ABP Southern Rising Summit 2023: భారత దేశంలోనే అతి పెద్ద, పురాతనమైన ఏబీపీ గ్రూప్ చెన్నైలో నిర్వహించిన సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023 సెమినార్‌కు భారీ స్పందన వచ్చింది. ఏబీపీపై ఉన్న నమ్మకం, ప్రోగ్రామ్‌కు వచ్చిన అతిథుల కారణంగా సోషల్ మీడియాలో దూసుకెళ్లిందీ.  
చెన్నైలోని ప్రముఖ హోటల్లో సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023 పేరుతో భారీ సెమినార్ నిర్వహిస్తోంది ఏబీపీ గ్రూప్. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పళనివేల్ త్యాగరాజన్, నటులు రానా, రేవతి, ఖుష్బూ పాల్గొన్నారు.


జాతీయ స్థాయిలో ట్రెండ్:
ఇండియా వ్యాప్తంగా నమ్మకమైన నెట్‌వర్క్‌గా పేరున్న ఏబీపీ నిర్వహించే సదరన్‌ రైజింగ్‌ సమ్మిట్‌కు వివిధ రంగాల నుంచి ప్రముఖులు హాజరై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దీంతో ఏబీపీ సదరన్ రైజింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ఇండియాలో ఎక్స్ సైట్‌లో ట్రెండ్ అవుతోంది. 


తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. అనంతరం గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య సంబంధాలు సహా పలు అంశాలపై తన అభిప్రాయాన్ని ఆమె పంచుకున్నారు. అనంతరం సినీ నటులు రానా, రేవతి, తమిళనాడు మంత్రి త్యాగరాజన్, రచయిత గురుచరణ్‌దాస్‌ ఇలా పలువురు వక్తలు ప్రసంగించారు. 


బాహుబలి సినిమాతో ఇండియాలో పాపులర్ అయిన తెలుగు నటుడు రానా దగ్గుబాటి పాల్గొని చిత్ర పరిశ్రమలో తన అనుభవాలను పంచుకున్నారు. తర్వాత. నటి రేవతి పాల్గొని తన ఆన్ స్క్రీన్ అనుభవాలను తెలియజేశారు.రచయిత గురుచరణ్ దాస్ పాల్గొని తన అభిప్రాయాలను పంచుకున్నారు. తమిళనాడు క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి త్యాగరాజన్, ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


ఏఐను మనుషులే నడిపిస్తున్నారు - రానా దగ్గుబాటి! 
సినిమా రంగంలో మాత్రమే కాదని, ప్రతి ఒక్క రంగంపై ఏఐ ఇంపాక్ట్ చూపిస్తుందని రానా దగ్గుబాటి వ్యాఖ్యానించారు. లాయర్, బ్యాంకర్, డాక్టర్... ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏఐ ప్రభావం ఉంటుందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''మనకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన కొత్తల్లోనూ పలు సందేహాలు, విమర్శలు వినిపించాయి. 20 ఏళ్ళ క్రితం ఫోన్ కొనమని చెబితే... అది మంచి ఐడియా అని చాలామంది అనుకోలేదు. కొత్త టెక్నాలజీ, మార్పు వచ్చినప్పుడు... వాటిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కొత్త టెక్నాలజీ ఏది వచ్చినా సరే త్వరగా అందిపుచ్చుకుంటుంది. ఎంటర్టైన్మెంట్ క్రియేటివ్ ఇండస్ట్రీ! ఊహలకు రూపం ఇవ్వాలని అనుకుంటాం కాబట్టి క్రియేటివిటీని త్వరగా అర్థం చేసుకుంటాం'' అని చెప్పారు. 


మనసుకు దగ్గరగా మౌనరాగం: రేవతి
రేవతి తన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్‌ చేస్తూ ''మౌన రాగం మణిరత్నం 4వ చిత్రం. ఆ సినిమా చెప్పగానే నటించడానికి సిద్ధమయ్యాను. ఎందుకంటే, విడాకుల గురించి మాట్లాడటానికి విముఖత చూపిన ఆ రోజుల్లో మౌనరాగం లాంటి సినిమాలో నటించడం సాహసమే. ఆ సినిమా నా హృదయానికి చాలా దగ్గరైంది. నేను నటించిన చిత్రాల్లో మౌన రాగం చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత చాలా కమర్షియల్ సినిమాల్లో నటించాను. అయితే అవన్నీ ఒకెత్తైతే... మౌన రాగం అనే ఒక ఎత్తైన సినిమాగా ఉంది.


'మౌనరాగం' సినిమా అప్పట్లో చేయడానికి ఎవరూ ఇష్టపడలేదని ప్రముఖ నటి, దర్శకురాలు రేవతి అన్నారు. తన కెరీర్‌లో 'మౌనరాగం' చాలా రియలిస్టిక్‌గా ఉన్న సినిమా అని చెప్పారు. 1986లో విడుదలైన తమిళ రొమాంటిక్ మూవీ 'మౌనరాగం'. మణిరత్నం దర్శకత్వం వహించగా, జి.వెంకటేశ్వరన్ దీన్ని నిర్మించారు.