India US Mini Trade Deal Likely Finalised:  ఇండియా- అమెరికా మధ్య మధ్యంతర  ట్రేడ్ డీల్ ఖరారు అయింది. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  రెండు దేశాల మధ్య కొన్ని రోజులుగా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.  వ్యవసాయం ,  డైరీ రంగాలపై భారత్ ధృడమైన వైఖరి,  యూఎస్  టారిఫ్ తగ్గింపు డిమాండ్లు చర్చలు పూర్తి కాకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో  చాలా కాలంగా ఎదురుచూస్తున్న మినీ ట్రేడ్ డీల్‌ను ఖరారు  చేసుకున్నాయి.  

నిర్దిష్ట వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడం , ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఇందులో సుంకాల తగ్గింపులు, కీలక వస్తువులకు ఎక్కువ మార్కెట్ యాక్సెస్ ,  డిజిటల్ వాణిజ్యం , క్లీన్ ఎనర్జీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో పరస్పర  సహకారం ఉంటాయని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. చాలా నెలలుగా కొనసాగుతున్న చర్చలు, సీనియర్ వాణిజ్య అధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చల తర్వాత ఒక పురోగతిని సాధించాయని  చెబుతున్నారు.  భవిష్యత్తులో రెండు దేశాల మధ్య విస్తృత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వైపు ఈ ఒప్పందం ఒక మెట్టుగా ఉపయోగపడుతుందని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.    భారతదేశం నుండి వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్‌లో జూన్ 26 నుండి  చర్చలు జరిపుతోంది.  ట్రంప్   ఏప్రిల్ 2న భారతదేశంపై 26% రిసిప్రొకల్ టారిఫ్‌లను ప్రకటించారు. కానీ ఈ టారిఫ్‌లను జూలై 9 వరకు 90 రోజుల పాటు సస్పెండ్ చేసింది. తాజగా ఈ గడువు ఆగస్టు 1 వరకు పొడిగించారు.  భారతదేశంతో “చాలా పెద్ద” ట్రేడ్ డీల్ జరగబోతోందని, ఇది భారత మార్కెట్‌ను తెరవడానికి దోహదపడుతుందని  చెబుతూ వస్తున్నారు.  భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఒప్పందం పరస్పర ప్రయోజనకరంగా ఉండాలని, ఏకపక్షంగా ఏమీ నిర్ణయించబడదని ప్రకటించారు.  

టెక్స్‌టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ గూడ్స్, గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కెమికల్స్, ష్రిమ్ప్, ఆయిల్ సీడ్స్, గ్రేప్స్, , బనానాస్ వంటి ఉత్పత్తులపై పన్ను తగ్గింపులు ఉండే అవకాశం ఉంది.  ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి  500 బిలియన్ డాలర్లకు  చేర్చాలని లక్ష్యంతో భారత్ ఉంది. ప్రస్తుతం ఇది  131.84 బిలియన్ డాలర్లుగానే ఉంది. మినీ ట్రేడ్ డీల్ పై ప్రకటన తర్వాత పూర్తి స్థాయి ట్రేడ్ డీల్ పై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి.