Punjab CM Bhagwant Mann :   అవినీతి విషయంలో సహించే ప్రశ్నే లేదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి చేతల ద్వారా నిరూపించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రిపై వేటు వేశారు. ఏసీబీ కేసు పెట్టి అరెస్ట్ చేయించారు.  ఆప్ ప్రభుత్వంలో విజయ్ సింగ్లా ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లుగా భగవంత్ మాన్ తాజాగా ప్రకటించారు. ఆయన వైద్య ఆరోగ్య శాఖలో ప్రతీ కాంట్రాక్ట్ విషయంలో తనకు ఒక్క శాతం లంచంగా ఇవ్వాలని అధికారులను డిమాండ్ చేస్తున్నట్లుగా తేలిందని భగవంత్ మాన్ ప్రకటించారు. స్పష్టమైన సాక్ష్యాధారాలతోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా ప్రకటించారు. వెంటనే ఏసీబీ కేసు పెట్టి అరెస్ట్ చేయించారు. 







"రాష్ట్రంలో ఒక్క శాతం అవినీతి జరిగినా సహించేది లేదు. ప్రజలు ఎన్నో అంచనాల మధ్య ఆమ్​ఆద్మీ పార్టీకి అధికారం అప్పగించారు. వారి అంచనాలను అందుకునే విధంగా పనిచేయడం మా బాధ్యత. కేజ్రీవాల్​ నేతృత్వంలో అవినీతిని పారదోలేందుకు కృషి చేస్తాం" అని భగవంత్ మాన్ ప్రకటించారు. 






2015లో దిల్లీలోని ఆమ్​ఆద్మీ ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఓ కేబినెట్​ మంత్రిని కేజ్రీవాల్​ పదవి నుంచి తప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తాము రాజకీయ అవినీతికి వ్యతిరేకమని  ప్రకటించింది. తమ పార్టీలో ఎవరు అవినీతికి పాల్పడినా తొలగిస్తామని సంకేతాలు ఇచ్చేందుకు మంత్రులపై ఆరోపణలు వస్తే విచారణ జరిపించి తొలగిస్తోంది. 


ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా, అడ్డంగా దొరికిపోయినా  తమ నేతలను వెనకేసుకు వచ్చేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. వాటికి భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవహరిస్తోంది. నేరుగా తమ నేత అవినీతికి పాల్పడ్డారని వివరించి మరీ పదవి నుంచి తొలగించింది.