Ladakh Earthquake | లడఖ్: లడఖ్‌లోని కార్గిల్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున పలుచోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా రికార్డు అయినట్లు  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. తెల్లవారుజామున 2.50 గంటలకు 15 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. 

హోళీ వేళ వణికిపోయిన ఉత్తర భారతదేశం..లడఖ్ గతంలో జమ్మూ కాశ్మీర్‌లో భాగంగా ఉండేది. 2019లో లడఖ్ ను ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. శుక్రవారం హోలీ పండుగ నాడు లడఖ్ తో పాటు జమ్మూకాశ్మీర్, హిమాలయాలు, ఉత్తర భారతదేశంలో పలుచోట్ల భూమి కంపించింది. జమ్మూ, శ్రీనగర్‌తో సహా పలు నగరాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. 

15 కి.మీ లోతులో భూకంప కేంద్రం..

భూకంప కేంద్రం 33.37 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 76.76 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద ఉందని నేషనల్ సెంటర్ ఫర్మ సిస్మాలజీ (NCS) ఎక్స్‌లో పోస్ట్ చేసింది. 15 కి.మీ లోతులో జనవరి 14న 2.50 గంటలకు లడఖ్, కార్గిల్ లో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. లెహ్, లడఖ్ రెండూ దేశంలోని భూకంప జోన్-4లో ఉన్నాయి. చురుకైన హిమాలయ ప్రాంతంలో ఉండటం వల్ల అవి తరచుగా ప్రకంపనలకు గురయ్యే అవకాశం ఉంది.

ఢిల్లీలో వరుస భూకంపాలు..

ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ఏడాది తొలిరోజు నుంచే ఢిల్లీ ఎన్సీఆర్, సరిహద్దు రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఆపై పలుమార్లు ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలను భూకంపాలు నిద్రలేపాయి. కొన్ని సందర్భాలలో ఏం జరుగుతుంతో అర్థం కాక ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని ప్రజలు చెప్పారు. ప్రాణ నష్టం సంభవించేలా భారీ భూకంపాలు సంభవిచకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.