2023 Monsoon: దేశంలోకి ఈ ఏడాది రుతు పవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. జూన్ 1వ తేదీన దేశంలోకి రుతు పవనాలు ప్రవేశిస్తామని తాము భావించడం లేదని తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్‌ - ఐఎండీ వెల్లడించింది. ఈ సంవత్సరం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. వచ్చే వారం రోజుల్లో అరేబియా సముద్రంలో తుపాను వచ్చే అవకాశాలు కూడా లేవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉత్తరాదిన రుతు పవనాలకు ముందుగానే వానలు కురవడానికి, ప్రాశ్చాత్య దేశాలు( వెస్టర్న్ కంట్రీస్) లో వాతావరణ అసమతుల్యతలే కారణం అని వెల్లడించింది. 


' ప్రాశ్చాత్య దేశాల్లో వాతావరణ అసమతుల్యతల కారణంగానే.. భారత్ లో ఉరుములతో కూడిన వానలు పడుతున్నాయి. అందుకే ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాలు కాస్త ఉపశమనాన్ని పొందుతున్నాయి. ఒక వేళ దేశం మొత్తం ఒకే తరహాలో వర్షపాతం నమోదు అయితే అనుకూల పరిస్థితులే ఉంటాయి అప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. వ్యవసాయంపైనా ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు' అని ఐఎండీ తెలిపింది. 


సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ నుంచి 7 రోజుల వ్యవధిలో కేరళలో ప్రవేశిస్తాయి. గతేడాది మే 29వ తేదీన కేరళలోకి రుతు పవనాలు ప్రవేశించాయి. 2022 లో మే 27వ తేదీన కేరళలోకి రుతు పవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ సాఖ అంచనా వేసింది. కానీ రెంజు రోజులు ఆలస్యంతో దేశంలోకి వచ్చాయి. గత 18 సంవత్సరాలుగా రుతు పవనాల విషయంలో కచ్చితమైన అంచనా వేస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 2015 మాత్రం తమ లెక్క తప్పినట్లు తెలిపింది. కాగా 2005 నుంచి కేరళకు రుతుపవనాల రాకను అంచనా వేసి.. వాటి వివరాలను చెబుతున్నట్లు ఐఎండీ పేర్కొంది.


Also Read: Southwest Monsoon: ఈసారి రుతుపవనాలు కాస్త ఆలస్యమే, భారత్‌లోకి ఎప్పుడొస్తాయో చెప్పిన ఐఎండీ


కాస్త ఆలస్యంగా.. 


నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికే కేరళలోకి వస్తుంటాయి. అయితే, ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్‌ 4న ప్రవేశించే అవకాశం ఉందని మంగళవారం (మే 16) ఓ ప్రకటనలో వెల్లడించింది. పోయిన సంవత్సరం మే 29 నాటికే అవి కేరళ రాష్ట్రాన్ని తాకాయి. 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న ప్రవేశించాయి. వీటితో పోల్చితే ఈ ఏడాది కాస్త ఆలస్యమే అని అధికారులు చెబుతున్నారు.


ఈ ఏడాది ఎల్‌ నినో (El Nino) ప్రభావం ఉంటుందని, వాతావరణ నిపుణులు సహా ప్రైవేటు వాతావరణ సంస్థలు చాలా నెలల క్రితమే అంచనా వేసిన సంగతి తెలిసిందే. మన దేశంలో ఈసారి వర్షపాతం సాధారణంగానే ఉంటుందని, భారత వాతావరణ విభాగం గత నెలలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, భారత్‌లో వర్షపాతం ప్రధానంగా రుతుపవనాల వల్ల వస్తుంటుంది. దేశ వ్యవసాయ రంగానికి ఈ వర్షాలే ప్రధానమైన ఆధారం. సాగు విస్తీర్ణంలో 52 శాతం రుతుపవనాల వల్ల వచ్చే వర్షంపైనే ఆధారపడి ఉంటుంది. ఇది దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం వాటా. తద్వారా దేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వానికి రుతుపవనాలు అనేవి మన దేశానికి కీలకంగా ఉన్నాయి.