US Bridge Collapse News: అమెరికాలోని Francis Scott Key Bridge కూలిన ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు. వీళ్లంతా చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఓ భారీ ఓడ ఢీకొట్టడం వల్ల వంతెన నీళ్లలో కూలిపోయింది. ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే...ఈ ఓడలో అంతా భారత్‌కి చెందిన సిబ్బందే ఉండడం ఆందోళన కలిగించింది. వంతెనని ఢీకొట్టిన వెంటనే షిప్‌లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. 22 మంది సురక్షితంగా బయటపడినా...బ్రిడ్జ్‌పై ఉన్న ఆరుగురు రిపేర్‌మెన్‌లు గల్లంతయ్యారు. వీళ్లు బ్రిడ్జ్‌పై మరమ్మతులు చేస్తున్న సమయంలోనే ఓడ వచ్చి ఢీకొట్టింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన ఆ ఆరుగురి కోసం అన్ని చోట్లా వెతుకుతున్నారు. కానీ వాళ్లెవరూ ప్రాణాలతో కనిపిస్తారన్న నమ్మకమైతే లేదని తేల్చి చెబుతున్నారు.
"గల్లంతైన ఆ ఆరుగురి కోసం అన్ని చోట్లా గాలిస్తున్నాం. ఎన్ని విధాలుగా ప్రయత్నించాలో అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ గల్లంతైన వాళ్లు ఈ నీటి ఉష్ణోగ్రతను తట్టుకుని ఎలా ఉండగలరన్నదే మా ఆందోళన. మా అంచనా ప్రకారమైతే వాళ్లు ప్రాణాలతో కనిపిస్తారని నమ్మకం లేదు"
- అమెరికా కోస్ట్ గార్డ్ సిబ్బంది
ఈ ప్రమాదంపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఆరా తీస్తోంది. బాధితుల్లోని భారతీయులతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్‌ని కేటాయించింది. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేసింది. భారతీయులు ఎవరైనా హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేసి సాయం పొందొచ్చని వెల్లడించింది.
ప్రమాదం ఎలా జరిగింది..?
అర్ధరాత్రి ఓడ ప్రయాణిస్తున్న సమయంలో ఉన్నట్టుండి ప్రొపల్షన్ సిస్టిమ్ పని చేయకుండా పోయింది. ఫలితంగా షిప్ అదుపు తప్పింది. దారి మార్చేందుకూ వీల్లేకుండా పోవడం వల్ల నేరుగా వెళ్లి బ్రిడ్జ్‌ని బలంగా ఢీకొట్టింది. ఢీకొడుతుందని ముందే అంచనా వేసిన సిబ్బంది Mayday Signal తో అప్రమత్తం చేసింది. ఇలా ముందుగా అలెర్ట్ చేసిన భారతీయ సిబ్బందికి అధ్యక్షుడు బైడెన్ థాంక్స్ చెప్పారు. చివరికి ఓడను ఆపేందుకు నీళ్లలోకి లంగర్‌లు విసిరింది సిబ్బంది. సిబ్బంది అప్రమత్తం చేయగానే బ్రిడ్జ్‌పై వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు. అదే జరగకపోయుంటే ప్రాణనష్టం భారీగా ఉండేది. అప్పటికే కొన్ని వాహనాలతో పాటు 20 మంది నదిలో పడిపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.