Trump imposes 25 percent tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం భారత ఎగుమతిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై 25 శాతం సుంకాలు  విధిస్తామని ట్రంప్ ప్రకటించారు.  భారత్-ఇరాన్ మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్యంపై దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బాస్మతీ బియ్యం, టీ పొడి, పండ్లు వంటి ఉత్పత్తుల ఎగుమతులపై ఈ పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపనున్నాయి.

Continues below advertisement

భారత్ నుండి ఇరాన్‌కు ఎగుమతి అయ్యే వస్తువుల్లో బాస్మతీ బియ్యం అత్యంత ప్రధానమైనది. ఇరాన్ తన బియ్యం అవసరాల కోసం ప్రధానంగా భారత్‌పైనే ఆధారపడుతుంది. ట్రంప్ హెచ్చరికల వల్ల ఎగుమతిదారులు కొత్త ఆర్డర్లు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. ఒకవేళ 25 శాతం అదనపు సుంకాలు అమల్లోకి వస్తే, అమెరికా మార్కెట్‌కు ఎగుమతి చేసే భారతీయ వస్తువుల ధరలు పెరిగి, అక్కడ మన వస్తువుల పోటీతత్వం దెబ్బతినే ప్రమాదం ఉంది.

బియ్యంతో పాటు టీ పొడి, యాపిల్స్, కివీ పండ్ల వాణిజ్యంపై కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇరాన్ నుండి భారత్ ప్రధానంగా ముడి చమురు దిగుమతి చేసుకునేది, కానీ గతంలో అమెరికా ఆంక్షల వల్ల అది ఇప్పటికే నిలిచిపోయింది. ప్రస్తుతం కేవలం వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలపైనే వాణిజ్యం సాగుతోంది. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల ఇరాన్‌తో వ్యాపారం చేసే భారతీయ కంపెనీలు అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుంది.        

Continues below advertisement

ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌తో రూపాయి వాణిజ్యం ద్వారా లావాదేవీలు జరపాలని భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ, అమెరికా విధించే సుంకాల వల్ల కలిగే నష్టాన్ని పూడ్చుకోవడం కష్టతరమే. అంతర్జాతీయ దౌత్యం ,వాణిజ్య ప్రయోజనాల మధ్య సమతుల్యతను కాపాడుకుంటూ, దేశీయ ఎగుమతిదారులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది.