Parliament Security : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల (Budget Sessions) వేళ ఎలాంటి భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లమెంటు కాంప్లెక్స్ (Parliament Complex) లో భద్రత కోసం 140 మంది సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బందిని నియమించింది. వీరంతా సందర్శకులు, సామగ్రికని తనిఖీలు చేయనున్నారు. ఎక్స్‌రే యంత్రాలు, డిటెక్టర్లతో సందర్శకులను, వస్తువులను తనిఖీ చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంటులో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో పార్లమెంట్ భద్రతపై అనేక సందేహాలు వచ్చాయి.
140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది పార్లమెంట్ భద్రత
సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగించాలని కొన్ని రోజుల క్రితమే కేంద్రం నిర్ణయించింది. తాజాగా 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని కేటాయించింది. 140 మంది సెక్యూరిటీ సిబ్బందిలో 36 మంది అగ్నిమాపక శాఖ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నారు. సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ప్రస్తుతం లక్షా 70 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోంశాఖ అధీనంలోని ఇది పని చేస్తుంది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 68 విమానాశ్రయాలు, అణుశక్తి, ఢిల్లీ మెట్రో, ఏరోస్సేస్ కేంద్రాల వద్ద సీఐఎస్ఎప్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి. సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీయూనిట్ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు ప్రస్తుత పార్లమెంట్ భద్రతా బృందాలతో కలిసి కొన్నిరోజుల క్రితం సర్వే చేపట్టారు. కేంద్ర హోం శాఖకు నివేదిక ఇచ్చిన తర్వాత...140 మంది సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు దేశ వ్యాప్తంగా బడ్జెట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
సెంబరు 13న లోక్‌సభలో పొగ వెదజల్లిన ఇద్దరు వ్యక్తులు
గతేడాది డిసెంబరు 13న లోక్‌సభలో జీరో అవర్ జరుగుతున్న సమయంలో...ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. పొగను లోక్ సభ అంతటా వెదజల్లారు. మరో ఇద్దరు భవనం వెలుపల ఆందోళన చేశారు. ఆ తర్వాత పార్లమెంటు భవన సముదాయంలో భద్రతపై కేంద్ర హోంశాఖ పూర్తిస్థాయి సమీక్ష చేసింది. ఎయిర్ పోర్టుల్లో సెక్యూరిటీ తరహాలోనే...పార్లమెంట్ వదద్ సీఐఎస్‌ఎఫ్ భద్రతను పర్యవేక్షించనుంది. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ..డిసెంబర్ 13న లోక్‌సభలోకి దూసుకువచ్చి కలకలం సృష్టించారు. అమోల్ శిందే, నీలమ్ ఆజాద్.. పార్లమెంట్ వెలుపల ఆందోళన చేశారు. మరో నిందితుడు లలిత్ ఝా.. ఈ ఘటన మొత్తానికి సూత్రధారి అని, అతడికి మహేశ్ కుమావత్ సహకరించాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారందర్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
రిటైర్డ్ డీఎస్పీ కుమారుడ్ని విచారించిన ఢిల్లీ పోలీసులు
బెంగళూరుకు చెందిన రిటైర్డ్ డీఎస్పీ కుమారుడు సాయికృష్ణను పోలీసులు విచారించారు. లోక్‌సభలో అలజడి సృష్టించిన మనోరంజన్‌కు స్నేహితుడు. వారిద్దరూ బెంగళూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో కలిసి చదువుకున్నారు. విచారణలో భాగంగా మనోరంజన్ చెప్పిన వివరాల ఆధారంగా...సాయికృష్ణను అరెస్ట్ చేశారు.