India next CDS from Doval office : దేశ రక్షణ రంగంలో అత్యున్నత పదవి అయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఎన్.ఎస్. రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ప్రస్తుత సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానంలో సుబ్రమణి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ నేతృత్వంలోని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ లో సైనిక సలహాదారుగా పనిచేస్తున్న ఆయన, ఈ నియామకంతో పాటు మిలిటరీ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తారు. వరుసగా మూడవసారి కూడా సీడీఎస్ పదవి ఆర్మీ విభాగానికే దక్కింది.
దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సైనిక అనుభవం కలిగిన రాజా సుబ్రమణి, భారత సైన్యంలో అనేక కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు. 1985లో గర్వాల్ రైఫిల్స్‌లో కమిషన్ పొందిన ఆయన, అస్సాంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాటాల్లో 16 గర్వాల్ రైఫిల్స్ విభాగానికి నాయకత్వం వహించారు. పశ్చిమ సరిహద్దులో భారత సైన్యానికి చెందిన అత్యంత కీలకమైన స్ట్రైక్ కోర్ కమాండర్‌గా, ఆర్మీ వైస్ చీఫ్‌గా , సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా ఆయన సేవలు అందించారు. సరిహద్దుల్లో వ్యూహాత్మక సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో ఆయన అనుభవం దేశానికి ఎంతో కీలకం కానుంది.
నూతన సీడీఎస్ ముందు ప్రస్తుతం అనేక సవాళ్లు వేచి ఉన్నాయి. ముఖ్యంగా ఆర్మీ, నేవీ , ఎయిర్ ఫోర్స్ విభాగాలను ఏకీకృతం చేస్తూ థియేటర్ కమాండ్స్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంది. దీనితో పాటు, ఐరోపా , పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాల కారణగా మారుతున్న యుద్ధ తంత్రాలకు అనుగుణంగా భారత సాయుధ దళాలను ఆధునీకరించడం, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటి అంశాలపై ఆయన ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఎన్ఎస్సీఎస్ నుంచి సీడీఎస్ పదవికి ఎంపిక కావడం ద్వారా వ్యూహాత్మక నిర్ణయాల్లో ఆయనకు ఉన్న పట్టు రక్షణ రంగానికి అదనపు బలం కానుంది.
మరోవైపు, భారత నౌకాదళానికి కూడా నూతన సారథిని ప్రభుత్వం ఖరారు చేసింది. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ తదుపరి నేవీ చీఫ్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం నేవీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్న ఆయన, మే 31న రిటైర్ కానున్న అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. కమ్యూనికేషన్ , ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ నిపుణుడైన స్వామినాథన్, గతంలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకకు , వెస్ట్రన్ ఫ్లీట్‌కు కమాండర్‌గా పనిచేశారు. రక్షణ రంగంలోని ఈ కీలక మార్పులతో భారత భద్రతా వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.
అజిత్ డోవల్, రాజా సుబ్రమణి మధ్య ఉన్న అనుబంధం కేవలం ఉన్నతాధికారుల మధ్య ఉండే సంబంధం మాత్రమే కాదు. అది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక బంధం. జాతీయ భద్రతా సలహాదారు గా డోవల్ దేశ రక్షణ వ్యూహాలను రచిస్తుంటే, ఆయన కార్యాలయంలో సైనిక సలహాదారుగా ఉన్న సుబ్రమణి ఆ వ్యూహాలకు సైనిక రూపాన్ని ఇస్తూ అత్యంత సన్నిహితంగా పనిచేశారు. గత సీడీఎస్ అనిల్ చౌహాన్ తరహాలోనే, డోవల్ పర్యవేక్షణలో దేశ భద్రతా సవాళ్లపై పూర్తి పట్టు సాధించిన వ్యక్తి కావడం వల్లే రాజా సుబ్రమణికి ఈ అత్యున్నత పదవి దక్కింది. కీలకమైన భద్రతా నిర్ణయాల్లో డోవల్ నమ్మకస్తుడైన సలహాదారుగా గుర్తింపు పొందడమే సుబ్రమణి నియామకానికి ప్రధాన కారణమైంది.
