసేందుకు ఈఏడాది సెప్టెంబర్‌ 2న ఇస్రో ఆదిత్య ఎల్-1ని ప్రయోగించింది. నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యోమనౌక తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంది. ఆదిత్య ఎల్‌-1ను ప్రయోగించిన సుమారు 127 రోజుల తర్వాత భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజ్‌ పాయింట్-1 వద్దకు చేరుకుంటుంది. అక్కడ L1 కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి పూర్తవుతాయని ఇస్రో తెలిపింది. ఇస్రో విజయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో శాష్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతున్నారు. ఆదిత్య L1ను లాంగ్రాంజ్‌ పాయింట్-1లో విజయవంతంగా ప్రవేశపెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.