Srinagar G20 Meet: 


టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు..


జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో కీలకమైన G-20 సదస్సు జరుగుతోంది. G-20 దేశాలకు చెందిన 60 మంది ప్రతినిధులు శ్రీనగర్‌కు చేరుకుంటున్నారు. 3rd Tourism Working Group సమావేశం నిర్వహిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కి సంబంధించి ఆర్టికల్ 370 రద్దు చేసిన తరవాత ఇక్కడ అంతర్జాతీయ సదస్సు జరగడం ఇదే తొలిసారి. అందుకే...భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టారు. Sher-e-Kashmir International Convention Center వద్ద ఈ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా G-20 చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ షింగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ G-20 సదస్సుకి అధ్యక్షత వహించేందుకు సిద్ధంగా ఉందని, ఇప్పటికే దేశవ్యాప్తంగా 118 సమావేశాలు నిర్వహించామని స్పష్టం చేశారు. శ్రీనగర్‌లో నిర్వహిస్తున్న టూరిజం మీటింగ్‌కి గతంలో కన్నా ఎక్కువ మంది  ప్రతినిధులు వచ్చారని చెప్పారు. సింగపూర్‌ నుంచి ఎక్కువ మంది వచ్చినట్టు తెలిపారు. వీరిలో కొందరు ప్రత్యేక అతిథులు కూడా ఉన్నారని వివరించారు. 










చైనా దూరం..


అయితే...అటు చైనా మాత్రం ఈ మీటింగ్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఇక సౌదీ అరేబియా ఈ ఈవెంట్‌కి రిజిస్టర్ చేసుకోలేదు. టర్కీ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. చైనా ఎందుకు వ్యతిరేకిస్తోందో...ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. "వివాదాస్పద ప్రాంతాల్లో ఇలాంటి సమావేశాలు నిర్వహించినప్పుడు చైనా వాటికి హాజరుకాదు" అని తేల్చి చెప్పారు. అయితే..భారత్ మాత్రం ఇందుకు గట్టి కౌంటర్ ఇచ్చింది. తమ భూభాగంలో సమావేశాలు నిర్వహించుకునే హక్కు తమకు ఉంటుందని స్పష్టం చేసింది. చైనాతో వివాదాలు సద్దుమణిగి శాంతియుత వాతావరణం నెలకొనాలంటే..సరిహద్దు నిబంధనలకు కట్టుబడి ఉండాలని వెల్లడించింది. ఈ సదస్సుకి ఎలాంటి అంతరాయం కలగకుండా సెక్యూరిటీ టైట్ చేశారు. మెరైన్ కమాండోలతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌లు కూడా పెద్ద ఎత్తున మొహరించారు. యాంటీ డ్రోన్ యూనిట్స్‌ని యాక్టివేట్ చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. ఆర్మీతో పాటు బీఎస్‌ఎప్, సీఆర్‌పీఎఫ్, జమ్ముకశ్మీర్ పోలీసులు అన్ని చోట్లా నిఘా పెడుతున్నారు. ట్రాఫిక్‌ పైనా ఆంక్షలు విధించారు.