సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో భారత్ భేష్..


యునెస్కోలోని ఇంటర్‌గవర్నమెంటల్ కమిటీలో భారత్‌ చోటు దక్కించుకుంది. సాంస్కృతిక వారసత్వాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నందుకు గానూ యునెస్కోలో భాగమైన ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్-ICH కమిటీకి ఎంపికైంది. 2022 నుంచి 2026 వరకూ భారత్ ఈ కమిటీలో కొనసాగనుంది. ఈ ICH కమిటీలో ఇప్పటికే రెండు సార్లు చోటు సంపాదించుకుంది. 2006-10 వరకూ మొదటిసారి, 2014-18 వరకూ రెండోసారి కమిటీలో ఉంది. ఇప్పుడు మరోసారి అదే కమిటికీ ఎంపికైంది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ట్విటర్‌లో వెల్లడించారు. "ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ జరుపుకుంటున్న ఈ తరుణంలో భారత్‌ రెండు కీలక కమిటీలకు ఎంపికవటం ఆనందంగా ఉంది. ఇంటాంగిబుల్ కల్చరల్ హెరిటేజ్-ICH,వరల్డ్ హెరిటేజ్ కమిటీల్లో భారత్ చోటు సంపాదించుకుంది. వసుదేవ కుటుంబకం అనే భారత మౌలిక సూత్రాన్ని మరోసారి చాటి చెప్పేందుకు ఇదో అవకాశంగా భావిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. యునెస్కోలో భాగమైన ఈ IHC కమిటీ సాంస్కృతిక వారసత్వ కట్టడాలను ఎలా పరిరక్షించుకోవాలి, వాటిని రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై పూర్తి స్థాయి గైడెన్స్ ఇస్తుంది. ఇందుకు సంబంధించిన పలు సిఫార్సులనూ చేస్తుంది.









 


ఆరు దేశాలు పోటీ పడినా..భారత్‌కే ఓటు 


ఈ కట్టడాలను కాపాడుకోవటంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఇందుకోసం ఎలాంటి ప్రాజెక్ట్‌లు చేపడతారు అనే వివరాలతో ఈ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వినతులన్నింటినీ పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటారు. అంతే కాదు. అవసరమైన సమయంలో అంతర్జాతీయ సహకారాన్నీ తీసుకునేందుకు ఈ కమిటీ తోడ్పడుతుంది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతం నుంచి దాదాపు ఆరు దేశాలు ఈ కమిటీలో ఎంపికయ్యేదుకు దరఖాస్తు చేసుకున్నాయి. బంగ్లాదేశ్, వియత్నాం, కంబోడియా, మలేషియా, థాయ్‌లాండ్ కూడా భారత్‌తో పాటు అప్లై చేశాయి. అయితే ఈ ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించగా 110 ఓట్లు సాధించింది భారత్. 2022-26 మధ్య కాలంలో సాంస్కృతిక వారసత్వాన్ని ఎలా కాపాడుకుంటామన్న విషయాలను స్పష్టంగా వివరించింది భారత్. అందుకే అంత మంది మద్దతుతో కమిటీకి ఎంపికైంది.