Bihar Police: శత్రువైనా చనిపోతే చివరిసారి చూడడానికి వెళ్తారు. మృతదేహం వద్ద కడసారి దండం పెడతారు. కానీ బిహార్‌ పోలీసులు (Bihar Police) మాత్రం దుర్మార్గంగా వ్యవహరించారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అత్యంత అమానవీయంగా కాలితో తన్నారు. కాలువలో పడేశారు. పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒక వీడియోలో సోషల్ మీడియాను షేక్ చేసింది. వ్యక్తి మృతదేహాన్ని ముగ్గురు పోలీసులు లాగడం.. తరువాత కాలువలో పడవేయడం ఈ వీడియోలో ఉంది. దీనిని చూసిన నెటిజన్లు పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు.






ముజఫర్‌పూర్‌ (Muzaffarpur)లోని ఫకులీ ఓపీ ప్రాంతంలోని ధోధి కెనాల్ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. వీడియోలో, ఇద్దరు పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని లాగడం చూడవచ్చు, ఆపై మృతదేహాన్ని కాలువలోకి విసిరేందుకు వారికి సహాయపడటానికి మూడో పోలీసు చేరాడు. పోలీసు కానిస్టేబుళ్లు ఓ బాధిత మృతదేహాన్ని కాలువలో పడేస్తుండగా.. ఓ బాటసారి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అందులో రక్తంతో తడిన వ్యక్తి శరీరాన్ని ఇద్దరు పోలీసు అధికారులు లాగుతూ కనిపించారు. మూడవ పోలీసు వారికి సహాయం కోసం వచ్చాడు. వారు తమ లాఠీలను ఉపయోగించి ఒక మృతదేహాన్ని కాలువలోకి నెట్టడం కనిపించింది. 


దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేయించారు. ఘటనపై ముజఫర్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) కార్యాలయం స్పందించింది. వీడియో నిజమేనని, ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొంది. పోలీసులు తమ పనిని అమలు చేయడంలో విఫలమయ్యారని తెలిపింది. ఆదివారం ఉదయం ఆ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యారని పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్టేట్‌మెంట్ ప్రకారం, పోలీసులు అదే సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. బాధితుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SKMCH)కు పంపారు.


ప్రమాదంలో వ్యక్తి మృతదేహం ఛిద్రమైందని, కాలువ నుంచి డెడ్ బాడీ రికవరీ చేసి పోస్ట్ మార్టానికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. బాధితుడిని ఇంకా గుర్తించలేదన్నారు. ఈ ఘటనపై ఫకులీ ఓపీ ఇన్‌ఛార్జ్‌ మోహన్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రమాదంలో ట్రక్కు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితురాలి శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. వాటిని పోస్టుమార్టం కోసం వెలికి తీయలేమని చెప్పారు. కొన్ని శరీర భాగాలను పోస్ట్‌మార్టం కోసం పంపారని, మిగిలిన వాటిని కాలువలో విసిరారని ఆయన మీడియాతో అన్నారు.


ఘటనకు సంబంధించి ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. ఇందులో డ్రైవర్ గా పని చేస్తున్న కానిస్టేబుల్‌, ఇద్దరు హోంగార్డులు కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయగా, హోంగార్డులను విధుల నుంచి తప్పించారు.  పోలీసు కానిస్టేబుళ్లు చేసిన ఘటన అమానవీయమని ఎస్పీ రాకేశ్ కుమార్ తెలిపారు. నిందితులపై శాఖా పరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆ కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పోలీసులు బాధ్యతగా విధులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.