Chief Minister Jagan Gave Prizes To The Adudam Andhra Winners : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ విజయవంతంగా ముగిసింది. యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించే ఉద్ధేశంతో వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో పలు క్రీడా పోటీలను నిర్వహించింది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 260 జట్లకు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సీఎం జగన్మోహన్‌రెడ్డి చేతులు మీదుగా నగదు బహుమతి, మెడల్స్‌ అందించారు. క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ మెన్‌, వుమెన్‌ జట్ల విజేతలకు చెక్కులతోపాటు ట్రోఫీలను సీఎం జగన్‌ అందించారు. బ్యాడ్మింటన్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచిన జజోడీలకు ట్రోఫీలతోపాటు నగదు ప్రోత్సాహకాలు అందించారు.




విజేతలు జట్ల వివరాలు


ఈ టోర్నీలో విజేతలుగా పలు జిల్లాలకు చెందిన జట్లు నిలిచాయి. క్రికెట్‌ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలువగా, మహిళా విభాగంలో ఎన్‌టీఆర్‌ జిల్లా జట్టు గెలుపొందింది. వాలీబాల్‌ మన్‌, వుమెన్‌ రెండు విభాగాల్లోనూ బాపట్ల జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఖోఖో మెన్‌లో బాపట్ల, వుమెన్‌ విభాగంలో ప్రకాశం జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బ్యాడ్మింటన్‌ మెన్‌లో ఏలూరు జోడీ, వుమెన్‌లో బాపట్ల జోడీ విజేతగా నిలిచింది. కబడ్డీ మన్‌లో బాపట్ల, వుమన్‌లో విశాఖ జట్లు విజేతలలుగా నిలిచి సీఎం చేతులు మీదుగా ట్రోఫీలను అందుకున్నాయి. ఇక, విశాఖలోని వైఎస్‌ఆర్‌ స్టేడియంలో ప్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ ఫైనల్‌లో ఏలూరు జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నక్కవానిపాలెం(విశాఖ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. ఏలూరు జిల్లా అశోక్‌ పిల్లర్‌ రోడ్డుకు చెందిన జట్టు తొలి 16 ఓవర్లలోనే విజయాన్ని దక్కించుకుని విజేతగా నిలిచింది. విశాఖ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను సీఎం జగన్‌ వీక్షించారు.  




కబడ్డీలో బాపట్ల సత్తా


కబడ్డీ పురుషుల ఫైనల్‌ పోటీలు ఏయూ గ్రౌండ్స్‌లో జరిగాయి. ఈ పోటీల్లో బాపట్ల జట్టు విజయం సాధించింది. తిరుపతి పరిధిలోని నాగులాపురం-1కి చెందిన జట్టుపై బాపట్లకు చెందిన కొత్తపాలెం-2 జట్టు విజయం సాధించింది. నాగులాపురం జట్టు రన్నరప్‌గా నిలిచింది. తొలి అర్ధ భాగంలో బాపట్ల 15-7తో ఆధిక్యాన్ని ప్రదర్శించగా, రెండో అర్ధభాగంలో 26-17తో విజయం సాధించింది.  




14 మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్ల దతత్త


ఆడుదాం ఆంధ్రలో భాగంగా అత్యుత్తమ ప్రతిభతో అదరగొట్టిన పలువురు క్రీడాకారులను దత్తత తీసుకుని ట్రైనింగ్‌ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌, ప్రొ కబడ్డీ, బ్లాక్‌ హాక్స్‌, వాలీబాల్‌, ఏపీ ఖోఖో అసోసియేషన్‌, ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 14 మంది క్రీడాకారులను మరింత సానబెట్టనున్నారు. వీరిలో క్రికెట్‌ నుంచి పవన్‌(విజయనగరం), చెల్లెమ్మ, కేవీఎం విష్ణువరోధని(ఎన్‌టీఆర్‌ జిల్లా)ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ దత్తత తీసుకుని మరింత మెరుగైన శిక్షణ ఇవ్వనుంది. క్రికెట్‌ నుంచే శివ(అనపర్తి), చెల్లమ్మ గాయత్రి(కడప జిల్లా)ని దత్తత తీసుకోవడానికి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) ముందుకు వచ్చింది.




సతీష్‌(తిరుపతి), బాలకృష్ణారెడ్డి(బాపట్ల)ని ప్రొ కబడ్డీ టీమ్‌ దత్తత తీసుకుంది. సుమన్‌(తిరుపతి), సంధ్య(విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌, వాలీబాల్‌కు సంబంధించి ఎం సత్యం(శ్రీకాకుళం), మహిళల విభాగానికి సంబంధించి మౌనిక(బాపట్ల)ను దత్తత తీసుకునేందుకు బ్లాక్‌ హాక్స్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఖోఖోకు సంబంధించి రామ్మోహన్‌(బాపట్ల), హేమావతి(ప్రకాశం)లకు తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్‌ ముందుకు వచ్చింది. బ్యాడ్మింటన్‌లో ఏ వంశీకృష్ణరాజు(ఏలూరు), ఏ ఆకాంక్ష(బాపట్ల)ను ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించనుంది. 






ఆరోగ్యం, ఆటలపై శ్రద్ధ, మక్కువ పెంచేందుకు దోహదమన్న సీఎం


ఆడుదాం ఆంధ్ర విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ స్థాయి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ, ఆటలపై మక్కువ పంచేందుకకు ఆడుదాం ఆంధ్ర ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24.45 లక్షల మంది క్రీడాకారులు పాలు పంచుకున్నారని, ఈ కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 47 రోజులపాటు ఉత్సాహభరితంగా నిర్వహించిన ఆటలు అద్భుతంగా సాగాయన్నారు. ఆరోగ్యానికి వ్యాయామం, క్రీడలు ఎంతో అవసరమన్న అంశంపై రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో, గ్రామంలో అవగాహన పెరగాలన్నారు.