Vande Bharat: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల సంఖ్య దేశవ్యాప్తంగా క్రమక్రమంగా పెంచుతూ వస్తుంది రైల్వేశాఖ. ప్రధాని మోడీ చేతుల మీదుగా దేశవ్యాప్తంగా ఇప్పటికి  25 వందేభారత్‌ రైళ్లు నడుస్తుండగా...తాజాగా మరో 4 వందేభారత్ రైళ్లను తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. జూలై నెలాఖరులోనే కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించాలని రైల్వేశాఖ చూస్తోంది. ఈ నాలుగు వందేభారత్ రైళ్లూ ఎనిమిది కోచ్‌లతో నడవనున్నాయి. ఇందులో ఏడు ఛైర్‌ కార్లు, ఒక ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉండనున్నాయి.


కొత్త వందేభారత్‌ల రూట్లు ఇవే...


తాజాగా ఈ నెలాఖరులోగా ప్రారంభించనున్న వందేభారత్ రైళ్ల రూట్లలో ఢిల్లీ- చండీగఢ్‌, చెన్నై- తిరునల్వేలి, లఖ్‌నవూ- ప్రయాగ్‌రాజ్‌, గ్వాలియర్‌- భోపాల్‌ ఉండనున్నాయి. ప్రస్తుతం 25 రైళ్లు నడుస్తుండగా అందులో తొమ్మిది రైళ్లు ఎనిమిదేసి కోచ్‌లతోనే నడుస్తున్నాయి. కొత్త రైళ్లు కలిపితే మొత్తం వందే భారత్‌ రైళ్ల సంఖ్య 29కి చేరనుంది. ఈ నెలలో ప్రారంభించనున్న ఈ నాలుగు రైళ్లలో ఒక్కొక్క దానిలో 556 మంది ప్రయాణికులు ప్రయాణించడానికి వీలు ఉంటుంది. ఢిల్లీ చండీగఢ్ రూట్ లో ఇప్పటికే చాలా రైళ్ళు ఉన్నప్పటికీ, ప్రయాణికుల నుండి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో ఈ రూట్లో వందే భారత్ ట్రైను ను తీసుకువస్తున్నారు. లఖ్‌నవూ- ప్రయాగ్‌రాజ్‌ వందే భారత్‌ రూట్‌లో కొత్త రైలు తేవడం ద్వారా యూపీలో ఈ రైళ్ల సంఖ్య మూడుకు చేరనుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌- భోపాల్‌ మధ్య వందే భారత్‌ రైలును తీసుకురావాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలిసింది.



ఇక తెలుగు రాష్ట్రాలలో చెన్నై- తిరుపతి లేదా చెన్నై- విజయవాడ మధ్య వందే భారత్ రైలు అందుబాటులోకి వస్తుందనే ప్రచారం జోరుగా సాగిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలకు మాత్రం వందేభారత్ రైళ్లు ప్రవేశపెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. చెన్నై తిరునల్వేలి మధ్య వందేభారత్ రైలు తీసుకురావడంతో ఈ దఫాలో తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ రైలు లేనట్టేనని సమాచారం. ఇక, తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్‌ ఎప్పుడనేది చూడాల్సి ఉంది. మరోవైపు, ఇప్పటివరకు 25 వందేభారత్ లను ప్రవేశపెట్టినా అనుకున్నంత ఆదరణ పొందలేదని, అందువల్ల కెపాసిటీ పెంచుకునేందుకు టికెట్‌ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కేవలం వందే భారత్‌ రైళ్లు మాత్రమే కాకుండా ఛైర్‌కార్‌, ఎగ్జిక్యూటివ్‌ తరగతులు కలిగిన అన్ని రైళ్లలో 25 శాతం వరకు టికెట్‌ ధరలు తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. టికెట్‌ ధరలపై నిర్ణయం జోనల్‌ స్థాయి అధికారులకు రైల్వే బోర్డు అప్పగించింది.


త్వరలో కాషాయరంగులో రైళ్లు..


ఇప్పటి వరకు నీలిరంగులో ఉన్న వందేభారత్ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. ఇక, త్వరలో జాతీయ పతాకంలోని కాషాయం రంగులో ఉన్న వందే భారత్‌ రైళ్లు రానున్నాయి. ఇటీవల చెన్నైలోని కోచ్‌ ఫ్యాక్టరీలో ఈ రైళ్లను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విడుదల చేయగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.