Maharashtra news: మావోయిస్టు పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. దళానికి చెందిన కీలక నాయకురాలు, కేంద్ర కమిటీ సభ్యుడి భార్య జనజీవనంలో కలిశారు. నాలుగు దశాబ్దాలుగా విప్లవ పంథాలో కొనసాగుతున్న ఆమె లొంగిపోవడం సంచలనంగా మారింది. ఈ మధ్య కొందరు కీలక మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అసలే ఉనికి కోసం పోరాడుతున్న టైంలో ఇలాంటి ఘటనలు ఆ పార్టీకి మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బుధవారం గడ్చిరోలి జిల్లాలో పర్యటించించారు. ఈ పర్యటన వేళ ఈ కీలక పరిణామం జరిగింది. మావోయిస్టు పార్టీకి చెందిన 11 మంది నక్సల్స్ సీఎం ఎదుట లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేత భార్య తారక్క కూడా ఉండడం సంచలనంగా మారింది.
కేంద్ర కమిటీ సభ్యుడు, దంగకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఇంఛార్జిగా ఉన్న భూపతి భార్య తారక్క అలియాస్ విమల సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన తారక్క విప్లవ 1983 నుంచి విప్లవ పంథాలో పయనిస్తున్నారు. 170కిపైగా కేసులు ఉన్న ఆమెపై రూ. కోటికిపైగా రివార్డు ఉంది. సిడాం విమల చంద్ర అలియాస్ తారక్క అలియాస్ వత్సల పీపుల్స్ వార్ నుంచి పార్టీ కోసం పని చేస్తున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వహించారు.
1986లో గడ్చిరోలి జిల్లా అహేరి LOS మెంబర్‌గా, 1987లో పెరిమెలి ఏరియాలో, 1994 నుంచి ACM హోదా, LOS కమాండర్‌గా పని చేశారు. భామ్రఘడ్ కమాండర్‌గా, ఏరియా కమిటీ సెక్రటరీగా, 2006లో సౌత్ గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. 2010 నుండి 9వ కంపెనీలో పని చేసిన ఆమె 2018లో రాహీ ఏరియాలో పని చేశారు. ఇటీవలే దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZCM) మెంబర్ గా బాధ్యతలు చేపట్టారు. డికె వైద్య బృందానికి ఇంఛార్జీగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి కీలక వ్యక్తి లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బగా చెబుతున్నారు. ఈ మధ్యే ఛత్తీస్‌గఢ్‌లో పయనించిన అమిత్‌షా మావోయిస్టులకు వార్నింగ్ ఇచ్చారు. లొంగిపోతే ప్రభుత్వం అండగా ఉంటుందని... లేకుంటే ఏరివేత ఖాయమంటూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే అనేక రోజులుగా నిర్వహిస్తున్న ఆపరేషన్‌లో కీలక నేతలతోపాటు డజన్ల కొద్ది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా మావోయిస్టులు లొంగిపోవడానికి ఇది కూడా ఓ కారణమై ఉంటుందని అంటున్నారు.