India's Poverty: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 5-10 ఏళ్లలో భారత్‌లో పేదరికం అనేదే లేకుండా చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకూ తమ హయాంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసినట్టు వెల్లడించారు. అహ్మదాబాద్‌లో మీడియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి భారత్‌ ప్రపంచంలోనే మూడు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2014కి ముందు దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో వివరించారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపైనా తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే భారత్‌ ఇలా పురోగతి సాధిస్తోందని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష కూటమికి ఓ నాయకుడు అంటూ లేరని విమర్శించారు. గత ప్రధానమంత్రులూ పేదరిక నిర్మూలన గురించి గొప్పగా మాట్లాడారని, కానీ ప్రధాని మోదీ మాత్రం ఆ లక్ష్యాన్ని సాధించగలిగారని వెల్లడించారు. భారత్‌లో పేదరికం తక్కువగా ఉందని IMF వెల్లడించినట్టు గుర్తు చేశారు. ఇప్పటి వరకూ పేదరిక నిర్మూలన కోసం చాలా చేశామని, కానీ ఇది సరిపోదని ఇంకా చేయాల్సింది చాలా ఉందని స్పష్టం చేశారు. 


"2014 వరకూ భారత దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండేది. కానీ ఇప్పడు ఐదో స్థానానికి చేరుకుంది. 2027 నాటికి మొదటి మూడు స్థానాల్లో చోటు దక్కించుకుంటుంది. ఈ అభివృద్ధిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు. ఇప్పుడు మన దేశానికి ఓ బలమైన ప్రధాని ఉన్నారు. నరేంద్ర మోదీకి ఓ విజన్ ఉంది. అదే ప్రతిపక్ష కూటమిని చూడండి. ఆ కూటమికి ఓ నాయకుడు లేడు,నిర్దిష్టమైన విధానమూ లేదు. జవహర్‌ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ఇలా చాలా మంది పేదరిక నిర్మూలన గురించి మాట్లాడారు. కానీ వాళ్లకు ఆ పని సాధ్యం కాలేదు"


- రాజ్‌నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి


ప్రధాని మోదీ విజన్‌పైనా ప్రశంసలు కురిపించారు రాజ్‌నాథ్ సింగ్. భారత్‌లో పేదరికాన్ని తగ్గించిన ఘనత ఆయనదే అని వెల్లడించారు. అందుకే IMF ప్రశంసించిందని వివరించారు. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాజ్‌నాథ్ సింగ్. రక్షణ శాఖలోని సంస్కరణల గురించీ ప్రస్తావించారు. 2014లో ఈ రంగంలో ఎగుమతుల విలువ కేవలం రూ.600కోట్లుగా ఉండేదని కానీ ఇప్పుడు ఆ విలువ రూ.21 వేల కోట్లకు చేరుకుందని వివరించారు. అన్ని రకాల ఆయుధాలు, మిజైల్స్‌ని ఎగుమతి చేస్తున్నట్టు చెప్పారు. 






Also Read: Mohan Bhagwat: రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు - రేవంత్ వ్యాఖ్యలపై మోహన్ భగవత్ కౌంటర్