ABP Southern Rising Summit 2023 LIVE: మీరు వారితో పొత్తులో లేరా.?: 'కుటుంబ పాలన' విమర్శలపై కవిత

ABP Southern Rising Summit 2023 LIVE Updates: ఏబీపీ నెట్‌వర్క్ చెన్నైలో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ 2023 ప్రారంభమైంది. దక్షిణాది ఐదు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.

ABP Desam Last Updated: 12 Oct 2023 09:18 PM
దక్షిణ భారత ప్రాంతీయ పార్టీలపై కత్తి వేలాడుతోంది: ఉదయనిధి

2026 డీలిమిటేషన్ గురించి ఉదయనిధి ఆందోళన వ్యక్తం చేశారు. 1952 మరియు 1963లో డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పడ్డాయని అన్నారు. లోక్ సభలో మొత్తం స్థానాల సంఖ్య, ప్రతి రాష్ట్రం కలిగి ఉండే అసెంబ్లీ స్థానాల సంఖ్యపై ఈ కమిషన్లు సిఫారసు చేశాయని చెప్పారు. ప్రస్తుతం 'దక్షిణ భారత ప్రాంతీయ పార్టీల తలపై కత్తి వేలాడుతోంది.' అని ఉదయనిధి పేర్కొన్నారు. 

విధులను అడ్డుకునేందుకు కేంద్రం గవర్నర్లను పంపిస్తోంది: ఉదయనిధి

కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకునేందుకు కేంద్రం గవర్నర్లను పంపిస్తోందని ఆయన అన్నారు.

తమిళనాడు అభివృద్ధికి ద్రావిడ పాలనే కారణం: ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు ఓ పురోగతి సాధించినా ద్రావిడా పాలనా విధానం వల్లనే అని తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 70వ దశకంలో కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని ప్రోత్సహించిందని, దక్షిణ భారత రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేశాయని చెప్పారు. 

జనాభా గణన ఎందుకు చేయలేదు: కవిత 

దేశంలో జన గణన ఎందుకు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీజేపీని ప్రశ్నించారు. కుల గణనను విస్మరించడంపై ఆందోళన చెందడం సహా జనాభా గణన ఎందుకు చేయలేదని అన్నారు.

కాంగ్రెస్ సోనియా గాంధీ ఆ నిర్ణయం తీసుకోలేదా.?: అన్నామలై

కుల జనాభా గణనపై చేసిన వాదనను బీజేపీ చీఫ్ అన్నామలై తప్పుబట్టారు. 'మాకు ఓబీసీ ప్రధాని ఉన్నారు. వారికి బీజేపీ ఇచ్చిన ప్రాతినిధ్యం మరే పార్టీ ఇవ్వలేదు. కాంగ్రెస్ హయాంలో సోనియాగాంధీ ఎలా రికార్డుల్లోకి ఎక్కారో గుర్తులేదా?, క్యాబినెట్‌లో ఎలాంటి ఒప్పందం లేదని పేర్కొంటూ కుల గణన డేటాను బహిర్గతం చేయడాన్ని తిరస్కరించారు' అని అన్నామలై గుర్తు చేశారు.

మీరు వారితో పొత్తులో లేరా.?: 'కుటుంబ పాలన' విమర్శలపై కవిత

'కుటుంబ పాలన' అంటూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. డీఎంకేతో పొత్తులు, ఉద్ధవ్ థాక్రే వంటి నాయకులతో పాటు జ్యోతిరాదిత్య సింధియాను పార్టీలో చేర్చుకోవడాన్ని ఆమె ఎత్తిచూపారు. అన్నామలై విమర్శలను కవిత తప్పుబట్టారు.

చైనా చొరబాట్లపై స్పష్టత ఇవ్వాలి: కార్తి పి.చిదంబరం

భారత్‌లోకి చైనా చొరబాట్లు చేసిందా లేదా అనేది ధృవీకరించాలని ప్రధాని మోదీ, హోంమంత్రి, రక్షణ మంత్రి సహా భారత ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సవాలు విసిరారు. భారత్‌లోకి చైనా చొరబాట్లు లేవని స్పష్టంగా చెప్పాలని భారత ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి, హోంమంత్రికి తాను సవాల్ విసిరినట్లు చెప్పారు.

'డీలిమిటేషన్' ప్రక్రియపై ప్రశ్నించిన కవిత

2026 డీలిమిటేషన్ గురించి బీజేపీ తమిళనాడు చీఫ్ కె.అన్నామలైని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు, “డీలిమిటేషన్ ప్రక్రియ గురించి బీజేపీ స్పష్టంగా చెబుతుందా.?, తమిళనాడు ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రజలకు చెబుతారా?” అని ప్రశ్నించారు. ఒకవేళ అమలు చేస్తే, ఊహించినట్లుగానే అతిపెద్ద పెంపుదల ఇప్పటికే పార్లమెంటులో అత్యధిక ఎంపీలను కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఉంటుందని మీరు వారికి చెబుతారా?" అని కవిత అడిగారు.

రాబోయే ఎన్నికల్లో 400 మార్కును అధిగమిస్తాం: అన్నామలై

2024 లోక్ సభ ఎన్నికల్లో 400 మార్కును అధిగమిస్తామని నమ్మకం తమకు ఉందని తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై అన్నారు. ప్రధాని మోదీ విధానాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు.

I.N.D.I.A కూటమి బలం పుంజుకుంటుంది: కార్తి చిదంబరం

I.N.D.I.A కూటమి బలంగా పుంజుకుంటుందని కాంగ్రెస్ నేత కార్తి చిదంబరం అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇప్పటికే కూటమి రెండుసార్లు సమావేశమైందని, వారు బీజేపీ కంటే బలంగా తయారవుతుందని స్పష్టం చేశారు.

దేశ రాజకీయాల్లో 'బీఆర్ఎస్' మూడో పార్టీ: కల్వకుంట్ల కవిత

2024 ఎన్నికల తర్వాత బేరసారాల పరిస్థితి ఏర్పడుతుందని, ఎందుకంటే ఏఐడీఎంకే కూలిపోవచ్చని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భారత రాజకీయాల్లో బీఆర్ఎస్ మూడో పార్టీ అని పేర్కొన్నారు. 

ఎన్నికలు టెన్నిస్ మ్యాచ్ లాంటివి: కార్తీ పి.చిదంబరం

రాబోయే సాధారణ ఎన్నికలు ఫెడరలిజం, లౌకికవాదం విలువలకు సంబంధించినవని కాంగ్రెస్ నేత కార్తీ పీ.చిదంబరం అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ విలువలను బీజేపీ అనుసరించదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలను టెన్నిస్ మ్యాచ్ తో పోల్చారు. 'ఓ సెట్ మార్చొచ్చు, మరో సెట్ లో తిరగొచ్చు.' అని వ్యాఖ్యానించారు.

రాబోయే ఎన్నికల్లో మధ్యే మార్గంగా ఉండదు: అన్నామలై

రాబోయే ఎన్నికల్లో గెలుపు మోదీ వైపే ఉండడం లేదా మోదీకి వ్యతిరేకంగా ఉంటుంది తప్ప, మధ్యే మార్గంగా ఉండదని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ లో ఆయన తమిళనాడు రాజకీయా పరిణామాలపై స్పందించారు. 

దశాబ్దాలుగా వారు చేయలేనిది మేము చేస్తాం: ఖుష్బు

దేశంలోని అన్ని ప్రాంతాలను, అందరినీ తాము సమానంగా చూస్తామని ఖుష్బు అన్నారు. తమిళనాడు, దక్షిణ భారత ప్రాంతంలో ఆమె బీజేపీ వ్యూహాన్ని వెల్లడించారు. తమిళ ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు ప్రత్యేక సాంకేతికత ఏమీ లేదని చెప్పారు. దక్షిణ భారతం 'బీజేపీ - ముక్త్'గా మిగిలిపోయిందనే వాదనలపై వ్యాఖ్యానించడానికి ఖుష్బు నిరాకరించారు. దశాబ్దాలుగా ఇక్కడ అధికారంలో ఉన్న వారు చేయలేనిది తాము చేస్తామని అన్నారు. 

మేము (దక్షిణ భారతీయులు) హీరోలను ఆరాధిస్తాం: ఖుష్బు

దక్షిణ భారతీయులు హీరోలను ఆరాధిస్తారని ఖుష్బు అన్నారు. సౌత్ సినీ పరిశ్రమ ఆస్కార్ అవార్డును గెలుచుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిందని పేర్కొన్నారు. తాము ఉత్తరాది సంస్కృతిని అంగీకరించినా తమ మూలాలను ఎప్పటికీ విడిచి పెట్టలేదని చెప్పారు.

అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిని చెప్పుతో కొట్టా: ఖుష్బూ సుందర్

తనతో అనుచితంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టినట్లు ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ తెలిపారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆమె చెన్నైలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. అక్కడ ఓ రాజకీయ ర్యాలీలో ఒకరు తనతో అనుచితంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారని, అందుకే అతన్ని చెప్పుతో కొట్టినట్లు చెప్పారు.

మహిళలూ గౌరవం విషయంలో రాజీ వద్దు: సుహాసిని

మహిళలు గౌరవం విషయంలో రాజీ పడకూడదని నటి సుహాసిని మణిరత్నం అన్నారు. ఈ సందర్భంగా ఓ శక్తిమంతమైన సందేశాన్ని ఆమె మహిళలకు పంపారు. 

సౌత్ నటీనటులంతా ఓ కుటుంబం: సుహాసిని

సౌత్ నటీనటులు ఓ పెద్ద కుటుంబం లాంటి వారని సుహాసిని చెప్పారు. 'మాకు ఓ వాట్సాప్ గ్రూప్‌ ఉంది, రోజూ చాటింగ్‌ చేస్తున్నాం. ఇప్పుడు మన వాళ్ల ఫొటోలతో పాటు డైలీ లైఫ్‌ అప్‌డేట్‌లు కూడా షేర్‌ చేస్తున్నాం. ' అని సుహాసిని తెలిపారు. తాము ఓ కుటుంబంలా కలిసి ఉంటామని, అందరి కుటుంబ కార్యక్రమాల్లో అందరం పాల్గొంటామని అన్నారు. డిసెంబరులో చెన్నైలో అంతా కలుసుకుంటామని సుహాసిని చెప్పారు.

ఇండియాలో రాజకీయాలు లేని సినిమా లేదు: సుహాసిని

భారత దేశంలో రాజకీయాలు లేని సినిమా లేదని నటి సుహాసిని అన్నారు. అయితే, నేటి ప్రపంచంలో పొలిటికల్ సినిమా తీయడం కష్టమని చెప్పారు. భారతీయ సినిమాలో రాజకీయాల పాత్రపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు.

కొన్ని సన్నివేశాల్లో మహిళా నటులకే కాదు, మగ నటులకూ అసౌకర్యం: సుహాసిని

సినిమాల్లో సన్నివేశాల చిత్రీకరణ సమయంలో మహిళలకు మాత్రమే అసౌకర్యం కలుగుతుందని సుహాసిని పేర్కొన్నారు. 'రోజా', 'దిల్ సే' చిత్రాలను ఉదాహరణగా చూపారు. కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు మగ నటులు కూడా వెనుకాడుతున్నారని చెప్పారు.

కమల్, మణిరత్నం కలిసి పని చేయబోతున్నారు: సుహాసిని

35 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కలిసి పని చేయబోతున్నట్లు సుహాసిని వెల్లడించారు.

'పొన్నియన్ సెల్వన్' చెయ్యొద్దని కోరాను: సుహాసిని

'పొన్నియన్ సెల్వన్' సినిమా చెయ్యొద్దని తాను మణిరత్నంను కోరినట్లు సుహాసిని వెల్లడించారు. తాము తీసిన కొన్ని రాజకీయ, చారిత్రక చిత్రాల వైఫల్యం తర్వాత, ఈ ఆలోచన పని చేస్తుందో లేదో అనే అనుమానం కలిగినట్లు చెప్పారు. అయితే, 'పొన్నియన్ సెల్వన్' కథ మన సంస్కృతిలో ఉందని, తాము దాన్ని రూపొందించక ముందే ప్రజలు దాన్ని ఇష్టపడ్డారని సుహాసిని పేర్కొన్నారు. అందుకే ఆ చిత్రం విజయం సాధించిందని అన్నారు.

మణిరత్నం భార్య కావడం ఫుల్ టైమ్ జాబ్: సుహాసిని

మణిరత్నం భార్య కావడం ఫుల్ టైమ్ జాబ్ కంటే ఎక్కువని ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మణిరత్నం భార్య కావడం ఫుల్ టైమ్ జాబ్ కాదా అన్న ప్రశ్నకు సుహాసిని ఇలా స్పందించారు. చాలామంది మహిళలు అన్ని సమయాల్లో ఇలానే పని చేస్తారని అన్నారు.

ప్రధాని అభ్యర్థిగా ప్రజలు రాహుల్ ను చూస్తున్నారు: జ్యోతిమణి

2024 లోక్‌సభ ఎన్నికలకు I.N.D.I.A కూటమి ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రజలు చూస్తున్నారని సెన్నిమలై అన్నారు. ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఆయన ఒకరని ఆమె తెలిపారు.

కాంగ్రెస్ నుంచే పార్లమెంటులో ఎక్కువ మంది మహిళలు: జ్యోతిమణి 

ప్రతీ రాజకీయ పార్టీ ఆదర్శంగా నిర్దిష్ట మొత్తంలో సీట్లు రిజర్వ్ చేస్తే బాగుంటుందని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి సెన్నిమలై అన్నారు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ వంటి ప్రగతి పార్టీల తరఫున పార్లమెంటులో ఎక్కువ మంది మహిళలు కూర్చొన్నారని పేర్కొన్నారు. ఇది చట్టంగా మారితే తప్ప మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశం లేదని అన్నారు.

దేశ ఆలోచన అర్థం చేసుకోవాలని రాహుల్ కోరుకుంటారు: కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి

తనకు రాజకీయ నేపథ్యం లేదని, మహాత్మా గాంధీ విధానాలకు తాను తీవ్రంగా ప్రభావితమయ్యానని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి సెన్నిమలై అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 2006లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అలా కలిశానని చెప్పారు. రాహుల్ ఆధ్వర్యంలో తాను పని చేసిన ఆరేళ్లు చాలా ముఖ్యమని, తాము రోజుకు 20 గంటలు పని చేశామని వెల్లడించారు. ఈ సమయం భారత దేశ ఆలోచన, రాజకీయాలు అర్థం చేసుకోవడానికి తమకు సహాయ పడిందని చెప్పారు.

ధ్వేషం, అనుమానాల ఫలితమే యుద్ధాలు: గోపాలకృష్ణ

ధ్వేషం, అనుమానాల ఫలితమే ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న 2 యుద్ధాలని గోపాలకృష్ణ గాంధీ అన్నారు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా దేశాల మధ్య యుద్ధాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో మానవత్వం చాలా ఎక్కువని ఇది ఎంతటి వేదన అయినా అనుభవించగలదని అన్నారు. 

గాంధీ ఎప్పుడూ సాధారణ వ్యక్తిలానే ఉన్నారు: గోపాలకృష్ణ గాంధీ

మహాత్మా గాంధీ ఎల్లప్పుడూ సాధారణ వ్యక్తిలానే ఉన్నారని ప్రొఫెసర్, వెస్ట్ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ అన్నారు. భారతదేశంలోని సాధారణ ప్రజల నుంచి తనకు విపరీతమైన మద్దతు ఉందనే వాస్తవం ఆయనకు ఎప్పుడూ తెలుసని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ తనను చుక్కానిగా చూడాలని ఎప్పుడూ కోరుకోలేదని గోపాలకృష్ణ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


బీజేపీ మాకు నోట్ల రద్దు, మణిపూర్ విషాదం ఇచ్చింది: మాజీ ఎంపీ

బీజేపీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని కాంగ్రెస్ కు చెందిన  రాజ్యసభ మాజీ ఎంపీ ఎంవీ గౌడ అన్నారు. ఇది వ్యవసాయ రంగాన్ని సైతం నాశనం చేసిందని పేర్కొన్నారు. తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి వ్యాఖ్యలపై స్పందించిన ఎంవీ గౌడ,  'వారు మాకు మణిపూర్ విషాదాన్ని ఇచ్చారు. మా భూమిని చైనీయులకు ఇచ్చారు.' అని వ్యాఖ్యానించారు. 

అంటరానితనం కమ్యూనిస్టుల నుంచే వచ్చింది: నారాయణన్ తిరుపతి

భారతదేశంలో అంటరానితనం కేవలం కమ్యూనిస్టుల నుంచే వచ్చిందని తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి అన్నారు. జాన్ బ్రిట్టాస్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. కేరళలో పత్రికా స్వేచ్ఛ ఎక్కిడిదని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి అనేది హిందుత్వమని, ప్రధాని నరేంద్ర మోదీ వల్లే ఈ రోజు ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారని అన్నారు.

బీజేపీది అదే నినాదం: జాన్ బ్రిట్టాస్

ప్రతిపక్షాల ప్రభుత్వ విధానాలను వక్రీకరించడం, వాటికి అంతరాయం కలిగించడం అనే నినాదంతో బీజేపీ పని చేస్తోందని సీపీఐ (ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు. 'కేరళ స్టోరీ'  ఓ రాష్ట్ర పరువు తీసేందుకు రూపొందించబడిందని ఆయన పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో సంస్కరణవాద ఉద్యమాలకు సుదీర్ఘ చరిత్ర ఉందని చెప్పారు.

ఇది ప్రారంభం మాత్రమే: రాజీవ్ గౌడ

కర్ణాటకలో బీజేపీ కమీషన్ ప్రభుత్వంగా ముద్ర పడిందని, అది వారి పతనానికే దారి తీసిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ రాజీవ్ గౌడ అన్నారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో లేదని ఇది ప్రారంభం మాత్రమేనని చెప్పారు. 

చట్టాలు అమలు చేసే సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది: మాజీ ఎంపీ రాజీవ్ గౌడ

చట్టాలు, వాటిని అమలు చేసే సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ మాజీ రాజ్యసభ ఎంపీ ఎంవీ రాజీవ్ గౌడ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మీడియా సంస్థల వెంట పడి తమ పంథాలో వారిని చితకబాదుతోందని ఆయన అన్నారు. తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న వాదనలపై ఆయన స్పందిస్తూ, 'వారు ఏమి పొగబెడుతున్నారో తెలియదు' అని అన్నారు.

తమిళనాడులో బీజేపీ ప్రభుత్వం: నారాయణన్ తిరుపతి

తమిళనాడులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి అన్నారు. ఇక్కడ డీఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీ మినహా మరే ఇతర పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని ఆయన అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ లో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

చాలా మీడియా సంస్థలకు PMO చీఫ్ ఎడిటర్: జాన్ బ్రిట్టాస్

స్వేచ్ఛాయుతంగా, స్వతంత్రంగా మీడియా ఉన్నప్పుడే సరైన ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నట్లని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థపై తాను బోగస్ ఆరోపణలు చేసినట్లు వచ్చిన న్యూస్ క్లిక్ కేసును ప్రస్తావించారు. ఇప్పుడు చాలా మీడియా సంస్థలకు PMO చీఫ్ ఎడిటర్ అని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల స్వాతంత్ర్యం ఉల్లంఘించారని వ్యాఖ్యానించారు.

అది నిజంగా నాకు ఆశ్చర్యమే: త్యాగరాజన్

అన్నాడీఎంకే బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని పీ.త్యాగరాజన్ అన్నారు. 'రాజకీయాలు వింత అనుభవాలు కలిగిస్తాయి. బీజేపీ  లేకపోతే, జయలలిత మరణించిన ఐదేళ్ల తర్వాత ఎఐఎడిఎంకె పాలన సాగేది కాదు' అని టిఎన్ మంత్రి అన్నారు.

గుజరాత్ సీఎంగా మోదీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫెడరలిస్ట్: త్యాగరాజన్

గుజరాత్ సీఎంగా ఉన్నంతవరకూ నరేంద్ర మోదీయే ఆల్ టైమ్ గ్రేట్ ఫెడరలిస్ట్ అని తమిళనాడు మంత్రి త్యాగరాజన్ అన్నారు. స్థానిక సంస్థలకు డబ్బు చేరి ప్రజలకు మేలు జరిగేలా అధికారాన్ని పంపిణీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

మతాన్ని ఆయుధంగా వాడలేరు: త్యాగరాజన్

మతాన్ని ఆయుధంగా చేసుకుని రాజకీయాలు చేయడం, ప్రజలను విభజించడానికి ప్రయత్నించడం వంటివి దక్షిణ భారతదేశంలో జరగవని అన్నారు. తాము దక్షిణ భారతదేశంలో మతాన్ని ప్రజాస్వామ్యంగా మార్చామని చెప్పారు.

అందుకు మహిళా సాధికారత, సామాజిక న్యాయమే కారణం: త్యాగరాజన్

దక్షిణాది రాష్ట్రాలకు సుస్థిర పాలనా విధానం ఉందని అందుకే ఆయా రాష్ట్రాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని మంత్రి త్యాగరాజన్ అన్నారు. పరిపాలన పూర్తిగా తమపైనే మోపడం లేదని అన్నారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం కూడా అభివృద్ధి విధానాల్లో ఒకటిగా త్యాగరాజన్ అభివర్ణించారు. 

అందుకు మహిళా సాధికారత, సామాజిక న్యాయమే కారణం: త్యాగరాజన్

దక్షిణాది రాష్ట్రాలకు సుస్థిర పాలనా విధానం ఉందని అందుకే ఆయా రాష్ట్రాల తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని మంత్రి త్యాగరాజన్ అన్నారు. పరిపాలన పూర్తిగా తమపైనే మోపడం లేదని అన్నారు. మహిళా సాధికారత, సామాజిక న్యాయం కూడా అభివృద్ధి విధానాల్లో ఒకటిగా త్యాగరాజన్ అభివర్ణించారు. 

వెయ్యి గొంతులు వినిపిస్తే, ఓ విధానం గుర్తించాలి: త్యాగరాజన్

'వెయ్యి గొంతులు వినిపించాలి, మనం ఓ విధానాన్ని గుర్తించాలి'. ఇదే ప్రజాస్వామ్య భావన అని తమిళనాడు మంత్రి త్యాగరాజన్ అన్నారు. ఏక పార్టీ పాలనపై ఆయన మాట్లాడారు. ఒకే పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలో ఉన్నప్పుడు అన్ని చూసే అధికారం వారికే ఉంటుందని, ఇప్పడు ఆ అధికారం మాకు పూర్తిగా ఉందని చెప్పారు.  

అహంకారం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది: త్యాగరాజన్

చైనాను వాణిజ్య భాగస్వామిగా మార్చాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్నపుడు మనం ఇంకా చాలా చేయాల్సి ఉందని తమిళనాడు మంత్రి డాక్టర్ పి త్యాగరాజన్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 'అహంకారం మంచిదే, కానీ అది ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉపయోగించాల్సి ఉంటుంది.' అని ఆయన చెప్పారు.

AI ప్రేక్షకుల నాడిని అంచనా వేయలేదు: మహేష్ రాఘవన్

AI ప్రేక్షకుల నాడిని అంచనా వేయలేదని మహేష్ రాఘవన్ చెప్పారు. కృత్రిమ మేధస్సు యువ సంగీత కళాకారుల్లో క్రియేటివిటీని పాడు చేస్తుందా.? అని అడిగిన ప్రశ్నకు ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రతి వృత్తిలోనూ మీకు సహాయపడే కొన్ని సాధనాలుంటాయని పేర్కొన్నారు.

చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తి: మహేశ్ రాఘవన్

తన చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి ఉండేదని ప్రముఖ సంగీతకారుడు మహేశ్ రాఘవన్ చెప్పారు. తన బాల్యం గురించి ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన తల్లిదండ్రులు తనను చాలా ప్రోత్సహించారని పేర్కొన్నారు.

సంగీతం, డ్యాన్స్ పాఠ్యాంశాలుగా ఉండాలి: నందిని శంకర్

దక్షిణ భారత కుటుంబంలో సంగీతం, డ్యాన్స్ పాఠ్యాంశాలుగా ఉండాలని ప్రముఖ సంగీత కళాకారిణి నందిని శంకర్ అన్నారు. 'సంగీతం అనేది విస్తృతమైన అభ్యాసం అవసరమయ్యే రంగం. నేను బ్యాంకులో పని చేసినప్పటికీ సంగీతానికే పూర్తి ప్రాధాన్యత ఇచ్చాను. నందిని శంకర్ ఓ బ్యాంకులో ఇన్వెస్ట్ మెంట్ అడ్వైజర్ గా పనిచేశారు. ఆమె ప్రముఖ హిందుస్థానీ క్లాసికల్ ఆర్టిస్ట్ మహేశ్ రాఘవన్ ను వివాహం చేసుకున్నారు.

దక్షిణాది రాష్ట్రాలు దారి చూపుతున్నాయి: గురుచరణ్

దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు దారి చూపిస్తున్నాయని రచయిత గురుచరణ్ దాస్ పేర్కొన్నారు. తమిళనాడు తలసరి ఆదాయం బీహార్ రాష్ట్రం కంటే రెట్టింపు ఉందని చెప్పారు. పారిశ్రామిక విప్లవాన్ని సృష్టించగలిగితే ఇండియా 8 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని, 'చైనా చేసింది అదే'నని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మోదీ భక్తుడినో, విమర్శకుడినో కాదు: గురుచరణ్

తాను ప్రధాని మోదీ భక్తుడినో లేదా విమర్శకుడినో కాదని ప్రముఖ రచయిత గురుచరణ్ అన్నారు. హిందుత్వం అనేది దేశ నిగ్రహానికి విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. హిందుత్వ సెల్ఫ్ లైఫ్ పరిమితం అని చెప్పారు.


ఆర్థిక వృద్ధి చెందినా ఉద్యోగాలు సృష్టించలేదు: గురుచరణ్

మొదటి 40 ఏళ్లలో ఇండియా ఆర్థికంగా వెనుకబడిందని, కానీ అందుకు నెహ్రూను నిందించనని గురుచరణ్ అన్నారు. ప్రస్తుతం 400 మిలియన్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ 7 శాతంగా వృద్ధి చెందిందని చెప్పారు. అయినప్పటికీ పారిశ్రామిక విప్లవం, కొత్త ఉద్యోగాలు సృష్టించలేదని వెల్లడించారు. 

1991లో నిజమైన స్వాతంత్ర్యం: గురుచరణ్

భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం 1991లో వచ్చిందని, 1947లో కాదని రచయిత గురుచరణ్ దాస్ పేర్కొన్నారు. నిజమైన స్వాతంత్ర్యం అంటే రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే కాదని, ఉద్యోగ జీవితంలోనూ  స్వేచ్ఛగా ఉండాలని చెప్పారు. 1991లో మనకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చిందని అన్నారు. 

విద్య అంటే నేర్చుకోవడమే కాదు ప్రశ్నించడం: గురుచరణ్

నేడు 80 శాతం మంది భారతీయులు విద్యను పొందడం లేదని గురుచరణ్ పేర్కొన్నారు. విద్య అనేది కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదని, ప్రశ్నించడం గురించి అని చెప్పారు. విద్యా వ్యవస్థపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. యువతను ఓ క్రమ పద్ధతిలో జీవితాన్ని అంచనా వేస్తూ జీవించాలని సూచించారు.

నెహ్రూ హయాంలో 2 తరాల భారతీయులు అవకాశాలు కోల్పోయారు: గురుచరణ్

నెహ్రూ మన దేశానికి చాలా మేలు చేశారని, మన దేశాన్ని ఐక్యంగా ఉంచారని గురుచరణ్ దాస్ పేర్కొన్నారు. కానీ ఆయనలో ఓ విషాద లోపం ఉందని, రెండు తరాల భారతీయులు అవకాశాల పరంగా నష్టపోయారని చెప్పారు. నెహ్రూవియన్ సోషలిజం ద్వారా జీవించకపోవడం నేటి యువత అదృష్టమని అన్నారు. అలాగే, ఇందిరా గాంధీ  'గరీబీ హటావో' పేరుతో నినదించిన సమయంలో చాలా తక్కువ సహాయం పేదలకు అందించబడిందని గురుచరణ్ పేర్కొన్నారు.

నేను 2 టోపీలు ధరించాల్సి వచ్చింది: గురుచరణ్

తాను 2 టోపీలు ధరించాల్సి వచ్చిందని గురుచరణ్ దాస్ చెప్పారు. 'సోమవారం నుంచి శుక్రవారం వరకూ నేను విక్స్ వాపోరబ్ అమ్ముతున్నాను. వారాంతాల్లో నాటకాలు రాశాను. నా మొదటి నాటకాన్ని ఆదివారం రాశాను. విక్స్ వాపోరబ్ 130 దేశాల్లో విక్రయించబడింది.' అని పేర్కొన్నారు.

జీవితాన్ని కొత్తగా మళ్లీ జీవించడం ఉత్తమం: గురుచరణ్ దాస్

జీవితాన్ని సాధారణంగా జీవించడం కంటే ప్రతిరోజూ కొత్తగా తిరిగి ఆవిష్కరించుకోవడం మంచిదని ప్రముఖ రచయిత, మేనేజ్మెంట్ గురువు గురుచరణ్ దాస్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయన ప్రోక్టర్ & గ్యాంబుల్ ఇండియాకు సీఈవోగానూ వ్యవహరిస్తున్నారు. 

ఎమోజీలు చాలా పెద్ద సమస్య: రేవతి

ప్రస్తుత కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎమోజీలు చాలా పెద్ద సమస్య అని రేవతి అన్నారు. అవి తప్పుడు అర్థాన్ని చిత్రీకరిస్తున్నాయని పేర్కొన్నారు. తాము ప్రొఫెషనల్ గా మాట్లాడేటప్పుడు ఎమోజీలను ఉపయోగించలేమని వెల్లడించారు. తాను ధైర్యంగా బయటకొచ్చి మాట్లాడగలిగే కుటుంబంలో పుట్టానని తన బాల్యం గురించి ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు.


'సలామ్ వెంకీ' వంటి కథలు చెప్పాల్సిన అవసరం ఉంది: రేవతి

తల్లీ కొడుకుల అనుబంధాన్ని తెలిపే 'సలామ్ వెంకీ' వంటి కథలు చెప్పాల్సిన అవసరం ఉందని రేవతి అన్నారు. 2022లో కాజోల్, విశాల్ జెత్వాతో కలిసి రేవతి ఈ చిత్రంలో నటించారు. ఆమెనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొవిడ్ మహమ్మారి తర్వాత చాలా బాధను చూపిస్తూ ఈ సినిమా ఎందుకు తీశారని తనను చాలా మంది ప్రశ్నించినట్లు రేవతి చెప్పారు. 

ఫిల్మ్ మేకింగ్ అంటే ఫ్యాషన్: రేవతి

ఫిల్మ్ మేకింగ్ అంటే తనకు చాలా ప్యాషన్ అని నటి రేవతి చెప్పారు. తన మొదటి సినిమా చేయడానికి తనకు 18 ఏళ్లు పట్టాయని చెప్పారు. తాను దర్శకురాలిగా మారాలని అనుకోలేదని, అయితే, అది ఇప్పుడే జరిగిందని పేర్కొన్నారు. టూత్ ప్యారీ, నెట్ ఫ్లిక్స్ సిరీస్ లో నటిగా తనకు సవాల్ విసిరినట్లు వెల్లడించారు.

సినిమాల్లో క్యారెక్టరైజేషన్ ప్రాధాన్యత మారిపోయింది: రేవతి

సినిమాల్లో క్యారెక్టరైజేషన్‌కు ఉన్న ప్రాధాన్యత మారిపోయిందని సీనియర్ నటి రేవతి అన్నారు. తన కెరీర్‌ గురించి ఆమె మాట్లాడారు. తన కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎలాంటి నేపథ్యం లేదన్నారు. 'నేను దర్శకుడు భారతీరాజా ద్వారా సినిమాలకు పరిచయం అయ్యాను. మీ కెరీర్ చివరి దశలో, మీరు చేయాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది.' అని ఆమె పేర్కొన్నారు.

'మౌనరాగం' నా హృదయానికి దగ్గరైన సినిమా: రేవతి

'మౌనరాగం' సినిమా చేయాలని ఎవరూ కోరుకోలేదని ప్రముఖ నటి, దర్శకురాలు రేవతి అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన కెరీర్ లో 'మౌనరాగం' చాలా రియలిస్టిక్ గా ఉన్న సినిమా అని, నా హృదయానికి చాలా దగ్గరగా ఉందని చెప్పారు. 1986లో విడుదలైన తమిళ రొమాంటిక్ మూవీ 'మౌనరాగం'. మణిరత్నం దర్శకత్వం వహించగా, జి.వెంకటేశ్వరన్ దీన్ని నిర్మించారు.

సౌత్ ఇండస్ట్రీలో బిజినెస్ కంటే ముందే సినిమా వస్తుంది: రానా

గత రెండేళ్లుగా సౌత్ ఇండియా మంచి కంటెంట్ అందిస్తుందని, బిజినెస్ కంటే ముందు సినిమా వస్తుందని, అందువల్లే ఇది సాధ్యమైందని ఓ ప్రశ్నకు సమాధానంగా రానా చెప్పారు. తన ఫోన్ లో సోషల్ మీడియా లేదని, తన జీవితం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.


వారానికి 3 రోజులు బిర్యానీ తింటా: రానా

తన కెరీర్ లో ఎక్కువ భాగం తాను ఇంతకు ముందు చేయని విషయాలపైనే జరిగిందని రానా దగ్గుబాటి చెప్పారు. తన సినీ కెరీర్ పై ఆయన మాట్లాడారు. తాను ఫిట్ నెస్ ఫ్రీక్ కాదని, వారానికి 3 రోజులు బిర్యానీ తింటానని చెప్పారు.  కానీ, బాహుబలి వంటి సినిమాల విషయంలో ఫిట్ నెస్ పై అధికంగా దృష్టి సారించాల్సి ఉంటుందని వెల్లడించారు.


ఈ రోజే మంచి సమయం: రానా

భారతదేశం అంటే ఏకత్వం, భిన్నత్వం అని రానా దగ్గుబాటి అన్నారు. 'దేశంలో మీరు జీవించడానికి, అవకాశాలు సృష్టించడానికి ఈ రోజే ఉత్తమ సమయం' అని చెప్పారు. కథా రచయిత లక్ష్యం ఏంటంటే మంచి చెడులను గుర్తించి ఆ కథ ద్వారా ప్రజలను ప్రభావితం చేయడం అని రానా పేర్కొన్నారు.


సినిమా పని చేస్తూనే ఉంటుంది: రానా

సినిమా పని చేస్తూనే ఉంటుందని, అయితే డబ్బు ఆర్జించే మార్గాలు మారడం ప్రారంభమవుతాయని రానా అన్నారు. 'మీరు నిర్మాణాత్మక సినిమాలను చూడడం ప్రారంభిస్తారు. అది ఓటీటీ ద్వారా మొబైల్ డివైస్ ల్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఓటీటీ అనేది చిత్ర పరిశ్రమ ల్యాండ్ స్కేప్ మారుస్తుంది' అని పేర్కొన్నారు. 

AI అందరినీ ప్రభావితం చేస్తుంది: రానా

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుందని నటుడు రానా దగ్గుబాటి పేర్కొన్నారు. సినిమాల్లో కృత్రిమ మేథస్సు ప్రభావంపై ఆయన మాట్లాడారు. చిత్ర, వినోద పరిశ్రమ ప్రారంభ దశలోనే సాంకేతికతను ఎంచుకుందని, AIపై మనిషి అవగాహన ప్రపంచాన్ని నడుపుతుందని రానా అన్నారు.


ఫేమస్ అవ్వడం ఓ ఉద్యోగం: రానా

ఫేమస్ కావడం అనేది ఓ ఉద్యోగమని నటుడు రానా అన్నారు. సదరన్ కార్యక్రమంలో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, ఫేమస్ కావడం వల్ల ఏమీ మంచిది కాదని చెప్పారు. చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల ఆకర్షితుడినై విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ గా ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. 2006లో బొమ్మలత సహ నిర్మాతగా దగ్గుబాటి జాతీయ చలనచిత్ర అవార్డును రానా అందుకున్నారు.

రెహమాన్ భారతీయ సంగీత రూపాన్ని మార్చారు: రికీ కేజ్

భారతీయ సంగీత రూపాన్ని ఏఆర్ రెహమాన్ తరతరాలుగా మార్చేశారని రికీ కేజ్ అన్నారు. ఇండియాలో తన అభిమాన మ్యూజిక్ కంపోజర్స్ పై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి భారతీయ సంగీతకారుడు నాతో సహా ఏదో ఒక విధంగా రెహమాన్ నుంచి ప్రేరణ పొందాడని కేజ్ అన్నారు. తాను కర్ణాటక గాయని బాంబే జయశ్రీ సంగీతాన్ని అనుసరించానని కూడా కేజ్ చెప్పారు. 

వాతావరణ మార్పులు ఎదుర్కోవడంలో ఇండియా పెద్ద ఎత్తున అడుగులు వేస్తోంది: రికీ

వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ఇండియా పెద్ద ఎత్తున అడుగులు వేస్తోందని రికీ కేజ్ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్దది మా ప్రభుత్వం చేపట్టిన సోలార్ అలయన్స్ చొరవ ప్రధాని మోదీ లైఫ్ మిషన్ గేమ్ ఛేంజర్ గా అభివర్ణించారు. రికీ ఐక్యరాజ్య సమితి శరణార్థుల గుడ్ విల్ అంబాసిడర్ గా కూడా రికీ పని చేస్తున్నారు.

బాలీవుడ్ సంగీతం సాంస్కృతిక అడ్డంకులను విచ్ఛిన్నం చేయలేదు: రికీ

బాలీవుడ్ పరిశ్రమ సాంస్కృతిక అడ్డంకులను విచ్ఛిన్నం చేయలేదని రికీ కేజ్ అన్నారు. 'బాలీవుడ్ మా సంగీతానికి తప్పుడు గుర్తింపును సృష్టించింది' అని కేజ్ అన్నారు. బాలీవుడ్ సంగీతాన్ని ఎందుకు చేయరని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. బాలీవుడ్ సంస్కృతి, సాంస్కృతిక అడ్డంకులను విచ్ఛిన్నం చేయలేదని రికీ కేజ్ చెప్పారు.


ప్రధాని మోదీ పర్యావరణ స్పృహపై దృష్టి పెట్టాలన్నారు: రికీ కేజ్

సంగీతం, పర్యావరణం మధ్య అనుబంధంపై తాను ఎల్లప్పుడూ ప్రకృతి నుంచి ప్రేరణ పొందానని రికీ కేజ్ చెప్పారు. 'ప్రకృతి శబ్దాలను రికార్డ్ చేయడం కంటే, నా సంగీతాన్ని చిత్రించడాన్ని నేను ఇష్టపడతాను. నేను సంగీత వాయిద్యాల ద్వారా ప్రకృతి శబ్దాలను అర్థం చేసుకోగలను' అని పేర్కొన్నారు. వాణిజ్య సంగీతాలను నిలిపేసి, పర్యావరణ స్పృహపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు తనను ప్రోత్సహించారని రికీ చెప్పారు.


మ్యూజిక్ ఓ శక్తిమంతమైన భాష: రికీ కేజ్

కమ్యూనికేషన్ కు సంగీతం అనేది ఓ శక్తిమంతమైన భాష అని రికీ కేజ్ చెప్పారు. ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి నేను సంగీత శక్తిని ఉపయోగించుకోవాలి అని రికీ పేర్కొన్నారు. 

3 సార్లు గ్రామీ అవార్డు ఓ అధివాస్తవిక భావన: రికీ కేజ్

మూడుసార్లు గ్రామీ అవార్డు విజేత కావడం ఓ అధివాస్తవిక భావన అని రికీ కేజ్ అన్నారు. 'ఇంత పెద్ద వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం, భారతీయ సంగీతాన్ని సృష్టించడం అద్భుత అనుభూతి' అని చెప్పారు. 'సంగీతం ప్రకృతి నుంచి పుట్టింది. పక్షులు, ఇతర జంతువుల శబ్ధాన్ని మేము అనుకరించడం ప్రారంభించాం.' అని పేర్కొన్నారు. నా విశ్వానికి కేంద్రం నా సంగీత వ్యవస్థ అని వెల్లడించారు. 

అంతర్జాతీయ వేదికపై ఇండియా పాత్ర - రికీ కేజ్ అభిప్రాయం

తదుపరి కార్యక్రమంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంగీత స్వరకర్త, గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్ ప్రపంచ వేదికపై భారతదేశ పాత్రపై తన అభిప్రాయాలను పంచుకుంటారు.

గవర్నర్ స్పీడ్ బ్రేకర్ లా ఉండాలి: తమిళిసై

గవర్నర్ అంటే కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధి కాదని, ప్రజలకు వారధి అని తమిళిసై అన్నారు. గవర్నర్ కు కొన్ని నియమాలు, బాధ్యతలు ఉంటాయని చెప్పారు. 'గవర్నర్ స్పీడ్ బ్రేకర్ లా ఉండాలి. తద్వారా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.' అని ఆమె పేర్కొన్నారు. 


నాపై రాళ్లు వేస్తే వాటితో ప్రజల కోసం కోట నిర్మిస్తా: తమిళిసై

తెలంగాణ గవర్నర్ గా తనకు చాలా అవమానాలు ఎదురయ్యాయని తమిళిసై సౌందర రాజన్ అన్నారు. 'నువ్వు నాపై రాళ్లు వేయు. కానీ నేను ఆ రాళ్లతో ప్రజల కోసం కోట నిర్మిస్తా. నాకు కిరీటం అవసరం లేదు. నేను నిర్మాణాత్మక వ్యక్తిని.' అని గవర్నర్ చెప్పారు.

గవర్నర్ భవనం కాదు, గవర్నర్ కార్యాలయం: తమిళిసై

గవర్నర్ పట్ల ముఖ్యమంత్రి బాధ్యతలపై రాజ్యాంగంలోని ఆర్టికల్ 167ను ఈ సందర్భంగా తమిళిసై ఉటంకించారు. మూడేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ తనను కలవలేదని అన్నారు. 'ఇది గవర్నర్ భవనం కాదు. గవర్నర్ కార్యాలయం.' అని తమిళిసై పేర్కొన్నారు.


గవర్నర్ రబ్బర్ స్టాంప్ కాలేరు: తమిళిసై

గవర్నర్ గా నాలుగు గోడలకు పరిమితపై రబ్బర్ స్టాంపులా ఉండలేమని, వైద్యురాలిగా ప్రజల నాడి తెలుసనని తమిళిసై అన్నారు. సీఎం, గవర్నర్ మధ్య సత్సంబంధాలుండాలని చెప్పారు. దురదృష్టవశాత్తు తెలంగాణ సీఎంతో సంబంధాలు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు.

గవర్నర్ పొలిటీషియన్ కాలేరు: తమిళిసై

ఏబీపీ సదరన్ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాలకు సరైన అంచనాలు లేవని, దేశానికి చూపాల్సిన ప్రతిభ చూపడం లేదన్నారు. రాజకీయ నాయకుడు గవర్నర్ కావొచ్చని కానీ గవర్నర్ రాజకీయ నాయకుడు కాలేరని సౌందర్ రాజన్ అన్నారు.

దక్షిణాది చరిత్ర మానవ స్ఫూర్తికి సంబంధించినది: ఏబీపీ నెట్‌వర్క్ సీఈవో అవినాష్ పాండే

ఎబిపి నెట్‌వర్క్ సిఇఒ అవినాష్ పాండే తన స్వాగత ప్రసంగంలో దక్షిణాది చాలా పురోభివృద్ధి సాధించిందన్నారు. "దక్షిణ భారతదేశ చరిత్ర సంస్కృతి, ఆర్థిక పురోగతి, సామాజిక ఐక్యత సమ్మేళనం. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలు అత్యధిక జిడిపిని కలిగి ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ వంటి అంశాల్లో దక్షిణ, ఉత్తరాల మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది. దక్షిణాది చరిత్ర మానవ స్ఫూర్తికి సంబంధించినది ’’ అని అవినాష్ పాండే చెప్పారు.

ఏబీపీ సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023 ప్రారంభం

ఏబీపీ సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023 ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మిట్‌ను ప్రారంభించారు.

Background

ABP Southern Rising summit 2023:  భారత దేశంలో దక్షిణాది రాష్ట్రాది ఓ ప్రత్యేకమైన స్థానం. పురోగామి రాష్ట్రాలుక దేశం మొత్తం పేరు తెచ్చుకున్నాయి. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాలకు ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. భాషలు కూడా వేర్వేరు. రాజకీయంగానూ భిన్నమైన పంథాలతో వెళ్తూంటాయి. దేశ రాజకీయాలన్నీ ఓ దిశగా వెళ్తూంటే దక్షిణాది ప్రజలు మరింత భిన్నంగా ఆలోచిస్తారు. ప్రాంతీయతే పెద్ద పీటవేస్తారు. భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే మాట ఏకాభిప్రాయానికి రావడానికి దక్షిణాది రాష్ట్రాలు కూడా ఓ కారణం.  


దక్షిణాది రాష్ర్టాలే ఉన్నాయి. జాతీయ సగటు కంటే ఈ రాష్ర్టాల్లో తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నది. జనాభాను నియంత్రించాలన్న పిలుపునకు ఈ రాష్ట్రాలు అద్భుతంగా స్పందించాయి. మంచి ఫలితాలు సాధించాయి. ప్రాంతీయ భాషల్లో సినిమాలు తీసినా ప్రపంచం మొత్తం వాటి గురించి మాట్లాడేలా చేయడంలో  దక్షిణాది చిత్ర పరిశ్రమలు అనూహ్య విజయాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు  బాలీవుడ్‌కు బ్లాక్  బస్టర్లు అందిస్తోంది కూడా దక్షిణాది టెక్నిషియన్సే అంటే.. ఎంతగా చొచ్చుకు వచ్చేశారో అర్థం చేసుకోవచ్చు.


దక్షిణాదిన మూడు మెట్రో నగరాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. దేశంలో అత్యధిక మంది యువతకు ఈ నగరాలు డ్రీమ్ సిటీస్. అవకాశాల గనులు. ఈ అంచనాలను ఈ నగరాలు అంతకంతకూ పెంచుకుంటున్నాయి..ఆశలు నెరవేరుస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా మారాయి.  ఐదు దక్షిణాది రాష్ట్రాల ఒకటే లక్ష్యం..దేశాన్ని ముందుండి నడపడం.


 దక్షిణాది రాష్ట్రాల ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. తమ హక్కులను కాపాడుకోవడానికి గళమెత్తడంలోనూ ఎప్పుడూ వెనుకడుగు వేయని నైజం దక్షిణాది రాష్ట్రాలది. ఇటీవల దక్షిణాది ఎక్కువగా స్పందిస్తున్న అంశం పార్లమెంట్ సీట్ల డీలిమిటేషన్ విషయంలో.. అన్యాయం జరగుకుండా చూడాలని వాదించడం. అలాగే హిందీ భాష .. ఇతర అంశాల పై ఎప్పటికప్పుడు తమ అభిప్రాయాలు ఘాటుగానే వెల్లడిస్తూ ఉంటారు. అందకే దక్షిణాది ఆలోచనల్ని.. దేశం ముందు ఉంచడానికి శతబ్దానికిపైగా ఘన చరిత ఉన్న ఏబీపీ నెట్ వర్క్.. ఏబీపీ సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023ని చెన్నైలో నిర్వహిస్తోంది. ఈ ఉదయం పది గంటలకు చెన్నైలోని తాజ్ కోరమాండల్‌లో సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023 ప్రారంభమవుతుంది. 


తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉదయనిధి స్టాలిన్, దగ్గుబాటి రాణా, కల్వకుంట్ల కవిత, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఎంవీ రాజీవ్ గౌడ, కుష్భూసుందర్ ,సుహాసిని మణిరత్నం సహా దక్షిణాది రాష్ట్రాలకు చెంది.. వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు ప్రముఖులు సదరన్‌ రైజింగ్ సమ్మిట్‌ 2023 వేదికగా తమ అభిప్రాయాల్ని పంచుకోబోతున్నారు. దేశ పురోభివృద్ధిలో దక్షిణాది పోషించిన.. పోషించబోయే పాత్ర.. ఎుదరయ్యే సవాళ్లు వంటి వాటిపై మనోభావాలను ఆవిష్కరించనున్నారు. 


దక్షిణాది ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణల అభివృద్ధిని గుర్తించి.. దక్షిణ భారతదేశ దార్శనిక ఆలోచనలు, దార్శనికతపై చర్చించేందుకుగానూ ABP నెట్ వర్క్ ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది. పాలిటిక్స్, బిజినెస్, విద్యాసంస్థలు, సంగీతం, కళలు తదిదర రంగాలకు చెందిన ప్రముఖులు 'న్యూ ఇండియా', రాజకీయాల్లో మహిళల పాత్ర, వైవిధ్యం మరియు రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలపై తమ అభిప్రాయాలను ఈ వేదికగా పంచుకుంటారు.


ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ షెడ్యూల్ ఇదే





The summit will take place at Taj Coromandel, Chennai, and will be streamed LIVE on news.abplive.comabpnadu.com, and abpdesam.com.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.