Israel Hamas War: 



బైడెన్ వ్యాఖ్యలు..


అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయేల్‌పై హమాస్ దాడుల వెనక ఉన్న కారణాలను ప్రస్తావించారు. G20 సదస్సులో భారత్‌ India-Middle East-Europe Economic Corridor ని ప్రకటించింది. ఈ కారిడార్ ప్రకటన వచ్చిన తరవాతే హమాస్‌ దాడులకు ప్లాన్ చేశారని అన్నారు బైడెన్. ఈ కారిడార్‌లో భాగంగా భారత్‌ని, మధ్యప్రాచ్యాన్ని రైల్‌, రోడ్‌, పోర్ట్‌ల ద్వారా అనుసంధానించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇజ్రాయేల్‌పై హమాస్ దాడి చేయడానికి చాలా కారణాలుండొచ్చని, అయితే వాటిలో ఈ కారిడార్‌ కారణం ఎక్కువగా కనిపిస్తోందని వివరిస్తున్నారు బైడెన్. ఇదే కారణమని చెప్పడానికి తన వద్ద ఆధారాలు లేకపోయినా...కేవలం ఇది తన అంచనా మాత్రమే అని చెప్పారు. 


"హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయేల్‌పై దాడి చేయడానికి చాలా కారణాలుండొచ్చు. కానీ భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్‌ ప్రకటించిన తరవాతే ఈ దాడులు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే ఈ దాడుల వెనక ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని అనిపిస్తోంది. ఇందుకు సంబంధించి నా వద్ద ఆధారాలు లేవు. కానీ ఇది నా అంచనా మాత్రమే. ఏమైనా కావచ్చు. ఇజ్రాయేల్ అభివృద్ధికి మేం ఎప్పటికీ కట్టుబడి ఉంటాం. ఆ అభివృద్ధి పనుల్ని ఆపం"


- జో  బైడెన్, అమెరికా అధ్యక్షుడు 


కారిడార్‌తో కనెక్టివిటీ..


ఆస్ట్రేలియా ప్రధాని యాంటోని ఆల్బనీస్‌తో భేటీ అయిన సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు బైడెన్. ఢిల్లీలో జరిగిన G20 సదస్సులో భారత్‌, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐరోపా సమాఖ్య కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. మిడిల్ ఈస్ట్ ఐరోపా ఎకనామిక్ కారిడార్‌ నిర్మాణానికి అంగీకరించాయి. ఆసియా, పశ్చిమాసియా, మధ్యాసియా, ఐరోపా మధ్య కనెక్టివిటీని పెంచనుంది ఈ కారిడార్. ఇటీవలే ఈ కారిడార్ గురించి మాట్లాడారు బైడెన్. ఈ ప్రాజెక్ట్‌తో పెద్ద ఎత్తున పెట్టుబడులు వెల్లువెత్తుతాయని అన్నారు. 


ఇజ్రాయేల్,గాజా యుద్ధంపై (Israel Hamas War) ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోనూ (UN Security Council) చర్చ జరిగింది. గాజాని ఇజ్రాయేల్‌ ఆక్రమించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతోందన్న వాదన ఇప్పటికే వినిపిస్తోంది. దీనిపై మండలి అసహనం వ్యక్తం చేసింది. గాజా పౌరుల భద్రతను పణంగా పెట్టారని మండి పడింది. ఈ యుద్ధం కారణంగా వేలాది మంది పౌరులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపింది. అయితే...ఇజ్రాయేల్‌కి అమెరికా పూర్తి మద్దతునిస్తోంది. ఇజ్రాయేల్‌ తనకు నచ్చిన నిర్ణయం తీసుకోవచ్చుని తేల్చి చెప్పింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో ప్రస్తుత జనాభా 23 లక్షల వరకూ ఉంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి వీళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇజ్రాయేల్‌ దాడుల్లో ఇళ్లు,భవనాలు నేలమట్టం అవుతున్నాయి. కొందరు శిథిలాలే కిందే చిక్కుకుపోతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉంటున్నారు. అంతర్జాతీయంగా ఇది చాలా అలజడి రేపింది. తినేందుకు తిండి లేదు. గొంతు తడుపుకునేందుకు నీళ్లూ కరవయ్యాయి. ఈ దాడుల్లో గాయపడ్డ వారికి చికిత్స అందించడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. 


Also Read: మణికట్టుకి బ్రేస్‌లెట్‌లు, మోచేతులపై పేర్లు - తమ వాళ్లను గుర్తు పట్టేందుకు పాలస్తీనా పౌరుల అవస్థలు