ABP-CVoter Opinion Poll: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుంచి దశలవారీగా పోలింగ్ ప్రారంభం కానుండగా.. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 10న ప్రకటిస్తారు.
ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏబీపీ న్యూస్, సీఓటర్ సంయుక్తంగా ఎన్నికల సర్వే నిర్వహించాయి. అసెంబ్లీ ఎన్నికల రేసులో ప్రస్తుతం ఎవరు రేసులో ముందున్నారో సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వచ్చాయి. అతిపెద్ద రాష్ట్రం కావడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారనే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది. యోగినే మరోసారి సీఎం అవుతారని సర్వేలు చెబుతున్నాయి.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2022
ఉత్తర్‌ప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ న్యూస్, సీఓటర్ సంయుక్తంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించాయి. నవంబర్, డిసెంబర్ నెలలో జరిగిన సర్వేలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీనే మరోసారి యూపీలో సర్కార్ చేపట్టనుందని తేలింది. తాజాగా చూసినా అత్యధికంగా బీజేపీకి 41.5 శాతం ఓట్లు, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాద్ పార్టీకి 33.3 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో వచ్చింది. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీ ఓట్ల శాతం తగ్గుతుండగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా కాంగ్రెస్ మాత్రం అంతగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్ రేసులో వెనుకంజ వేసేలా కనిపిస్తోంది.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనుందని సర్వేలో తేలింది. బీజేపీ 223 నుంచి 235 సీట్లతో యూపీలో మరోసారి అధికారంలోకి రానుందని ఏబీపీ, సీఓటర్ సర్వేలో ప్రజలు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోగా.. సమాజ్ వాదీ పార్టీ 145 నుంచి 157 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించనుంది. 2017తో పోల్చితే ఎస్పీ చాలా మెరుగైంది. మాయావతి బీఎస్పీ మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునేలా కనిపిస్తోంది. గతంలో 19 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో 8 నుంచి 16 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ గతంలో సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ 3 నుంచి 7 సీట్లతో సింగిల్ డిజిట్‌కే పరిమితం కానుంది.
యూపీలో ప్రాంతాల వారీగా సీట్లు..
దేశంలోనే అత్యధిక సీట్లున్న రాష్ట్రం యూపీలో అవధ్, పశ్చిమ యూపీ, పూర్వాంఛల్, బుందేల్ ఖండ్ ప్రాంతాలున్నాయి.
అవధ్‌లో..
అవధ్‌లో మొత్తం 118 స్థానాలుండగా బీజేపీకి 73, ఎస్పీకి 42, బీఎస్పీ, కాంగ్రెస్‌కు చెరో 1 సీట్లు, ఇతరులు ఒక స్థానం గెలిచే అవకాశాలున్నాయి.
బుందేల్ ఖండ్‌లో..
19 స్థానాలున్న బుందేల్ ఖండ్ ప్రాంతంలో బీజేపీ 13 నుంచి 17 సీట్లు సాధించనుండగా.. అఖిలేష్ ఎస్పీ 2 నుంచి 6 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది.
పూర్వాంఛల్‌లో..
130 స్థానాలున్న పూర్వాంఛల్ సైతం యూపీలో కీలకమైన ప్రాంతం. ఇక్కడ సైతం 66 నుంచి 70 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని మరోసారి తమ ఉనికిని చాటుకునేలా ఉంది. ఎస్పీ 48 నుంచి 52 స్థానాలు కైవసం చేసుకోనుంది. బీఎస్పీ 6, కాంగ్రెస్ 2, ఇతరులు 4 సీట్లు గెలుచుకుంటారని ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది.
పశ్చిమ యూపీలో..
అధికార బీజేపీ 71 నుంచి 75 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎస్పీ 53 నుంచి 57 సీట్లు నెగ్గే ఛాన్స్ ఉండగా.. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ సైతం మరోసారి పరాభవాన్ని ఎదుర్కొనేలా కనిపిస్తున్నాయి. బీెస్పీ 4 నుంచి 6 స్థానాలు, కాంగ్రెస్ ఇక్కడ 2 స్థానాలకు పరిమితమయ్యేలా ఉందని ఏబీపీ, సీఓటర్ సర్వేలో తేలింది.
Also Read: ABP C-Voter Survey: పంజాబ్‌లో హంగ్ తప్పదా? మరి కింగ్ మేకర్ ఎవరు? తాజా ABP C-Voter సర్వే ఫలితాలివే
Also Read: Gold-Silver Price: గుడ్‌న్యూస్! నేడు మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో తాజా ధరలు ఇవీ..