Toronto gold heist Accuse in India: కెనడా చరిత్రలోనే అతిపెద్ద బంగారు దోపిడీ కేసులో కీలక నిందితుడైన అర్సలాన్ చౌదరిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ భారీ చోరీకి సంబంధించి, దుబాయ్ నుండి టొరంటో చేరుకున్న అతడిని పీల్ రీజినల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన న్యాయవాదుల ద్వారా పోలీసులకు లొంగిపోయేందుకు ముందే ఒప్పందం కుదుర్చుకున్న అర్సలాన్, విమానం దిగగానే పట్టుబడ్డాడు.
ఈ భారీ దోపిడీ ఏప్రిల్ 17, 2023న జరిగింది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుండి వచ్చిన విమానంలో సుమారు 400 కిలోల బంగారంస 2.5 మిలియన్ డాలర్ల నగదు ఉంది. విమానాశ్రయంలోని కార్గో హ్యాండ్లింగ్ యూనిట్ నుండి ఈ నిధిని అత్యంత చాకచక్యంగా మాయం చేశారు. ఈ కేసులో ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగుల ప్రమేయం కూడా ఉందని, అంతర్గతంగా కొంత మంది వ్యక్తుల సహకారంతోనే ఈ చోరీ జరిగినట్లు దర్యాప్తులో తేలింది.
అరెస్ట్ అయిన అర్సలాన్ చౌదరిపై దొంగతనం, నేరపూరిత కుట్ర , అక్రమంగా సంపాదించిన ఆస్తులను కలిగి ఉండటం వంటి తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. దోపిడీ చేసిన బంగారాన్ని విక్రయించడంలో, ఆ సొమ్మును కెనడా వెలుపలికి తరలించడంలో ఇతడు కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల సహకారంతో ఈ కేసును ఛేదించామని, నిందితులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని పోలీసులు అంటున్నారు.
అయితే, ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు , ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి అయిన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకున్నట్లు కెనడా పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం కెనడా వ్యాప్తంగా వారెంట్ జారీ చేయబడింది. 'ప్రాజెక్ట్ 24K' పేరుతో కొనసాగుతున్న ఈ విచారణలో మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఈ దోపిడీకి సంబంధించి పలువురిని అరెస్ట్ చేసినా, పూర్తిస్థాయిలో రికవరీ ఇంకా కాలేదు.