దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25,404 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,32,89,579కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న నమోదైన కేసులతో పోలిస్తే.. 6.8 శాతం తగ్గుదల కనిపించింది. కోవిడ్ బాధితుల్లో గత 24 గంటల వ్యవధిలో 339 మంది మరణించారు. వీటితో కలిపి దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 4,43,213కి పెరిగింది.


నిన్న ఒక్క రోజే 37,127 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 3,24,84,159కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,62,207 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్న ఒక్క రోజే 78,66,950 మందికి కోవిడ్ టీకాలు అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 75,22,38,324 మందికి కోవిడ్ వ్యాక్సిన్లు అందించినట్లు పేర్కొంది. కాగా, దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం కేరళలోనే ఉన్నాయి. కేరళలో గత 24 గంటల్లో 15,058 కొత్త కేసులు నమోదయ్యాయి. 


75 కోట్ల మందికి వ్యాక్సిన్లు.. 
కోవిడ్ వ్యాక్సినేషన్ల పంపిణీలో భారత్ మరో మైలురాయిని అందుకుంది. దేశంలో ఇప్పటివరకు 75 కోట్ల మందికి పైగా కోవిడ్ వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75వ సంవత్సరంలో మన దేశంలో టీకాల సంఖ్య 75 కోట్లను దాటిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘సబ్‌ కా సాథ్, సబ్‌ కా ప్రయాస్’ అనే మంత్రంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త కోణాలను సృష్టిస్తున్నట్లు తెలిపారు.





Also Read: Petrol-Diesel Price, 14 September 2021: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... దేశంలోని ప్రధాన నగరాల్లో స్థిరంగా ఇంధన ధరలు 


Also Read: RBI Alert: బీ అలర్ట్.. కొంచెం అజాగ్రత్తగా ఉంటే నిండా ముంచేస్తారు.. ఆ విషయంపై ఆర్బీఐ హెచ్చరిక