Aadhaar Misuse Ministry Withdrawn UIDAI Press Release on Use Masked Aadhaar instead Aadhaar Photocopy : ఆధార్ జీరాక్స్ కాపీలను (Aadhaar Photo copies) ఇతరులతో పంచుకోవద్దన్న హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అవసరమైన సందర్భాల్లో ఆధార్ సంఖ్యను ఉపయోగించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రజల గోప్యతకు ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలగదని వెల్లడించింది. అన్ని రకాల భద్రతా సౌకర్యాలు దానికి ఉన్నాయని తెలిపింది. బెంగళూరు ఉడాయ్ (UIDAI) కార్యాలయం చేసిన ఓ ప్రకటన సోషల్ మీడియాలో ఆందోళనకు దారితీయడంతో కేంద్రం స్పందించింది.
ఆధార్ సమాచారం దుర్వినియోగం అవుతోందని ఇంతకు ముందే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రజలను హెచ్చరించింది. ఆధార్ ఫొటో కాపీస్ ఇతరులతో పంచుకోవద్దని పేర్కొంది. దీనిపై ప్రజలు సోషల్ మీడియాలో ఆందోళన వెలిబుచ్చడంతో కేంద్రం స్పందించింది. ప్రజల గుర్తింపు, గోప్యత విషయంలో ఎలాంటి రాజీ లేదని, అన్నీ సురక్షితంగా ఉంటాయని ప్రకటించింది. ఎప్పట్లాగే అవసరమైనప్పుడు చట్టబద్ధమైన పనుల్లో ఆధార్‌ను ఉపయోగించాలని వెల్లడించింది.
'బెంగళూరులోని ఉడాయ్ కార్యాలయం 2022, మే 27న చేసిన హెచ్చరికలపై మేం వివరణ ఇస్తున్నాం. ఫొటోషాప్ చేసిన ఆధార్ కార్డును దుర్వినియోగం చేస్తున్నారన్నది వారి ఉద్దేశం. ఆధార్ ఫొటోకాపీని ఏ సంస్థతోనూ పంచుకోవద్దని, అక్కడ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రజలను అలర్ట్ చేసింది. దానికి బదులుగా నాలుగు నంబర్లు మాత్రమే కనిపించే మాస్క్‌డ్ ఆధార్‌ను ఉపయోగించొచ్చు. ఏదేమైనా గతంలో ఇచ్చిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకోవడంతో దాన్ని మేం వెంటనే వెనక్కి తీసుకుంటున్నాం' అని ప్రభుత్వం తెలిపింది.
హోటళ్లు, సినిమా హాళ్ల వంటి ధ్రువీకరించని సంస్థలు ఆధార్ ఫొటోకాపీలను సేకరించడానికి వీల్లేదు. అలాంటి వాటితో ఆధార్‌ను పంచుకోవద్దని శుక్రవారం ఉడాయ్ ప్రకటించింది. దీనిని తప్పుగా అర్థం చేసుకోవడంతో మళ్లీ స్పష్టతనిచ్చింది.