Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎదురుకాల్పులు జరిగాయి.  ఈ ఎదురు కాల్పుల్లో  ఆర్మీ అధికారి సహా నలుగురు భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 


రాత్రి 8.45 గంటల సమయంలో ధారి గోటే ఉర్బాగీ వద్ద రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కలిసి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ ప్రాంతంలోనే నక్కి ఉన్న ఉగ్రవాదలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆర్మీ కూడా ప్రతిగా కాల్పులు జరిపింది. 


20 నిమిషాలకుపైగా సాగిన ఈ కాల్పుల్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు, ఒక పోలీసు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని, వారిలో నలుగురు అమరులైనట్టు అధికారులు తెలిపారు.


భారత సైన్యం ఏం చెప్పిందంటే.
ఈ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించామని, ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ తెలిపింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.


"ఈ ప్రాంతానికి అదనపు దళాలను పంపారు, ఆపరేషన్ కొనసాగుతోంది" అని వైట్ నైట్ కార్ప్స్ అని కూడా పిలువబడే ఆర్మీకి చెందిన 16 కార్ప్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్లో తెలిపింది.


ఈ దాడికి ఉగ్రవాద సంస్థ కశ్మీర్ టైగర్స్  బాధ్యత తీసుకుంది. దోడాలో భద్రతా దళాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.