26 Girls Missing in Bhopal: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని బాలికల గృహం నుంచి 26 మంది బాలికలు అదృశ్యమయ్యారు. అనేక రాష్ట్రాలకు చెందిన బాలికలు ఆ వసతి  గృహంలో ఉంటున్నారు. ఆ బాలికల వసతి గృహాన్ని అక్రమంగా నిర్వహిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విషయంపై మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేశారు.


అనుమతి లేకుండా బాలికల వసతి గృహం 
భోపాల్‌లోని పర్వాలియా పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా ఆంచల్ మిషనరీ ఆర్గనైజేషన్ పేరుతో బాలికల వసతి గృహం నిర్వహిస్తున్నారు. అందులో తనిఖీలు  చేయగా... రిజిస్టర్‌ ప్రకారం 68 మంది బాలికలు ఉండగా... అందులో 26 మంది తప్పిపోయినట్లు గుర్తించారు.  మిస్‌ అయిన వారిలో గుజరాత్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌, రైసెన్‌, చింద్వారా, బాలాఘాట్‌ ప్రాంతాలకు చెందిన బాలికలు ఉన్నారు. అదృశ్యమైన బాలికల గురించి షెల్టర్‌ హోమ్‌ డైరెక్టర్‌ అనిల్‌ మాథ్యూను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానలు ఇచ్చారు. దీంతో అనుమానం వచ్చిన అధికారి.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో బాలికల హాస్టల్‌లో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) చైర్మన్‌ ప్రియాంక్‌ కనుంగో.. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీరరాణాకు లేఖ రాశారు. బాలికల మిస్సింగ్‌పై విచారణ జరిపి ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాలికల మిస్సింగ్‌పై పార్వలియా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 


బాలికల మత మార్పిడిపై అనుమానం
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిన్న (జనవరి 5వ తేదీ) శుక్రవారం బాలికల ఇంటిని తనిఖీ చేసింది. ఇందులో గుర్తింపు, రిజిస్ట్రేషన్‌ లేకుండానే బాలల వసతి  గృహాన్ని నిర్వహిస్తున్నట్లు తేలింది. అనాథ పిల్లలను తీసుకొచ్చి ప్రభుత్వానికి తెలియజేయకుండా వసతి గృహంలో ఉంచారు. ఆంచల్‌ మిషనరీ ఆర్గనైజేషన్‌ పేరుతో నడుతుపు ఈ వసతి గృహంలో... బాలికల మతమార్పిడి జరుగుతోందన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. అంతేకాదు తనిఖీల్లో భాగంగా.. ఈ వసతి గృహంలో పలు అక్రమాలు జరిగినట్లు కూడా పోలీసులు గుర్తించారు.


NCPCR  చైర్మన్‌ ప్రియాంక్‌ కనుంగో చెప్పిన వివరాల ప్రకారం...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని తారాసేవ్నియాలో... మిషనరీ నిర్వహిస్తున్న అక్రమ బాలల వసతి గృహాన్ని రాష్ట్ర బాలల కమిషన్ చైర్మన్, సభ్యులతో కలిసి సంయుక్తంగా తనిఖీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎన్జీవో ఇటీవలి వరకు ప్రభుత్వ ఏజెన్సీలో చైల్డ్ లైన్ భాగస్వామిగా పనిచేశారు. రోడ్డుపై ఉన్న అనాథ పిల్లలను తీసుకొచ్చి... లైసెన్సు లేకుండా, ప్రభుత్వానికి తెలియజేయకుండా నిర్వహిస్తున్న ఈ బాలికా గృహంలో రహస్యంగా ఉంచి క్రైస్తవం చేయిస్తున్నారు. ఈ వసతి గృహంలో ఆరేళ్ల నుంచి 18ఏళ్ల మధ్య ఉన్న 40 కంటే ఎక్కువ మంది బాలికల్లో ఎక్కువ మంది హిందువులు. వీరందరికీ బలవంతంగా క్రైస్తవం ఇప్పిస్తున్నారు. ఈ విసతి గృహం నిర్వహకులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు భోపాల్ రూరల్ ఎస్పీ ప్రమోద్ సింగ్ తెలిపారు. మిస్సయిన 26 మంది బాలికలు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.