Aadhaar Details Update Process | ఆధార్ కార్డ్ ఈ రోజుల్లో మన గుర్తింపునకు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్ అయింది. బ్యాంకు నుండి ప్రభుత్వ పథకాల వరకు ప్రతిచోటా దీని అవసరం తప్పక ఉంది. కానీ తరచుగా, అందులోని కొన్ని వివరాలు తప్పుగా ఉండటమో లేక కొత్త వివరాలు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్ వంటి వివరాలను అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. చాలా మంది ప్రతి మార్పు కోసం పలుమార్లు మీసేవా కేంద్రాలకు వెళ్తుంటారు.
ఆధార్ కార్డులో మార్పులు చేయించిన ప్రతిసారీ అందుకు ఫీజు కూడా చెల్లించాలి. అటువంటి సందర్భాలలో మీ సమయంతో పాటు డబ్బు ఖర్చవుతాయి. కానీ మీరు ఒకేసారి చాలా సమాచారాన్ని అప్‌డేట్ చేయాల్సి వస్తే అందుకు సులభమైన, చవకైన మార్గం ఉంది. దీని కోసం ఏం చేయాలి, ఎంత ఫీజు ఉంటుందో వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అన్ని విషయాలను ఒకేసారి ఎలా అప్‌డేట్ చేయాలి
ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి UIDAI మనకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సౌకర్యాలు కల్పించింది. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. మీరు పేరు లేదా చిరునామా వంటి ప్రాథమిక సమాచారాన్ని మార్చాలనుకుంటే ఆన్‌లైన్‌లో చేయవచ్చు. ఇందుకోసం మీరు ఆధార్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. అప్‌డేట్ రిక్వెస్ట్ పెట్టాలి. అదే సమయంలో మీ పుట్టిన తేదీ, బయోమెట్రిక్ లేదా మీ ఫోటో లాంటి సమాచారాన్ని అప్‌డేట్ చేయడానికి మీరు కచ్చితంగా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి.
ఆధార్ సెంటర్లో మీరు అప్లికేషన్ ఫారమ్ తీసుకోవాలి. ఆధార్ కార్డులో మీరు ఏం అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో దానిపై టిక్ చేయాలి. మీరు ఒకేసారి మీకు కావాల్సిన మొత్తం సమాచారాన్ని ఒకేసారి అప్‌డేట్ చేయవచ్చు. ఇందుకోసం మీరు పదే పదే ఆధార్ కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేదు.
మీ విలువైన సమయం, డబ్బు ఆదా
ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి UIDAI కొంత ఫీజును నిర్ణయించింది. సాధారణంగా మీరు ప్రతి అప్‌డేట్ కోసం రూ. 50 ఫీజు చెల్లించాలి. కానీ మీరు ఒకేసారి చాలా సమాచారాన్ని అప్‌డేట్ చేస్తే, ఫీజు ఒకేసారి తీసుకుంటారు. అన్ని వివరాలు ఒకేసారి, ఒకేచోట అప్ డేట్ చేపించడం మీ డబ్బును ఆదా చేస్తుంది. పదే పదే ఆధార్ కార్డ్ కేంద్రాలకు వెళ్లకుండా మీ సమయాన్ని సేవ్ చేస్తుంది..
ఆధార్ సేవా కేంద్రంలో మీరు వాళ్లు అడిగే అవసరమైన సంబంధిత డాక్యుమెంట్‌లను తీసుకెళ్లాలి. అధికారులు అదే రోజున ప్రక్రియను పూర్తి చేయనున్నారు. చాలా మందికి ఇది తెలియక చిన్న చిన్న మార్పుల కోసం పదే పదే ఆన్ లైన్లో అప్డేట్ చేస్తుంటారు. లేక ఆధార్ సెంటర్స్‌కు వెళ్లి ఒక్కో విషయాన్ని అప్‌డేట్ చేపిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పలు ప్రభుత్వ ఆసుపత్రులలోనూ ఆధార్ కార్డులను పథకాలకు లింక్ చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఉచిత బస్సు కోసం మహిళలు ఆధార్ కార్డు చూపిస్తారు. కానీ అందులో వివరాలు సరిగ్గా లేవని కొన్ని సందర్భాలలో టికెట్లు సైతం ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి.