Bharat Mart in Middle East: యూఏఈలో పెద్ద ఎత్తున భారత్ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మధ్యప్రాచ్యంలోనూ భారత్‌ సరుకులకు డిమాండ్ పెంచాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా Bharat Mart లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే UAEలో ఇందుకు సంబంధించిన ప్లాన్ సిద్ధమైంది. ఒకటే చోట భారత్‌కి సంబంధించిన అన్ని ఉత్పత్తులూ దొరికేలా వీటిని ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఇప్పటికే చైనా Dragon Mart లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో చైనా ఉత్పత్తులను విక్రయిస్తోంది డ్రాగన్ దేశం. ఇదే తరహాలో భారత్ కూడా భారత్ మార్ట్‌ని తీసుకురానుంది. ఇప్పటికైతే దీనిపై తుది నిర్ణయం తీసుకోకపోయినా కసరత్తు అయితే జరుగుతోంది. అంతా అనుకున్నట్టుగా అయితే 2025 నాటికి యూఏఈలో భారత్ మార్ట్‌ని అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో Bharat Mart ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ప్లాన్. రిటైల్‌ స్టోర్‌, వేర్‌హౌజ్‌లు ఇందులోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. Jebel Ali Free Zone (JAFZA) ప్రాంతంలో ఈ మార్ట్‌ని ఏర్పాటు చేయనుంది. భారీ మెషీన్‌ల నుంచి మిగతా అన్ని సరుకుల వరకూ ఇక్కడే దొరికేలా మార్ట్‌ని సిద్ధం చేయనున్నారు. ఆన్‌లైన్‌లోనూ ఇక్కడి నుంచి సరుకులు కొనుగోలు చేసేలా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ని తయారు చేస్తారని సమాచారం. భారత్, యూఏఈ మధ్య కేవలం పెట్రో వాణిజ్యం కాకుండా మిగతా వ్యాపారాల విలువనే 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. Comprehensive Economic Partnership Agreement (CEPA)లో భాగంగా 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నాయి. 


అటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్నారు. అబుదాబీ చేరుకున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మోదీకి ఘన స్వాగతం పలికారు. అక్కడ తొలి హిందూ ఆలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈక్రమంలోనే ఇద్దరూ చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చర్చించినట్టు అధికారులు వెల్లడించారు. మౌలిక వసతులపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఇద్దరు నేతలూ ఆసక్తి చూపుతున్నారు. స్థానిక సమస్యలతో పాటు అంతర్జాతీయ సవాళ్లపైనా చర్చించారు.