మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే రోజులో 24 మంది ప్రాణాలు కోల్పోయిన తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేవలం 24 గంటల వ్యవధలిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. నాందేడ్‌ ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్‌ కాలేజీలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన 12 మంది శిశువులు వివిధ ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చినవారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆస్పత్రిలో మరణించిన వారు వివిధ రకాల కారణాలతో చనిపోయిన వారు అని మహారాష్ట్ర వైద్య, విద్య పరిశోధన డైరెక్టర్‌ దిలీప్‌ వెల్లడించారు. కాగా రోగుల్లో కొందరు పాము కాము వల్ల మరణించారని ఆస్పత్రి డీన్‌ శంకర్‌ రావు తెలిపారు. 


ఆస్పత్రిలో మెడిసిన్‌ తక్కువగా ఉండడమే కాకుండా సిబ్బంది సరిపడినంత మంది లేరని దీని వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆస్పత్రి డీన్‌ తెలిపారు. చనిపోయిన పెద్దవారిలో ఎక్కువ మంది పాము కాటు వల్ల మరణించారని చెప్పారు. అలాగే ఆరుగురు మగ శిశువులు, ఆరుగురు ఆడ శిశువులు గత 24 గంటల్లో మరణించారని, వారు వేర్వేరు ఆస్పత్రుల నుంచి ఇక్కడి వచ్చారని డీన్‌ తెలిపారు. అయితే పలువురు సిబ్బంది బదిలీ అయినప్పటి నుంచి సమస్యలను ఎదుర్కొంటున్నామని ఆయన తెలిపారు. నాందేడ్‌ ఆస్పత్రిలో తృతీయ స్థాయి సంరక్షణ కేంద్రం ఉందని, ఇక్కడ 70 నుంచి 80 కిలోమీటర్ల రేడియస్‌లో ఈ ఒక్కటే ఇలాంటి సంరక్షణ కేంద్రం ఉందని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వస్తున్నారని, రోగుల సంఖ్య పెరిగిపోయి నిధులకు సమస్య ఏర్పడుతోందని డీన్‌ శంకర్‌ రావు చవాన్‌ వెల్లడించారు.


మెడిసిన్‌ కొరత ఉండడంతో తాము ప్రైవేటుగా మందులు కొని రోగులకు అందించామని డీన్‌ తెలిపారు. అయితే డీన్ వాదనలను తోసిపుచ్చుతూ ఆసుపత్రి నుంచి ఒక పత్రికా ప్రకటన వెల్లడించారు. ఆసుపత్రిలో అవసరమైన మందులు ఉన్నాయని, ఆస్పత్రిలో రూ.12కోట్ల నిధులు ఉన్నాయని, ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.4కోట్లు ఆమోదించారని ప్రకటనలో పేర్కొన్నారు. రోగులకు అవసరమైన చికిత్సలు అందుతున్నట్లు తెలిపారు. అలాగే ప్రకటనలో.. చనిపోయిన 12 మంది పెద్ద వాళ్లలో ఐదుగురు పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలిపారు. వీరిలో నలుగురు గుండె జబ్బులతో, ఒకరు పాము కాటు వల్ల, ఒకరు గ్యాస్ట్రిక్‌ సమస్యతో, ఇద్దరు కిడ్నీ వ్యాధులతో, ఒకరు ప్రసూతి సస్యలతో, మరో ముగ్గురు ప్రమాదాల కారణంగా చనిపోయారని వెల్లడించారు. చిన్నారుల్లో నలుగురిని చాలా సీరియస్‌ స్టేజ్‌లో ఉండగా ప్రైవేటు ఆస్పత్రుల నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు.


అయితే ఈ ఘటనపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి మంగళవారం మధ్యాహ్నానికల్లా నివేదిక ఇవ్వాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించినట్లు వైద్య విద్య పరిశోధన డైరెక్టర్‌ దిలీప్‌ వెల్లడించారు. పరిస్థితిని సమీక్షించడానికి తాను వ్యక్తిగతంగా ఆస్పత్రిని సందర్శిస్తానని తెలిపారు. నాందేడ్‌ ఆస్పత్రిలో సంభవించిన మరణాలు దురదృష్టకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. ఆస్పత్రిలో ఏం జరిగింది అనే అంశంపై మరింత సమాచారం సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


ఆస్పత్రిలో మరణాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కారు (బీజేపీ, ఏక్‌నాథ్‌ షిండే సేన, ఎన్సీపీ అజిత్‌ పవార్‌ వర్గం) దీని పట్ల బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. '24 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మంది పరిస్థితి విషమంగా ఉంది. సిబ్బంది సదుపాయాల కొరత ఉంది. చాలా మంది నర్సులను బదిలీ చేశారు. 500 మంది సామర్థ్యం ఉన్న ఆస్పత్రిలో 1200 మంది రోగులు ఉన్నారు. ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దాలి' అని కాంగ్రెస్‌ నేత అశోక్‌ చవాన్‌ ఆస్పత్రిని సందర్శించిన తర్వాత వెల్లడించారు.