దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత వారం నుంచి గమనిస్తే.. ఐదు రోజుల పాటు తగ్గుతూ వచ్చిన కోవిడ్ కేసులు నిన్న, ఇవాళ మళ్లీ పెరిగాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,570 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన వాటితో కలిపి దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3,33,47,325కి చేరింది. నిన్న ఒక్క రోజే కోవిడ్ బాధితుల్లో 431 మంది చనిపోయారు. దీంతో కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 4,43,928కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 38,303 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,25,60,474కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,42,923 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో 64,51,423 మందికి వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 76,57,17,137 టీకాలు అందించినట్లు వెల్లడించింది.
కేరళలో 80 శాతం..
దేశవ్యాప్తంగా నమోదైన కేసులు, మరణాల్లో కేరళలో 80 శాతం ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో కేరళలో 17,681 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా 208 మంది మరణించారు.
కోవిడ్ వ్యాక్సినేషన్‌లో రికార్డు..
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో మనదేశం రికార్డు సృష్టించిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్లు అందిస్తున్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో నిలిచిందని చెప్పింది. 1.84 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించినట్లు వెల్లడించింది. దేశంలో సెప్టెంబర్ వరకు పురుషులకు 52.5 శాతం, మహిళలకు 47.5 శాతం, ఇతరులకు 0.02 శాతం డోసుల వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 62.54 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు వివరించింది.
Also Read: Modi Shah : బీజేపీలో మోడీ, షా వేరే వాళ్లను ఎదగనీయడం లేదా ? బలహీనుల్నే ఎందుకు సీఎంలుగా చేస్తున్నారు ?