బిహార్‌లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి వేళ నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 70 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.
ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ లో బయల్దేరిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ గౌహతిలోని కామాఖ్య జంక్షన్ వెళ్తోంది. రాత్రి 9:53 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. రెండు ఏసీ 3 టైర్ కోచ్‌లు పట్టాలు తప్పాయి. దీంతో నాలుగు కోచ్‌లు ఎగిరి పడ్డాయి.
"రైలు నంబర్ 12506 (ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి కామాఖ్య వరకు) రఘునాథ్‌పూర్ స్టేషన్ ప్రధాన లైన్ గుండా వెళుతోంది. ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి" అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
23 కోచ్‌ల ఈ రైలు బుధవారం ఉదయం 7:40 గంటలకు ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి కామాఖ్యకు బయలుదేరింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించారని బక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మనీష్ కుమార్ తెలిపారు. 70 మంది ప్రయాణికులు గాయపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారని రైల్వే పోలీసు ఫోర్స్ అధికారి తెలిపారు. తీవ్ర గాయాలపాలైన వారిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు, అంబులెన్స్‌లు, వైద్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఢిల్లీ, దిబ్రూగఢ్ మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా కనీసం 21 రైళ్లు దారి మళ్లించారు. కాశీ పాట్నా జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (15125), పాట్నా కాశీ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (15126) రద్దు చేసినట్టు తూర్పు మధ్య రైల్వే జోన్ ప్రకటించింది.
స్థానికులు మాట్లాడుతూ"రైలు సాధారణ వేగంతో నడుస్తోది కానీ అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. రైలు నుంచి పొగలు వచ్చాయి, ఏం జరిగిందో చూడటానికి పరుగెత్తాము. రైలు పట్టాలు తప్పినట్టు గుర్తించాం. AC కోచ్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయి."
తరలింపు, సహాయక చర్యలు పూర్తయ్యాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరణించిన వారికి సంతాపం తెలిపిన ఆయన, రైలు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతామన్నారు. పట్టాల పునరుద్ధరణపై అధికారులు దృష్టి పెట్టారు. మిగిలిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
విపత్తు నిర్వహణ విభాగం, బక్సర్, భోజ్‌పూర్ ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తెలిపారు. వీలైనంత త్వరగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తగిన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ CPRO బీరేంద్ర కుమార్ మాట్లాడుతూ, రైలు బక్సర్ స్టేషన్ నుంచి బయలుదేరి అరగంటకే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది.
పాట్నా జంక్షన్ (PBE)- 9771449971
దానాపూర్ (DNR)- 8905697493
అరా- 8306182542
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్- 9794849461, 8081206628