Adani Group : అదానీ సంస్థకు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే హిండెన్ బర్గ్ నివేదికతో కుదేలైన అదానీ సంస్థకు ఉత్తరప్రదేశ్ డిస్కం మరో షాక్ ఇచ్చింది. యూపీకి చెందిన విద్యుత్ పంపిణీ సంస్థ మధ్యాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ (MVVNL), డిస్కమ్‌కు దాదాపు 5,400 కోట్ల రూపాయల విలువైన 7.5 మిలియన్ స్మార్ట్ మీటర్ల సరఫరా కోసం అదానీ గ్రూప్ వేసిన బిడ్‌ను రద్దు చేసింది.  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యాంచల్, దక్షిణాంచల్, పూర్వాంచల్ , పశ్చిమాంచల్‌తో సహా యూపిలోని నాలుగు విద్యుత్ సంస్థలు (డిస్కంలు) 25 మిలియన్లకు పైగా స్మార్ట్ మీటర్ల సరఫరా కోసం టెండర్లు ఆహ్వానించాయి. ఈ బిడ్ విలువ రూ.25,000 కోట్లుగా అంచనా. 


నిబంధనల ప్రకారం రూ.6 వేలు 


స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అదానీ గ్రూపు అతి తక్కువ బిడ్‌ వేసినప్పటికీ  అనివార్య కారణాలతో బిడ్‌ను రద్దు చేసినట్లు డిస్కం ప్రకటించింది. అదానీతో పాటు, జీఎంఆర్,ఎల్ అండ్ టీ ఇంటెలిస్మార్ట్ ఇన్‌ఫ్రా కూడా ఈ ప్రాజెక్ట్ కోసం బిడ్ వేశాయి. అదానీ సంస్థ ఒక్కో స్మార్ట్ మీటర్‌కు ఏర్పాటుకు రూ. 10,000 ధరను కోట్ చేసింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ స్టాండింగ్ బిల్లింగ్ గైడ్‌లైన్ ప్రకారం మీటరుకు రూ. 6,000 ఖరీదును పరిగణనలోకి తీసుకుంటే అదానీ సంస్థ రూ.10 వేలు బిడ్ వేసింది.  


బిడ్డర్లలో స్మార్ట్ మీటర్ల తయారీదారులు లేరు 


మధ్యాంచల్ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటరింగ్ కోసం ఇ-టెండర్‌ను ఆహ్వానించింది. అయితే అనివార్య కారణాల వల్ల ఈ టెండర్‌ రద్దు చేసినట్లు ఫిబ్రవరి 4న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.  డిస్కం తాజాగా టెండరింగ్ ప్రక్రియను నిర్ణయించనుంది. అయితే మధ్యాంచల్ నిర్ణయంతో ఇతర డిస్కంలు కూడా ఈ నిర్ణయాన్ని ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తు్ంది. అయితే పోటీలో ఉన్న నాలుగు ప్రైవేట్ కంపెనీలలో ఏదీ స్మార్ట్ మీటర్ల తయారీదారు కాదు. వారు కాంట్రాక్టును పొందిన తర్వాత తయారీని ఉపసంహరించుకోవచ్చు. ఇదిలా ఉంటే యూపీ విద్యుత్ వినియోగదారుల ఫోరమ్ ఇప్పటికే బిడ్‌లను యూపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు సవాల్ చేసింది. స్మార్ట్ మీటర్లకు భారీగా ధరలు పెట్టారని ఆరోపించింది.  ఫోరమ్ ప్రెసిడెంట్ అవధేష్ కుమార్ వర్మ మాట్లాడుతూ బిడ్డింగ్ బ్యాక్ డోర్ ద్వారా జరిగిందని ఆరోపించారు.  బిడ్డర్లలో ఎవరూ స్మార్ట్ మీటర్ల తయారీదారులు కాకపోవడం ఇదే తొలిసారి అని ఆయన ఆరోపించారు.


అదానీకి జరిగిన నష్టం ఎంత?


భారతీయ బిలియనీర్ గౌతమ్ అదానీ ఆధ్వర్యంలో నడుస్తున్న అదానీ గ్రూప్‌ మీద అమెరికన్ షార్ట్ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో, అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ పాతాళానికి పడిపోయాయి. గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్‌ స్టాక్స్‌ విలువ 100 బిలియన్లకు పైగా క్షీణించింది, దాదాపు సగం ఆవిరైంది. ఈ పతనం, గౌతమ్‌ అదానీని ప్రపంచ సంపన్నుల జాబితాలోని 3 స్థానం నుంచి అతి దూరంగా నెట్టేసింది. ప్రస్తుతం, సంపన్నుల జాబితాలో 22వ స్థానంలో గౌతమ్‌ అదానీ ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ తిరస్కరించినప్పటికీ అదానీ గ్రూప్ షేర్లలో పతనం, గౌతమ్ అదానీ నికర విలువ క్షీణత ఆగలేదు.