న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ జల్ బోర్డు ఎస్‌టీపీ (STP) టెండర్ల కుంభకోణం ఆరోపణలపై మాజీంత్రితో సహా 6 మందిని మంగళవారం (ఆగస్టు 18) నాడు అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్టు చేసింది. ఢిల్లీ జల్ బోర్డు మాజీ సీఈఓ ఉదిత్ ప్రకాష్ రాయ్, ఢిల్లీ జల్ బోర్డు మాజీ కాంట్రాక్చువల్ కన్సల్టెంట్ అంకిత్ శ్రీవాత్సవ, M/s AN ఎంటర్‌ప్రైజెస్ ప్రొప్రైటర్ నాగేంద్ర యాదవ్, యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని రాజా కుమార్ కుర్రా, సృజన్హార్ ప్రొప్రైటర్ పంకజ్ వర్మలను ఏసీబీ అరెస్టు చేసింది. మే 11, 2024న అవినీతి నిరోధక చట్టం, IPC సెక్షన్ల కింద జల్ బోర్డు టెండర్ల కుంభకోణంపై ఈ కేసు నమోదైంది.
బీజేపీపై ఆప్ నేత విమర్శలు
బీజేపీకి AAP అంటే ఎంత భయమో చెప్పడానికి ఇంకా ఎన్ని ఆధారాలు కావాలని ఆప్ జాతీయ మీడియా ఇన్ఛార్జ్ అనురాగ్ ధండా ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినట్లుగా చెబుతున్న జల్ బోర్డు టెండర్ సమయంలో సత్యేంద్ర జైలులో ఉన్నారు. జైలులో ఉన్న వ్యక్తి దీనికి ఎలా బాధ్యత వహిస్తారు? సత్యేంద్ర జైన్ పంజాబ్ సహ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు. త్వరలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగా మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించారు.
అసలు కేసు, ఆరోపణలు ఏంటీ..
విజిలెన్స్ డైరెక్టరేట్ నుంచి ఈ ఫిర్యాదు వచ్చింది. ఢిల్లీ జల్ బోర్డు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (STP) అప్‌గ్రేడేషన్ టెండర్‌లో భారీగా అక్రమాలు, టెండర్ నిబంధనల ఉల్లంఘన, నేరపూరిత కుట్ర జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. టెండర్‌లో ఉద్దేశపూర్వకంగా కొన్ని సాంకేతిక నిబంధనలను పొందుపరిచారని, దీనివల్ల M/s యూరోటెక్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి మాత్రమే లబ్ధి చేకూరేలా చేశారని ప్రాథమిక విచారణలో తేలింది. మరో సంస్థ పోటీ పడకుండా ఆప్ వారికి టెండర్లు అప్పగించిందని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రతిపాదిత పైలట్ ప్రాజెక్టు అనుకున్నట్లుగా నిర్వహించలేదు. చాలా నిబంధనల్ని ఆప్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. అలాగే శుద్ధి చేసిన నీటికి సంబంధించి ఉండాల్సిన ముఖ్యమైన పరిమితులను తొలగించినట్లు అభియోగాలు ఉన్నాయి.
ఆర్థిక లావాదేవీలు
ఆర్థిక విచారణలో కమిషన్, లంచం డబ్బును సృజన్హార్, ఏఎన్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా మళ్లించినట్లు వెల్లడైంది. యూరోటెక్‌కు చెందిన కంపెనీల నుంచి నాగేంద్ర యాదవ్ సంస్థకు భారీగా నిధులు వచ్చాయి. మాజీ సీఈఓ ఉదిత్ ప్రకాష్ రాయ్, ఆయన బంధువుల బ్యాంక్ ఖాతాల్లోకి ఏఎన్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా రూ. 1.52 కోట్ల లంచం పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బుతోనే ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని పోలీసులు తెలిపారు.
సత్యేంద్ర జైన్ అరెస్టుపై కేజ్రీవాల్ మండిపాటు
మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్టుతో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ BJPపై మండిపడ్డారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ, సత్యేంద్ర జైన్‌ను మరోసారి బీజేపీ అరెస్టు చేయించిందని ఆరోపించారు. కొంతకాలం కిందట ఆయనను జైలులో పెట్టి ఎంత దారుణంగా ట్రీట్ చేశారో రాష్ట్ర ప్రజలు అందరికీ గుర్తుంది. గత కేసు కూడా ఫేక్ కేసు కాగా, ఈ ఆరోపణలు సైతం నిజం కావని త్వరలోనే తేలుతుందన్నారు.
బీజేపీది నియంతృత్వ పాలన- కేజ్రీవాల్
‘బీజేపీ ఇంకా ఎంతకాలం ఇలా నియంతృత్వాన్ని కొనసాగిస్తుంది?. వాళ్లకు ఇష్టం వచ్చిన వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేసి జైలులో పెడుతున్నారు. వారు చెప్పేది అబద్ధం, ఆరోపణలన్నీ అవాస్తవాలే అని దేశ ప్రజల ముందు బయటపడుతుంది. కానీ జైలు జీవితం సమయంలో అనుభవించిన మానసిక వేధింపులకు పరిహారం ఎవరు చెల్లిస్తారు? బీజేపీ పాలన మొత్తం పాపాలతో నిండిపోయింది. బీజేపీఎంత నియంతృత్వం చేసినా, త్వరలోనే మోదీ ప్రభుత్వం అంతం అవుతుంది. ఆప్‌తో పాటు దేశ ప్రజలు సత్యేంద్ర జైన్‌కు అండగా నిలుస్తారని’ కేజ్రీవాల్ అన్నారు.
